ఖాకీల కండకావరం.. సామాన్యుడిలో కలవరం
posted on May 13, 2023 @ 12:49PM
ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అధికార జగన్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని.. ఆ పార్టీ నేతల అడుగులకు పోలీసులు మడుగులోతుత్తోన్నారని.. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. ఫ్యాన్ పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిందంటూ గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతోన్నాయి. అయితే జగన్ పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న శైలిని చూసి.. యావత్ భారతావని ఔరా అంటు ముక్కున వేలేసుకొనే పరిస్థితి అయితే దాపురించిందని ఇప్పటికే ప్రజాస్వామిక వాదులు స్పష్టం చేస్తున్నారు.
ఆ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకొన్న సంఘటన చూసి.. జాతీయ మానవ హక్కుల సంఘం సైతం నోరెళ్లబెట్టే పరిస్థితికి వచ్చేస్తోందని సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి. మే 12వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి వేదికగా రైతులకు చుక్కల భూముల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ విచ్చేశారు. ఆ క్రమంలో పట్టణంలో నిరసనకారులు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకొవడంలో భాగంగా.. ఓ పోలీస్.. తన కాళ్ల మధ్య ఆ కార్యకర్త తల ఉంచి.. గట్టిగా నొక్కుతోన్న వీడియో దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు సైతం వెల్లువెత్తుతోన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన... అమెరికాలో చోటు చేసుకొన్న అప్రో అమెరికన్ జార్జి ప్లాయిడ్ ఘటనను గుర్తు చేసే విధంగా ఉందనే అభిప్రాయం సైతం ప్రజాస్వామిక వాదుల్లో వ్యక్తమవుతోంది. 2020, మే 25వ తేదీన అమెరికాలోని మినిపోలీస్ నగరంలో కర్కశత్వానికి మారు పేరుగా నిలిచిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్ మోకాళ్ల కింద జార్జి ప్లాయిడ్ నలిగి పోతూ కూడా... తనకు ఊపిరి అందడం లేదని చెబుతున్నా వినకుండా.. తుది శ్వాస విడిచే వరకు అతడిని గట్టిగా తన కాళ్లతో అదిమి పెట్టి ఉంచడంతో.. జార్జీ ప్లాయిడ్ మృత్యు ఒడిలోకి జారుకొన్నాడు... అందుకు సంబంధించిన వీడియోతోపాటు ఫొటోలు సైతం వైరల్ కావడంతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోయింది. చివరకు ట్రంప్ ప్రభుత్వంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతోపాటు.. ఆయన తన అధ్యక్ష పదవి పోగొట్టుకోవడంలో జరిగిన అతి ముఖ్య సంఘటనల్లో ఇది ఒకటిగా నిలవడం గమనార్హం. చివరకు అంత కూర్రత్వంతో వ్యవహరించిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్‌కి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు సైతం వెలువరించడం.. అదీ కూడా అతడి హత్య జరిగిన జస్ట్ 36 రోజుల్లోనే ఈ తీర్పు వెలువడం నిజంగా శుభ పరిణామమేనని చెప్పాలి.
ఎందుకంటే.. ఇటువంటి ఘటనలు.. సంఘటనలు మన రాష్ట్రంలో చోటు చేసుకొన్నా.. ఈ చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు అయితే ఉండవు. ఓ వేళ చర్యలు తీసుకొన్నా.. అవి కంటితుడుపు చర్యలే ఉంటాయన్నది మాత్రం పక్కా వాస్తవం. అదీకాక బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లిన వేళ అంటూ మనం ఘనంగా అమృతోత్సవాలు జరుపుకొంటున్నాం కానీ.. మనం.. మన ఎన్నుకొన్న నాయకాగణం మాత్రం.. ఆ నాటి బ్రిటిష్ వారి రాసిన.. చేసిన చట్టాలనే ఏళ్లకు ఏళ్లు పట్టుకొని వేలాడుతోన్నారు. అంతేకానీ.. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనువుగా పోలీసు చట్టాలను మార్చాలనే చిత్త శుద్ది మన పాలకల్లో కొరవడింది. దీంతో పోలీసు వ్యవస్థ అంటే.. బలవంతులు, అధికారంలో ఉన్నవారి రక్షణకే రక్షక భట వర్గం అనే ఓ రాజముద్ర దేశంలోని ప్రతీ సామాన్యడి మదిలో బలంగా ముద్ర పడిపోయింది. అయితే తాజాగా కావలిలో చోటు చేసుకోన్న ఈ ఘటన.. రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలను దారి తీస్తుందోనని ప్రజాస్వామిక వాదుల్లో ఓ కలవరం అయితే మొదలైందనేది మాత్రం పక్కా వాస్తవం.