60ఏళ్ళ కల నెరవేరింది: తెలంగాణపై ప్రధాని
posted on Feb 22, 2014 @ 11:25AM
15వ లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మన్మోహన్ సింగ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాంటి అస్థిరతకు తావు లేకుండా, ప్రాధాన్యం లేని లాభ నష్టాల గురించి చింతించకుండా క్లిష్టమైన కొన్ని నిర్ణయాలను ఈ దేశం తీసుకోగలదని తెలంగాణ ఏర్పాటైన తీరుతో స్పష్టమయ్యిందని చెప్పారు. కీలకమైన అంశాల విషయంలో వ్యక్తిగతవాదాలను వదిలిపెట్టి జాతి ఐక్యత కోసం కృషి చేసే సత్తా మనకు ఉందని లోక్‌సభ నిరూపించిందన్నారు. అణగారిన వర్గాల్లో ఆశలు రేకెత్తించిన ఆహార భద్రత చట్టం మరొక చారిత్రక చట్టమని ప్రధాని అన్నారు. 15వ లోక్‌సభకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. హోం మంత్రి షిండే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అంశం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. పదేళ్ల కిందట తమ పార్టీ అధ్యక్షురాలు ఈ మేరకు హామీ ఇచ్చారని, దీన్ని అమలు చేసే క్రమంలో బీజేపీ కూడా తమకు సహకరించటం స్వాగతించాల్సిన విషయమన్నారు.