కేసీఆర్‌కి రేవంత్ చురకలు
posted on May 13, 2023 @ 1:50PM
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలిత్లాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఫలితంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకు వెళ్తోందన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో సత్తా చాట లేకపోయిన కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఎటువైపు ఉంటుందో తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చెబితే.. ఆయన స్నేహ బంధం ఏమిటనేది బయటపడుతొందన్నారు. బీజేపీతో జత కట్టమని చెబుతారా? అంటూ సీఎం కేసీఆర్‌కు ఈ సందర్బంగా రేవంత్ చురకలంటించారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసిన స్థానాలు చింతామణి, ముల్బగల్, బాగేపల్లి గౌరీబిదనూర్, చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ స్థానాల్లో కాషాయం పార్టీ ఘోర పరాభవం చవిచూడల్సి వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీలో కొద్దిపాటి స్తబ్దత నెలకొంది.