బాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ!

లోకేష్ చేపట్టిన యువగతం పాదయాత్ర ఆయనను నిజమైన ప్రజా నేతగా మార్చేసిందా? గత 110 రోజులుగా ఆయన పాదయాత్రలో భాగంగా నిరంతరం జనంతో మమేకం అవ్వడంతో వారికి కావలసిందేమిటి? వారికి చేయవలసిందేమిటి అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చిందా? అంటే మహానాడులో లోకేష్ ప్రసంగం విన్న వారంతా ఔననే అంటున్నారు. పాదయాత్ర పొడుగునా ఆయనకు జగన్  పార్టీ విధానాల వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు ఎదురైన కష్టాలు కళ్లకు కట్టాయి. జనం సమస్యలు ప్రత్యక్షంగా తెలిశాయి. అంతే కాదు.. జనంలో తిరుగుతూనే వాటికి పరిష్కారాలను కనుగొనేయత్నం చేశారు. ఈ  మొత్తం ప్రక్రియలో ఆయన తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా కంటే జనం మనిషిగా మరింత ఎక్కవ రాటు దేలారు. ప్రజా సమూహాలలో మమేకమైన అనుభవమే ఆయన మంచి వక్తగా మార్చింది. తెలుగుదేశం మహానాడులో ఆయన చేసిన ప్రసంగంలో అదే ప్రతిఫలించింది. అందుకే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, నాలుగేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిగ్గా చెప్పగలిగారు. మహానాడులో అధినేత ప్రసంగంతో సమానంగా లోకేష్ ప్రసంగానికి  స్పందన లభించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంతో పోలిస్తే.. ఆ యుద్ధంలో తిరుగులేని విజయం తెలుగుదేశం పార్టీదే అన్న ధీమాను లోకేష్ ఇవ్వగలిగారు. జగన్ ను పిల్ల సైకోగా అభివర్ణించిన ఆయన అంత కంటే పెద్ద సైకోలను ఎదుర్కొన్న అనుభవం తెలుగుదేశం పార్టీది అని విస్పష్టంగా ప్రకటించి ఒక్క చాన్స్ విజ్ణప్తితో అధికార పగ్గాలు అందుకున్న జగన్ ఆ చాన్స్ ను తాను ధనిక సీఎంగా ఆవిర్భవించేందుకు ఉపయోగించుకుని ప్రజలను పేదలగానూ, పేదలను నిరుపేదలుగానూ మార్చేశారన్నారు. రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలపై కాదు జగన్ చెత్త పన్ను బిల్లులపై తన ఫొటో ముద్రించుకోవాలని సూచించారు. బాబా పాలనలో నిర్మాణాలు జరిగితే.. జగన్ పాలన విధ్వంసాల మయంగా అభివర్ణించిన లోకేష్.. మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.   మహానాడుకు వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం అంటూ ప్రారంభమైన లోకేష్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకొంది.   తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం.. పసుపు జెండా చూస్తే పూనకం అంటూ క్యాడర్ లో జోష్ నింపారు. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడక్షరాల శక్తి ఎన్టీఆర్.. జనానికి కష్టం వస్తే కన్నీరు తుడిచింది. ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది. నిజమైన సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందీ ఆ శక్తేనని లోకేష్ చెప్పారు.   పార్టీ పెట్టాలంటే హిస్టరీ ఉండాలి.. దానిని నడపాలంటే క్యాలిబర్ ఉండాలి ఆ రెండూ తెలుగుదేశానికి నిండుగా ఉన్నాయన్నారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కు హిస్టరీ ఉంది.. ఆ పార్టీని నడుపుతున్న చంద్రబాబుకు క్యాలిబర్ ఉంది.. ఆ రెండూ లేని పార్టీ వైసీపీ అని ఎత్తి చూపారు. చంద్రబాబు పేరు అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్  అన్న లోకేష్  జగన్ అవినీతి చిరునామా ఎద్దేవా చేశారు.  లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు రూ.లక్ష చెప్పులు వేసుకునేవాడు రూ.వెయ్యి వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేశ్ ప్రశ్నించారు. బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయ వైజాగ్లలో ప్యాలెసులు ఉన్నవాడు పేదవాడా? అని నిలదీశారు. 

బీఆర్ఎస్ లో ఉప్పొంగిన ఎన్టీఆర్ భక్తి!

టీఆర్ఎస్ పార్టీ... బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. ఇటువంటి తరుణంలో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు.. భారీ సంఖ్యలో కారు దిగి.. సైకిల్ ఎక్కి.. చెక్కేసేందుకు.. తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. ఆ క్రమంలో ఈ విషయాన్ని గులాబీ దళం అధిష్టానం పసిగట్టి.. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని?... అందులోభాగంగా.. ఎన్టీఆర్ జయంతిని వేదికగా చేసుకొని.. పావులు కదిపిందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో  జోరుగా సాగుతోంది. మే 28వ తేదీ.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి. అయితే ఆయన జయంతి వేడుకలను తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు.. ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ నడి బొడ్డును ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్..  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే మహానీయుడు, మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అంటూ కిర్తీంచారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎందరికో ఎన్టీఆర్ భవిష్యత్ ఇచ్చారన్నారు.  ఇక హన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎన్టీఆర్ క్యాంస విగ్రహానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయులు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. శివారు ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూలు కట్టి మరీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  అయితే తాజాగా బీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల.. పోలిటికల్ సర్కిల్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో టీడీపీ మళ్లీ సత్తా చేటేందుకు ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగా అన్ని లోక్‌సభ , అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట కార్యక్రమాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లి..   తమ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు.. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. వాటిలోని వ్యత్యాసం.. లోపాలను క్షుణ్ణ్నంగా ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేస్తోంది.  మరోవైపు తెలంగాణ పదాన్ని సెంటిమెంట్‌గా చేసుకొన్న టీఆర్ఎస్ పార్టీ... ప్రస్తుతం ఆ పదాన్ని పక్కన పెట్టి.. బీఆర్ఎస్‌గా  మారిపోయింది. దీంతో తెలంగాణ ప్రజలు సైతం.. సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే  చర్చ సైతం రాజకీయ వర్గాల్లో   సాగుతోంది. అదీకాక.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకు దాదాపుగా 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లి షికారు కొట్టిన వారేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మరోవైపు.. ముచ్చటగా మూడో సారి కూడా అధికార పీఠం అందుకోవాలనే లక్ష్యంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటూ.. ఇంకోవైపు.. కేసీఆర్‌కి చెక్ పెట్టి పాగా వేయాలని బీజేపీ   తన ఆలోచనలకు మరింత పదును పెడుతూ... ముందుకు సాగుతోంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం .. దూకుడు మీద ఉంది. అలాంటి తరుణంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి.. అధికారాన్ని అందుకొన్న కేసీఆర్ పార్టీ.. మళ్లీ బీఆర్ఎస్‌గా మారడంతో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ గెలుపు కష్టమనే భావనతోపాటు.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వెళ్లితే తప్ప... పదవి యోగం ప్రాప్తమవదనే  భావనతో ఎన్టీఆర్ అభిమానులను  తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్  తన వంతు ప్రయత్నాలు చేపట్టిందని..  అదీకాక తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు... రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు పార్టీ గెలుపోటమలను నిర్ణయించడంలో క్రియా శీలకంగా మారనున్నాయి. అటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు ... ఎన్టీఆర్ రాగం అందుకొన్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

నేవిగేషన్ సేవల కోసం మరో రాకెట్

జీఎస్ఎల్ వి రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ మీద భారత్ పెద్ద ఆశలే పెట్టుకుంది.  జిఎస్ఎల్ వీ - ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం అవుతుందనీ భారత్ ముందే ఊహించింది.  ఇస్రో  మరో రాకెట్‌ను ప్రయోగించించడాన్ని ప్రపంచమంతా వీక్షించింది.  సోమవారం  నావిగేషన్‌ శాటిలైట్‌ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఈ  ఉపగ్రహాన్ని ఉదయం 10:42 గంటలకు నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్‌ వ్యవస్థ మరింత మెరుగుపడి తన సేవలను మరింత విస్తరించనుంది. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసింది. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శనివారమే వెల్లడించారు. ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్ భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది అనేది ఈ రాకెట్ శోధిస్తుంది. ప్రస్తుతం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్  కాన్స్టెలేషన్‌లో ఉన్న ఏడు ఉపగ్రహాలలో ప్రతి ఒక్కటి లిఫ్ట్‌ఆఫ్ వద్ద చాలా తక్కువ - దాదాపు 1,425 కిలోల బరువు కలిగి ఉంది. దీని పొడవు 49.11 మీటర్లు.  2001 నుంచి ఇస్రో ప్రయోగించిన రాకెట్లలో ఇది 15వది.  

రెజ్లర్ల ఆందోళన బీజేపీకి పట్టదా?

ఢిల్లీలో మహిళా రెజ్లర్ల  ఆందోళన పై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రెజ్లర్ల సమస్యపై  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వినా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, సామాజిక వేత్తలు, మేధావులూ.. ఇలా అన్ని వర్గాలూ స్పందించాయి. రెజ్లర్లకు మద్దతుగా నిలిచాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం ఈ విషయంలో ఇంత వరకూ నోరెత్తలేదు. పైగా పోలీసులు రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్త అవుతోంది. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ప్రపంచస్థాయి పోటీలలో పతకాలను సాధించిన రెజ్లర్లు తన సమస్యలపై గళమెత్తితే.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, వారి ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా చూడటాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.  రెజ్లర్ల  తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతున్నారు. ఇది న్యాయమైన డిమాండే. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడైన బీజేపీ ఎంపీ  బ్రిజ్‌భూషణ్‌ సింగ్ పై ఈ రకమైన ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదు. పోలీసులు ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదు. దేశానికి పతకాలు తెచ్చిన ఎంతో మంది మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ పై చేస్తున్న ఆరోపణలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వడం లేదు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియా వంటి వారు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నా  కేంద్రం, క్రీడాశాఖ ఉన్నతాధికారులు  ఎవరూ స్పందించడం లేదు.  ఎంపీకే  మద్దతుగా నిలుస్తున్నారు. పోనీ బ్రిజ్ భూషణ్.. క్రీడాకారుడా అంటే కాదు. దేశానికి పతకాలు సాధించుకువచ్చిన మల్లయోధుడూ కాదు.. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు.  అంతే కాదు అధికార పార్టీ ఎంపీ. ఇవే అర్హతలుగా ఆయనపై ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోనికి తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ ముందుకు రావడం లేదు. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి క్షణమాత్రం సంకోచించడం లేదు. ఘనత వహించిన బ్రిజ్ భూషణ్ సింగ్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోట్లది రూపాయలు ట్నరోవర్ ఉన్న విద్యాసంస్థలకు అధిపతి కూడా. యూపీలోని పలు ప్రాంతాలలో బ్రిజ్ భూషణ్ బలమే వల్లే బీజేపీ ఉనికిలో ఉందన్న పరిస్థితి ఉంది. అందుకే అంత మంది రెజర్లు దాదాపుగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఆయన పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ వెనుకాడుతోంది.   రెజ్లర్ల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను, మోడీ వ్యక్తిగత ప్రతిష్టనే కాదు.. దేశ ప్రతిష్టను సైతం మసకబారుస్తోంది. శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల జులం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. 

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ సీన్ అయిపోయిందా?

జూనియర్, సీనియర్ పోరులో రేవంత్ వెనుకబడ్డారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే వైఎస్ బిడ్డ షర్మిలకు నాయకత్వం అప్పగించడమే మేలన్న నిర్ణయానికి కాంగ్రెస్ హై కమాండ్ వచ్చేసిందా?  అంటే షర్మిల కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలను చూస్తుంటే ఔననే  అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలలో షర్మిల ఇంపార్టెన్స్ ఒక్క సారిగా పెరిగిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీపై నిర్భీతిగా, నిర్మొహమాటంగా విమర్శలు గుప్పిస్తున్న షర్మిల ప్రాధాన్యతను ఇతర పార్టీలన్నీ గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా షర్మిల ఎవరు వదిలిన బాణం అంటూ పరిశీలకులే కాదు, రాజకీయ వర్గాలలోనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. తొలుత ఆమె రాజకీయ ప్రవేశమే జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ ఆరంభమైంది. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం జగనన్నతోనే విభేదించి.. ఏపీ వదిలి తెలంగాణలో తన తండ్రి వైఎస్సార్ పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి, సుదీర్ఘంగా పాదయాత్ర చేయడమే కాకుండా, వరుస దీక్షలతో రాష్ట్ర రాజకీయాలలో గుర్తించక తప్పని శక్తిగా అవతరించారు షర్మిల.  షర్మిల సొంత పార్టీ పెట్టుకుని, ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అసలు షర్మిల ఎవరు వదిలిన బాణం? అన్న ప్రశ్న ఆమె రాజకీయ పార్టీ పెట్టిన సమయంలోనే ప్రముఖంగా వినిపించింది. అయితే ఆమె ఇప్పుడు ఇంత దూరం నడిచేసిన తరువాత ఆ ప్రశ్న ముగిసిన అధ్యాయం అన్న వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇటీవలి కాలం వరకూ ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? రాజకీయంగా ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు బలంగా తెరమీదకు వచ్చాయి.  జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్  ఇలా బీఆర్ఎస్ లో (ఒకప్పడు టీఆర్ఎస్) ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు  గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెడతామని అంటున్నారు. కానీ షర్మిల  తన విమర్శల ద్వారా తెరాస ప్రభుత్వాన్ని నిత్యం ఉతికి ఆరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల స్వల్ప వ్యవధిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్  తో రెండు సార్లు భేటీ కావడంతో ఆమె కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా? అంటే వైఎస్సార్ టీపీని తన తండ్రి జీవించి ఉన్నంత కాలం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా అన్న కోణంలో పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. తాజా బేటీలో డీకే శివకుమార్ షర్మిలతో ఆమె తండ్రి వైఎస్సార్ తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఈ వరుస భేటీలతో తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక వేళ అలా విలీనం అంటూ జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. వైఎస్సార్ బిడ్డగా షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం చెప్పే అవకాశం దాదాపుగా ఉండదని పరిశీలకులు అంటున్నారు. కాగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ   విలీనం అంశాన్ని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ స్వయంగా పరిశీలిస్తున్నరని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.   ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం, ఆమెకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం అన్న ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతుంటే.. మరో వైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.   కాంగ్రెస్ శ్రేణులు మాత్రం షర్మిలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం అంటూ జరిగితే పార్టీలో రేవంత్ సీన్ అయిపోయినట్లేననీ, ఆయన దారి తెలుగుదేశంపైపు మళ్లొచ్చని అంటున్నాయి. 

ఎంఐఎం వ్యూహమేంటి? లాభం ఎవరికి?

ఎంఐఎం అనగానే తెలంగాణలో పాతబస్తీకే పరిమితమైన జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది. అయితే ఆ పార్టీ హైదరాబాద్ మహానగరంలో పాతబస్తీకే పరిమితం కావడం వెనుక  ఆ పార్టీ అక్కడే బలంగా ఉండటం కారణమని అంతా భావిస్తు వస్తున్నారు. అయితే ఎంఐం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం వచ్చే ఎన్నికలలో తమ పోటీ పాతబస్తీ వెలుపల కూడా ఉంటుందని చెబుతున్నారు.  తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తామీ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఇంత కాలం అనధికార మిత్ర పక్షమైన బీఆర్ఎస్ కోసం తాము ఓల్డ్ సిటీకే పరిమితమయ్యామనీ, అయితే అందువల్ల బీజేపీ బలపడుతోందనీ, అందుకే అవసరమైతే బీఆర్ఎస్ ను పక్కన పెట్టి మరీ ఓల్డ్ సిటీ బయట పోటీ చేయడానికి రెడీ అవుతున్నామని అసదుద్దీన్ చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో తాము నిజామాబాద్, కరీంనగర్, సికిందరాబాద్ ల నుంచి పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం తమ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ విజయానికి దోహదపడుతోందని ఆరోపణలు చేస్తున్న సెక్యులర్ పార్టీలు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు.  తెలంగాణ కొత్త సచివాలయంపై బీజేపీ జెండా ఎగరడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.  ఎంఐఎం బలంగా ఉంటేనే తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరుస్తుందని చరిత్ర చెబుతున్న సత్యమని ఒవైసీ అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.  2014,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో  ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఓల్డ్ సిటీ బయట ఎంఐఎం పోటీ చేయడం వల్ల అంతిమంగా బీజేపీయే లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం ఓల్డ్ సిటీకి పరిమితమై పోటీలో ఉన్న ఎంఐఎం కే బీజేపీ యేతర పార్టీలు, ఇప్పుడైతే బీఆర్ఎస్.. అంతకు ముందు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోటీ ద్వారా బయటి ఓట్లు చీలి బీజేపీ లబ్ధి పొందకుండా పరస్పర సహకారం అందించుకునేవనీ, ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీ దాటి బయటకు వస్తే.. సెక్యులర్ ఓట్లు చీలి  బీజేపీకే ఎక్కువ ప్రయోజం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ బలోపేతమౌతోందన్న భావన వ్యక్తమౌతున్న వేళ ఎంఐఎం నిర్ణయం బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు.  

పెట్రోల్ ట్యాంకులో పడి ముగ్గురు మృతి

పెట్రోల్ ట్యాంకులో పడి  ముగ్గురు మరణించి విషాద ఘటన అన్నమ్య్య జిల్లా రాయచోటిలో జరిగింది. పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు. రాయచోటి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పెట్రోల్ పంప్ లో ట్యాంకర్ క్లీన్ చేయడానికి చమురుకంపెనీ హిందూస్థాన్ పెట్రోలియం యాజమాన్యం కడప నుంచి ముగ్గురిని ఇక్కడకు పంపింది. వారు పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాద వశాత్తు ఒకరు అందులో పడిపోయారు. అతడిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా ట్యాంక్ లో పడిపోయారు. వెంటనే అగ్నిమాపక దళం ఒకరిని బయటకు తీసింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించారు. ట్యంకులో పడిన మరో ఇద్దరిని అగ్నిమాపక దళం బయటకు తీసే సరిగే విగత జీవులయ్యారు.  ఈ సంఘటనపై బషీర్ ఖాన్ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

విజయసాయి మౌనం సజ్జలపై పై చేయి కోసమేనా?

విజయసాయి రెడ్డి..  వైసీపీతో ఈ పేరును విడదీసి చూడటం సాధ్యం కాదన్న బావన ఇటీవలి వరకూ అందరిలోనూ ఉండేది. అంతగా విజయసాయి వైసీపీతో మమేకమై ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడి, ఎడమ, ముందు, వెనుక కూడా విజయసాయే అన్నట్లుగా ఆయన హవా కొనసాగింది.  జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏ2గా జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి. అందుకే విజయసాయికి వైసీపీలో తిరుగుండదనే అంతా భావించారు.  అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి పూర్తి రివర్స్ అయ్యింది.  పార్టీ కార్యక్రమాలలో విజయసాయి నీడ కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరిదీ ఒక దారీ అయితే  విజయసాయి రెడ్డి ఒక్కడిదీ ఒక దారి అన్నట్లుగా ఆయన ఒంటరి అయిపోయారు. కేంద్ర మంత్రిని కలిసినా, ఏపీ కొత్త గవర్నర్ ను ప్రమాణ స్వీకారం ముందు కలిసినా విజయసాయి ఒక్కరే వెళుతున్నారు.  ఇక అన్నిటికీ మించి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన ఇన్వెస్ట్ మెంట్ సదస్సు లో కూడా ఎక్కడా విజయసాయి కనిపించలేదు.  విజయసాయి కేవలం వైసీపీ ఎంపీ మాత్రమే కాదు..  పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైసీపీకి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏకైక ప్రతినిథి కూడా. ఇక ఇటీవలి కాలం వరకూ ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ కూడా.  అంతేనా.. దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లతో ఆయనకు బోలెడు సంబంధాలు ఉన్నాయి. అయినా సరే వివిధ రాష్ట్రాలలో విశాఖ సదస్సు ప్రమోషన్ల కోసం నిర్వహించిన  రోడ్ షోలలో ఆయన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక వేత్తల ఆహ్వానం కోసం ఏర్పాటైన బృందంలోనూ విజయసాయికి ప్రాతినిథ్యం లేదు.  నిన్న మొన్నటి వరకూ పార్టీ ఎంపీలలో వెలివేతకు గురైన వ్యక్తి రఘురామకృష్ణం రాజు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా విజయసాయి కూడా చేరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యాయి కూడా.  తారకరత్న మరణం, ఆ తరువాత అంత్యక్రియల సందర్భంగా విజయసాయి బాలకృష్ణతో కలిసి అన్ని ఏర్పాట్లలోనూ పాల్గొనడం వల్లే విజయసాయిని దూరం పెట్టారా అన్న చర్చ అప్పట్లో  జోరుగా సాగింది. విజయసాయి పార్టీకి దూరం అయ్యారా అన్న అనుమానాలు కలిగే విధంగానే  ఆయన తీరు కూడా ఇటీవలి కాలంలో ఉంది. జగన్ మెచ్చేలా ఈ మధ్య కాలంలో ఆయన  ఎన్నడూ విపక్షంపై విమర్శలతో విరుచుకుడలేదు. అంతే కాదు.. విపక్ష నేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా విషెస్ కూడా తెలిపారు. ఆ విషెస్ గతానికి భిన్నంగా ఎక్కడా వ్యగ్యం లేకుండా అత్యంత గౌరవ ప్రదంగా ఉన్నాయి. అలాగే పార్టీ వ్యవహారాలలో కూడా విజయసాయి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కొండొకచో ఆయన ట్వీట్లు పార్టీకి నష్టం చేకూర్చేవిగా కూడా ఉంటున్నాయి.  తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో  పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయసాయి మోడీకి  ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇటు పార్టీలోనే కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కారన్న విపక్షాల విమర్శలకు ఊతం ఇచ్చేదిగా విజయసాయి ట్వీట్ ఉంది.    ఆ ట్వీట్ కు ముందు వరకూ వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెడుతున్నారని అంతా భావించారు. అయితే విజయసాయి మోడీకి కృతజ్ణతలు చెబుతూ చేసిన ట్వీట్ తరువాత విజయసాయి రెడ్డే పార్టీకి దూరం జరుగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నిటికీ మించి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా మౌనం వీడి పార్టీకి మద్దతుగా విజయసాయి మాట్లాడకపోవడంతో ఆయన దాదాపుగా వైసీపీతో తెగతెంపులు చేసేసుకున్నారా లేక వైసీపీయే ఆయనను వదిలించుకుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే హఠాత్తుగా ఉరుములేని పిడుగులా... ఆయన  తెలుగుదేశం పార్టిని విమర్శిస్తూ తాజాగా చేసిన ట్వీట్ విజయసాయి ఇంత కాలం మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? పార్టీలో కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకునే ఎత్తుగడ ఉందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన తాజాగా  మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను మాయా ఫెస్టోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో గతంలో ఉన్న వ్యంగ్య వైభవం మళ్లీ కనిపించింది. 2014 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత మేనిఫెస్టోనే మాయం చేసిన బాబు ఈ సారి మాయాఫెస్టోను విడుదల చేశారని ఆ ట్వీట్ లో విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  వైసీపీ ఇటీవలి కాలంలో వరుస ఎదురు దెబ్బలు తింటుండటం, పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న సజ్జల పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలం కావడం, సజ్జలపై మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు, అలాగే పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన వారు నేరుగా సజ్జలపైనే విమర్శలు గురిపెట్టడం వంటి సంఘటనల నేపథ్యంలో విజయసాయి మౌనం వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీపై విజయసాయి మళ్లీ  పట్టు సాధించేందుకు ఇంత కాలం వ్యూహాత్మక మౌనం పాటించి, ఇప్పుడు అదును చూసి సజ్జలపై పై చేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలను వైసీపీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. 

తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు. వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. ఆదివారం(మే28) నాడు తిరుమల దేవుడిని 78వేల 818 మంది దర్శించుకున్నారు. 39 వేల 76 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (మే29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానిని 24 గంటల సమయం పడుతోంది.  

పార్లమెంటు నియోజకవర్గాల పెంపు ఎప్పుడంటే?

లోక్ సభ స్థానాలు పెరగనున్నాయా? అంటే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ  చేసిన ప్రకటన వింటే ఔననే అనాల్సి ఉంటుంది. త్వరలో పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభ స్థానాలు పెరగనున్నాయనీ, కొత్త పార్లమెంటు భవనంలో అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.   నూతన పార్లమెంట్ భవనలో లోక్ సభలో  888 మంది రాజ్యసభలో 384 మంది కూర్చోవడానికి వీలుగా సీటింగ్ అరేంజ్ మెంట్ చేసినట్లు మోడీ వివరించారు.  అయితే 2026 నాటికి పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అది జరిగితే..  ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి మరో 150 వరకూ అంటే  693 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కనుక అందుకు అనుగుణంగా  రాజ్య సభ సీట్లు కూడా పెరుగుతాయి.  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా  తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు నకు ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేరలేదు. గతంలో పలు మార్లు తెలుగు రాష్ట్రాల్లో నియోజవర్గాల పెంపు ప్రక్రియ కసరత్తు షురూ అయ్యిందంటూ అప్పటి  రాజకీయ పరిస్థితులను బట్టి బహుముఖంగా ప్రచారం జరిగింది.   విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.  రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్య  153 కు పెరగాల్సి ఉంది. గతంలో పలుమార్లు  తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు  పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే..  పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అదంతా ప్రచారానికే పరిమితమైంది. ఆ తరువాత ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు తెలుగురాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు 2031 వరకూ ఉండే అవకాశం లేదని కేంద్రం విస్పష్టంగా బదులిచ్చింది.   కానీ కాశ్మీర్ లో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన కేంద్రం తెలుగు రాష్ట్రాలపై మాత్రం శీతకన్నేసింది. 

వోటు బ్యాంకు పాలిట్రిక్స్ కు కెసీఆర్ సిద్దం

భారత రాష్ట్ర సమితి  అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలతో పార్టీ ఔట్రీచ్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ, రాబోయే కొద్ది నెలల్లో సంక్షేమ పథకాలను  అమలు చేయడం ద్వారా తన ఓటు బ్యాంకులను పదిలపర్చుకోవాలని చూస్తోంది.  రానున్న రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంఘాలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయడంతోపాటు గృహలక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి  దళిత బంధు పక్కాగా అమలు చేయాలని చూస్తోంది.   పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ,  గొర్రెలను అందజేయాలని ప్రణాళిక సిద్దం చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం.  అసెంబ్లీ ఎన్నికల్లో  లబ్ధిదారుల మద్దతు కోరడానికి ఇది చక్కటి అవకాశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులు ఆర్బాటంతో  ఈ పథకాలు లబ్ధిదారులకు అందేలా  చూస్తారు.  పోడు భూముల పట్టా కార్యక్రమాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జూన్ 24 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.  అధికార పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. వెల్ఫేర్, డెవలప్మెంట్  కార్యక్రమాలను  ప్రచారం నిర్వహించి లబ్ది పొందాలని చూస్తోంది. 

అంబేడ్కర్, బాపూజీల ప్రస్తావన ఏది..?

