సీఎం సీటు కోరిన చిరు

      ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి జోరందుకున్నాయి. రాష్ట్ర విభజనకి నిరసనగా రాజీనామా చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు మొదలు పెట్టింది. సీఎం సీటు కోసం ఇరుప్రాంత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ లో లాబీయింగ్ లు మొదలుపెట్టారు. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో భేటి అయిన కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీకి పునరుత్తేజం కల్పిస్తానని హామి ఇచ్చారట. ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ ఆయనకి వివరించినట్లు సమాచారం. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ కూడా దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

జేసి సోదరులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

      జేసి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని గత కొంతకాలంగావార్తలు వస్తున్నాయి. అయితే వీరి రాక ఇప్పుడు ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాబు జిల్లా నేతలతో చర్చలు జరిపి అందరిని ఒప్పించారట. జేసి సోదరుల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిటాల సునీతను కూడా రాజీపడ్డారని అంటున్నారు.   సోమవారం టిడిపి సీమాంధ్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు, ఆ తరువాత అనంతపురం జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సమావేశంలో బాబు జిల్లాలో పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అలాగే నేతలతో జేసి సోదరులు చేరికపై చర్చించి..నేతలను ఒప్పించారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి దివాకర్ రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

సోషల్ మీడియాకే షిండే హెచ్చరిక

      ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియాను అణచివేస్తానని హెచ్చరికను జారీ చేసిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వెనక్కి తగ్గారు. తాను ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలను చేసినట్లు వివరణ ఇచ్చారు.   తన స్వంత జిల్లాలో యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ..  ఎలక్ట్రానిక్ మీడియాకి హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. తనపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఓ వర్గం మీడియా పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఒక మీడియా ఆధారాలు లేని తప్పుడు ప్రసారాలు ప్రచారం చేస్తూ..తమ పార్టీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ తరహా ప్రసారాలను వెంటనే ఆపకపోతే ఆ మీడియాను అణచివేస్తానని వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై దూమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు. తాను సోషల్ మీడియాను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.         

కాంగ్రెస్ లో విలీనానికి కేసిఆర్ సిద్దం..!!

      కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీన౦ దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విలీనానికి సుముఖంగా వున్నట్లు సమాచారం. నిన్న ఢిల్లీలో వరుస భేటిలతో బిజీగా గడిపిన కేసిఆర్, దిగ్విజయ్ సింగ్ తో విలీనం, పొత్తులపై చర్చించారు. గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ లో పార్టీని వీలినం చేస్తారని ప్రకటించారు. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య ఒక అవగాహన కూడా కుదిరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని, ఎన్నికల్లో పార్టీకి ఆయనే విజయ సారథ్యం వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కేసిఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలా లేక కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలా అనే దానిపై ఇద్దరి మధ్య ఇంకా స్పష్టతా రాలేదని అంటున్నారు. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టతా వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత తెలంగాణలో భారీ బహీరంగసభ ఏర్పాటు చేసి వీలినం ప్రకటన చేయనున్నారు.

ఎలక్ట్రానిక్ మీడియాకి షిండే హెచ్చరిక

      కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియాను అణచివేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పర్యటనలో యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ మీడియాకి హెచ్చరికలు జారీ చేశారట. తనపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఓ వర్గం మీడియా పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఒక మీడియా ఆధారాలు లేని తప్పుడు ప్రసారాలు ప్రచారం చేస్తూ..తమ పార్టీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ తరహా ప్రసారాలను వెంటనే ఆపకపోతే ఆ మీడియాను అణచివేస్తానని వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆయన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. కొంతమంది నేతలు షిండే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మార్చి 2న సీఎం కిరణ్ కొత్త పార్టీ !

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో భేటి అయిన పార్టీ విధి, విధానాలు ఎలా వుండాలనే అంశపై చర్చించినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు జేసీ దివాకరరెడ్డి, గాదె వెంకటరెడ్డి, కొర్ల భారతి, రౌతు సూర్యప్రకాశ రావు, వంగా గీత, పంతం గాంధీ, అంజిబాబు, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, ఇందిర, లక్ష్మీశివకుమారి, రెడ్డప్పరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, విజయరామిరెడ్డి, ప్రభాకర రెడ్డి, వెంకటరమణలతో కిరణ్ సమావేశమయ్యారు. ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. దాదాపు ఇంటర్య్వూ స్థాయిలో సాగిన ఈ అభిప్రాయ సేకరణలో కొత్త పార్టీ స్థాపన అంశం ప్రస్తావించారు. యువత, మహిళలు, ఉద్యోగులే లక్ష్యంగా కిరణ్ కొత్త పార్టీని స్థాపించనున్నారు. మార్చి 2న తిరుపతి లేదా రాజమండ్రిలో భారీ బహీరంగసభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

ఏక్ దిన్ కా సుల్తాన్ ఎవరో?

