కర్ణాటకలో కాయ్ రాజా కాయ్
posted on May 13, 2023 @ 12:32PM
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే క్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగుల పర్వం కొనసాగుతోంది. ఓ వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను పందానికి పెట్టాడు. తనతో పందెం కాసేవారు ఉంటే రావాలని డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. ఈ ఘటన హొన్నాళ్లి నియోజకవర్గంలో చోటు చేసుకొంది. సదరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాంతనగౌడ, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య బరిలో నిలవగా.. వీరిద్దరిపై జోరుగా పందాలు కొనసాగుతోండగా.., నాగణ్ణ అనే వ్యక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతనగౌడ విజయం సాదిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అందుకోసం తను రెండెకరాల పొలాన్ని పందెం కాస్తున్నానని, తనపై పందెం కాసేవారు ఉంటే ముందుకు రావాలంటూ గ్రామంలో డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
మరోవైపు కొండసీమల చామరాజనగర జిల్లాలోనూ బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సోమణ్ణ గెలుస్తారంటూ కోటి రూపాయల వరకు పందం కాసినట్లు తెలుస్తోంది. ఇక గుండ్లుపేట తాలూకా మల్లయ్యైనపుర గ్రామానికి చెందిన కిరణ్.. తన చేతిలో రూ. 3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాయడం.. అందుకు సంబంధించిన వీడియో బహిర్గతం కావడంతో.. పోలీసులు ఆయన నివాసంపై దాడులు నిర్వహించి.. విచారణ చేపట్టారు. మరోవైపు తాను ప్రకటించిన అభ్యర్థులు తప్పక గెలుస్తారని.. అలా కాదన్న వారు కోటి రూపాయల పందెం కాయవచ్చు అంటూ ప్రకటించిన ఓ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.