తెలంగాణలో కుల రాజకీయాలు భగ్గుమంటున్నాయ్
posted on May 13, 2023 @ 11:15AM
తెలంగాణలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. యాదవకులాన్ని కించపరిచే వాఖ్యలు చేసిన రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాలు తెలంగాణా అంతటా జరుగుతున్నాయి. యాదవ కులానికి రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులతో బాటు యాదవ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎంపీ బడుగుల రియాక్ట్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ కు వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమాన పరిచారని ధ్వజమెత్తారు.
మా జాతులు నీతి నిజాయితీగా బతుకుతాయని.. అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి అని రేవంత్ కుల దురహంకారంతో మాట్లాడారని దుయ్యబట్టారు. రేవంత్ తన నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదని అన్నారు. ఓటకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూతనందిస్తే.. రేవంత్ రెడ్డి వారిని కించపరుస్తున్నాడన్నారు. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమేంటని ప్రశ్నించారు. గొల్ల కురుమలకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని కూడా చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు సంస్కారం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఓడిస్తారని వ్యాఖ్యానించారు యెగ్గే మల్లేశం.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై యాదవులు భగ్గుమన్నారు. యాదవులను కించపర్చడం, కులాన్ని చులకన చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. యాదవుల ఆందోళనకు గొల్ల కురుమలు కూడా గొంతు కలిపారు. రేవంత్.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. యాదవులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ ఎక్కడ తిరిగినా దున్నపోతులు, గొర్రె పొట్టేళ్లతో నిరసన తెలుపుతామని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కులం పేరుతో కించపరిచేలా రేవంత్‌రెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తలసానికి చిన్నప్పటి నుంచి పేడ పిసికే అలవాటుంది. చాలాకాలం దున్నపోతులను కాసిండు’ అంటూ మంత్రి తలసానిని, యాదవ కులాన్ని కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను యాదవులు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్ర కులస్థుడనే పొగరుతో బీసీ కులస్థులను అవమానపరుస్తున్నాడని మండిపడ్డారు.