  రాష్ట్ర విభజన వ్యవహారాన్ని చక్కబెట్టేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా ముందు మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. 1. తెరాసను విలీనం చేసుకోవడం.2. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని నియమించడం.3. సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడం.   వీటిలో మొదటి అంశంపై ఇప్పటికే కాంగ్రెస్-తెరాస అగ్రనేతల మధ్య చర్చలు, గ్రూప్ ఫోటోలు దిగడంవంటివి పూర్తయిపోయాయి. ప్రస్థుత పరిస్థితుల్లో తెరాసను విలీనం చేయడం కంటే రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటేనే ఇరువురికీ లాభం ఉంటుందని కేసీఆర్ కాంగ్రెస్ యువరాజు గారికి బ్రెయిన్ వాష్ చేసే ఉంటారు. ఒకవేళ తెరాస విలీనానికి ఒప్పుకోకుండా పొత్తులకే పట్టుబట్టినా కాంగ్రెస్ పార్టీకి అంతకంటే వేరే గత్యంతరం లేదు గనుక, తప్పని సరిగా దానికే అంగీకరించవలసి ఉంటుంది. కనుక ఇక పొత్తుల ప్రకటన లాంచనమే అనుకోవచ్చును.   మొదట తెలంగాణాకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినప్పటికీ, ఇప్పుడు తెరాస కొండంత అండగా నిలబడి ఉన్నందున అక్కడ పార్టీకి వచ్చేఇబ్బందేమీ లేదు గనుక, సీమాంధ్రలో బలహీనంగా ఉన్న పార్టీ పరిస్థితిని చక్క దిద్దుకోవడానికి అక్కడి నేతనే ముఖ్యమంత్రిగా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిశ్చయించుకొన్నట్లు సమాచారం. ఏక్ దిన్ కా సుల్తాన్ (ఒక్క రోజు రాజుగారు) పదవిలాంటి మూడు నెలలు ముఖ్యమంత్రి పదవి కోసం కూడా చాలా మందే అర్రులు చాస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు. ముఖ్య మంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి కోసం చొంగలు కార్చుకొంటున్న తన వీరవిధేయ నేతలకి అవి పడేస్తే, వారే సీమాంధ్రలో పార్టీని బలపరిచే బాధ్యత కూడా తమ నెత్తి మీద వేసుకొంటామని హామీ ఇస్తున్నారు గనుక ఒకే దెబ్బకి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు వారందరినీ డిల్లీకి పిలిచి పదవుల పంపకాలు, వారి కుటుంబ సభ్యులకు టికెట్స్ కేటాయింపులు వగైరాలు చేసి రాష్ట్రానికి ఆఖరి కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు తెరాస, టీ-కాంగ్రెస్ నేతలందరూ కూడా సోనియాగాంధీ గీసిన గీత దాటబోరని రూడీ అయింది గనుక, సీమాంధ్రకు చెందిన వ్యక్తినే ఏక్ దిన్ కా సుల్తాన్ గా ప్రకటించేందుకు ఇబ్బందేమీ ఉండదు.అందువలన బహుశః ఈ రోజే కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించవచ్చును.

లాలూ కొంపముంచిన నేతలు

      రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆర్జెడి పార్టీకి 13మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పడిపోయింది. ఎమ్మెల్యేలు రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ కి సోమవారం మధ్యాహ్నం అందజేశారు. తాము ఆర్జెడి పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్లు ప్రకటించాలని వారు స్పీకర్ ని కోరగా... స్పీకర్ వారి అభ్యర్థనను వెంటనే అంగీకరించినట్లు సమాచారం. వీరంతా అధికార పార్టీ అయిన జెడియూలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరుగుతున్నదని తాను విన్నానని, అది నిజమా? కాదా? అనేది ఇంకా తెలియదని ఆర్జేడీ అధినేత లాలూ వ్యాఖ్యానించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ కి ఎమ్మెల్యేల రాజీనామా గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హరికృష్ణను దూరంగా పెడుతున్నారా!

      తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన మధ్య అంతరం పెరిగినట్లే కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేశాననే తనని దూరంగా వుంచుతున్నట్లు అనుమానంగా ఉందని అన్నారు. పార్టీలో జరిగే కార్యక్రమాలన్ని మీడియాలో చూసి తెలుసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతాస్థాయి సమావేశానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. అసలు తాను పార్టీలో ఉన్నానో, లేనో తెలియని అయోమాయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై హరికృష్ణ అసంతృప్తిగా ఉన్నారు.

జగన్ ఓదార్పు యాత్రా..ఎందుకు?

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి త్వరలో తెలంగాణలో మళ్ళీ ఓదార్పు యాత్రలు మొదలు పెట్టబోతున్నారనే వార్తలు రావడంతో, తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు జగన్ ఓదార్పు అనడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో నేతలు లేకుండా పోయినందుకు ఆయనకే ఓదార్పు అవసరమని అన్నారు. పలు సీనియర్ల రాజకీయ జీవితాలను దెబ్బ తీసిన జగన్ ఓదార్పులు చేయడం దురదృష్టకరమని అన్నారు. జగన్ ను తెలంగాణ ప్రజలు ఆదరించరని, గతంలో ఎదురైనా అనుభవాలు గుర్తుచేసుకోవాలని అన్నారు. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఓదార్పు యాత్ర చేస్తారని ప్రశ్నించారు.

సీమాంద్రకు రాజధాని నిర్మిస్తా: బాబు

      కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనమైందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, త్వరలో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం, ఓట్లు, సీట్లు కోసం తెలుగుజాతిని కాంగ్రెస్ రెండుగా చీల్చిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్, వైసీపీలు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యాయని తాను చెప్పిన మాటలు వాస్తవమయ్యాయని తెలిపారు. టీడీపీ రెండు ప్రాంతాలలోనూ బలంగా ఉందని, తెలంగాణలోని బలహీనవర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీమాంద్రలో రాజధాని ఎలా నిర్మించాలో తనకు తెలుసునని అన్నారు. వైకాపాకు తెలిసింది చంచల్గూడ జైలేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే సీమాంద్రకు అన్ని వసతులు గల రాజధానిని టిడిపి నిర్మిస్తు౦దన్నారు.

ఇక రాజధాని అంశంతో రాజకీయాలా?

  ఇంతవరకు రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆంధ్రాకో లేదా తెలంగాణాకో అనుకూలంగా మాట్లాడినట్లయితే రెండో ప్రాంతంలో ఓట్లు పోతాయని రాజకీయ పార్టీలు భావించేవి. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఇదే సూత్రం వర్తింపజేస్తున్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కర్నూలుని రాజధానిని చేయాలంటూ రెండు రోజులు దీక్షకు కూర్చొన్న ఆయన రాయలసీమకు చెందిన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురూ కూడా మిగిలిన జిల్లాలలో ఓట్లు పోతాయనే భయంతోనే రాజధాని విషయం మాట్లాడకుండా దాటవేస్తున్నారని, ఇటువంటి నేతల వలననే రాయలసీమ వెనుకబడిపోయిందని ఆక్షేపించారు.   తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొత్త రాజధానిని ఏవిధంగా నిర్మించుకోవాలో తనకు బాగా తెలుసని చెపుతూనే రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని ఎన్నికల తరువాత అధికారం చెప్పట్టే కొత్త ప్రభుత్వమే చూసుకొంటుందని చెప్పడం చూస్తే బైరెడ్డి ఆరోపణలు నిజమేనేమోనని నమ్మవలసివస్తోంది.   ఇప్పటికే అనేకమంది రాజకీయ నేతలు తమ తమ ప్రాంతాలలోనే రాజధాని నిర్మించాలని స్థానిక ప్రజల, విద్యార్ధుల, మేధావుల, ఉద్యోగుల మద్దతు కూడా గట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఇంతవరకు సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలను ఆక్కట్టుకోవాలని ప్రయత్నించిన రాజకీయ నేతలు బహుశః రేపు జరుగబోయే ఎన్నికలలో రాజధాని అంశాన్ని రాజకీయ చేసి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తారేమో.

తెలంగాణాలో మళ్ళీ ఓదార్పు లు

      తెలంగాణ ఉద్యమ సమయంలో 'సమైక్యాంధ్ర' నినాదం అందుకొని సీమాంధ్రపై పట్టుకోసం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గట్టిగా కృషి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాకపోయినా సీమాంధ్రపై పట్టు కోసం నిరాహార దీక్షలు, ధర్నాలు, సమైక్య సభలు, శంఖారావాలు  అంటూ చాలానే చేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిపోయింది గనుక మళ్ళీ తెలంగాణలో భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. ఈ రోజు తెలంగాణ నేతలతో జగన్ భేటి అయ్యారు. తెలంగాణలోనూ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టిపెడుతుందనీ, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళాలని వైఎస్‌ జగన్‌ ఆయా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మళ్ళీ తెలంగాణాలో పార్టీ నేతలను వెతుకొంటూ జగన్ త్వరలో అంటే మార్చి15 నుండి నల్గొండలో ఓదార్పు యాత్రలు చెప్పట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఆయన ఓదార్పు దేనికో?    

