కడప ఎంపీ అవినాష్ అరెస్ట్?
posted on May 22, 2023 7:20AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వివినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోనికి తీసుకుంది. సీబీఐ విచారణకు హాజరు కాకుండా పదే పదే గడువు కోరుతూ తప్పించుకు తిరుగుతున్న అవినాష్ రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అరెస్టు చేసింది.
సోమవారం(మే 22) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆదివారం(మే21) సీబీఐకి పంపిన లేఖలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, పది రోజుల తరువాత వస్తాననీ పేర్కొన్నారు. దీంతో సీబీఐ అప్రమత్తమైంది. సోమవారం(మే22) తెల్లవారు జాముకే కర్నూలుని విశ్వ భారతి ఆస్పత్రికి చేరుకుంది. స్థానిక ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో కర్నూలు ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అవినాష్ అనుచరులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
అయితే వారందరినీ చెదరగొట్టి సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ను సీబీఐ అధికారులు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. కర్నూలు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించి అవినాష్ అనుచరులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఆస్పత్రి వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా గత నాలుగు రోజులుగా అవినాష్ విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉంటున్నారు.
కాగా తల్లి శ్రీలక్షిని అదే ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఆదివారం రాత్రి విశ్వభారతి ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆస్పత్రి వద్ద ఉన్న మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారి కెమేరాలను ధ్వంసం చేశారు. సీబీఐ అధికారులు కర్నూలు వస్తున్నారన్న సమాచారంతోనే వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని అంటున్నారు. సీబీఐ అధికారుల వాహనాలు ఆస్పత్రి వద్దకు వెళ్లకుండా అవరోధాలు సృష్టించారు. అయితే స్థానిక పోలీసుల సహకారంతో ఆ అవరోధాలను అధిగమించి పోలీసులు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు.