నాన్న ముఖ్యమంత్రి కావాలి
posted on May 13, 2023 @ 12:14PM
మైసూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే.. కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో తమ పార్టీ విజయం సాధిస్తుందని హస్తం పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తనదైనశైలిలో స్పందించారు.
బీజేపీకి అధికారం దూరం చేసేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని.. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని ఆయన తన మనస్సులోని మాటను ఈ సందర్భంగా వెల్లడించారు.
గతంలో తన తండ్రి సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఇంతకాలం బీజేపీ పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలన్నారు. తన తండ్రి... వరుణ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారని.. భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధిస్తారని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగగా.. మే 13వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే... మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 100కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా 70 పై చిలుకు స్థానాలో బీజేపీ లీడ్‌లో ఉంది. జేడీ(ఎస్) 30 స్థానాల్లో ముందంజలో ఉంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంగా పని చేసిన సిద్ధూ మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ సైతం పోటీపడుతోన్నట్లు సమాచారం. అదీకాక.. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ఆయన సఫలీకృతులయ్యారనే ప్రచారం సైతం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఆసక్తి ఉందని పలుమార్లు పరోక్షంగా ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ ఢంకా మోగిస్తే.. సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందనే ప్రచారం ఇప్పటికే జోరందుకొంది.