వీలినం...రాహుల్ తో కేసిఆర్ మంతనాలు

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు ఢిల్లీలో రోజు వరుస భేటిలతో బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ తో కేసిఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వీలీనం, ఎన్నికల పొత్తుల పై ఈ భేటిలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రము ఇచ్చినందుకు కృతజ్ఞతగా కొన్నిరోజులుగా ఢిల్లీ లోని ముఖ్యనేతలందరిని కలుస్తున్నారు. ఈ రోజు రాష్ట్రపతిని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.   ఆదివారం కుటుంబ సమేతంగా కేసిఆర్ సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అవసరాలపై ఆమెకు నివేదికనిచ్చారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఏకైక కారకురాలు సోనియా గాంధీయేనని, అందుకే ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికే కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చానని చెప్పారు. తమందరికీ సోనియా తన దీవెనలు అందజేశారని చెప్పారు.  

సీఎం సీటుపై కాంగ్రెస్ నేతల కన్ను

      రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకశాలపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించడంతో కాంగ్రెస్ నేతల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి పీఠ౦ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీమాంద్రలో కన్నాలక్ష్మీనారాయణ, పీసీసీ బొత్స సత్య నారాయణ, ఆనం రా౦ నారాయణ రెడ్డి రేసులులో వుండగా, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అదిష్టానం నుంచి కేంద్రమంత్రి చిరంజీవికి కూడా పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సీటు కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ లు నడుస్తున్నాయి. ఈ రోజు సోనియాతో సభాపతి నాదెండ్ల మనోహర్, దామోదర రాజనరసింహ, సీనియర్ నేత గంగా భవానీ లు వేర్వేరుగా భేటి అయ్యారు. డిగ్గీతో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు భేటీ అయ్యారు.

ధర్మాన ఎఫెక్ట్...వైకాపాకు మాజీల షాక్

      మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేరికతో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళ౦ జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ధర్మాన చేరికకు నిరసనగా ఇద్దరు మాజీ సీనియర్ నేతలు కణతీ విశ్వనాథం, హనుమంతు అయ్యప్పదొరలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆత్మగౌరవ సభ నిర్వహించి వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మాన మొహం కూడా చూడనని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి..ఆయనను తన పక్కన ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. తాము ఏపార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి రాజీనామా జిల్లాలో వైకాపా గట్టి దెబ్బగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. వీరు ఏ పార్టిలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి పార్టీకి చెందిన నేతలు వీరితో పోటాపోటీ భేటీలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు బట్టి వీరు టిడిపికి ప్రాధాన్యం ఇచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి.

టిడిపి గూటికి టీజీ, ఏరాసు, గంటా

      రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో సభ్యులుగా వున్న ముగ్గురు మంత్రులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ రోజు లేదా రేపు టిడిపిలో అధికారకంగా చేరనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంతమంది నేతలు టిడిపిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. టీజీ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తుండగా.. ఏరాసు పాణ్యం అసెంబ్లీ సీటుకు మారబోతున్నారు. గంటా శ్రీనివాసరావు విశాఖ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. నంద్యాల సిటింగ్ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి అక్కడి నుంచే టీడీపీ తరపున పోటీ చేస్తారు. సీమాంధ్ర టీడీపీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం జరగనుంది.

రాష్ట్రపతి పాలన లేనట్టే...!!

      రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన? లేక కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారా? అనే దానిపై మరో రెండు రోజుల్లో స్పష్టతా రానుంది. సీఎ౦ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా తరువాత రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నరసింహన్ నివేదిక పంపించారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై విదించడంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానున్న తరుణంలో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదంటూ రాష్ట్ర అగ్రనేతలు అధిష్టానంపై ఒత్తిడి తెలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వున్న అవకాశాలపై షిండే కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ముఖ్యమంత్రి పదవి ఎవరకి దక్కబోతోంది అనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు: హోంమంత్రి

      సమైక్య రాష్ట్రంలోనే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందినప్పటికి, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత కేంద్రం సీమా౦ద్రకు నిధులు కేటాయించడానికి మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని, ఈ సమయంలో సీమాంద్రకు నిధులు కేటాయించడంపై తాము అధ్యయనం చేయాల్సి వుందని అన్నారు. విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామని పార్లమెంటులో ప్రధాని ప్రకటించనప్పటికీ, దానికి కొంత సమయం పడుతుందని అన్నారు.