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.  రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంటును ప్రారంభించిన  కొన్ని గంటలు కూడా గడవక ముందే.. ప్రతిపక్షాలు ఊహించి నట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ ఓ పని చేశారు.  కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వినాయక్ రావ్ దామోదర్ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర సావర్కర్ త్యాగం సాహసం దృఢదీక్ష మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి "మన్ కీ బాత్'' కార్యక్రంలో కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ జయంతి ఈరోజు అని సావర్కర్ జైలు జీవితం అనుభవించిన అండమాన్ జైలును దర్శించేందుకు తాను వెళ్లిన రోజు నేటికీ మరిచిపోలేనని అన్నారు. నిర్భీతికి ఆత్మగౌరవానికి సావర్కర్ ప్రతీక అని మోడీ అంటున్నారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సామాజిక సమానత్వం సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో చేసిన ట్వీట్లో వీడీ సావర్కర్ తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. ఆయన దేశ భక్తి త్యాగం పట్టుదల ప్రశంసనీ యమనని అన్నారు. ఆ గుణాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆది నుంచి  కాంగ్రెస్ నేతలు సావార్కర్ ను  దేశ ద్రోహిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. సావార్కర్బపై రాహుల్ గాంధీ గతంలో విమర్శలు చేసిన సందర్భంలో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మొత్తంగా పరిస్థితి కాంగ్రెస్, ప్రతిపక్షాలు  ఊహించినట్టే జరగడం.. తొలి రోజు పార్లమెంటు ప్రారంభించిన వెంటనే సావార్కర్ కు నివాళులర్పించడం గమనార్హం. అయితే..ఇదేసమయంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ ప్రస్తావనలు కనిపించకపోవడం గమనార్హం.  అసత్యాలను సత్యాలుగా ..నమ్మే విధంగా ప్రచారం చేయడంలో మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం.. చాలా వరకు సఫలమైందని, అయితే కొంత మందిని కొంత కాలం మోసం చేయొచ్చు..కాని, అన్ని వేళల అందరిని మోసం చేయడం కుదరదనే విషయాన్ని  బీజేపీ గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలు హితబోధ చేస్తున్నాయి. 

కవిత కనిపించడం లేదు.. వినిపించడం లేదు.. కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ అనే ఓ చర్చ తెలంగాణ  రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతోపాటు.. ఈ ఏడాది మార్చిలో ఒకటి సారి రెండు సార్లు కాదు.. ముచ్చటగా మూడు సార్లు ఢిల్లీలో  ఈడీ కవితను విచారించింది. ఆమె సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.  ఒకానొక దశలో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలురురిని అరెస్టు చేయడం, వారికి బెయిలు కూడా రాకపోవడంతో కవిత అరెస్టు అనివార్యం అన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అంతే  ఆ తరువాత ఈడీ కవితను మళ్లీ  విచారించింది లేదు. అంతే కాదు విచారణకు ముందు, తరువాత గంభీరంగా ప్రకటనలు ఇచ్చి  , కేంద్రంపై విమర్శలు గుప్పించిన కవిత ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతోపాటు పలువురు పెద్ద తలకాయలను   ఈడీ అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని తీహార్ జైల్‌కి తరలించిన విషయం విదితమే. వారిలో కొందరికి బెయిల్ వచ్చిందనుకోండి అది వేరే విషయం.   బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరు అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో ఒక్కప్పుడు బయట కనిపిస్తున్నారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. కవిత సోదరుడు, సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ అయితే.. ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటికే లండన్‌లో పర్యటించి, అక్కడ నుంచి అమెరికా చేరుకొని.. ఆ దేశ పర్యటనలో భాగంగా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం... పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  అందుకు సంబంధించి కేటీఆర్ వీడియోలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ సైతం చేస్తున్నాయని... అయితే   కవిత  మాత్రం అనూహ్యంగా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.   మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర అత్యంత కీలకమని.. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత అయితే.. బతుకమ్మ పండగ సమయంలో ఆడి పాడి.. తెలంగాణ ప్రజలను నిత్య చైతన్యవంతులుగా రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిందని.. ఇంకా చెప్పాలంటే.. బతుకమ్మ పండగ కాస్తా.. కవితమ్మ పండగ అయిపోయిందనే ఓ చర్చ సైతం నాడు తెలంగాణ సమాజంలో  జరిగిందని పరిశీలకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కవిత  హఠాత్తుగా సైలెంట్‌గా ఉండడం వెనుక మర్మం ఏమిటి? వ్యూహం ఏమిటి? అన్న చర్చ జోరుగా సాగుతోంది.        2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలైన  తర్వాత కొద్ది రోజులు ఆమె  ఇలాగే వ్యవహరించారు.  ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ అయి.. పెద్దల సభలో ఆమె అడుగు పెట్టారని.. అనంతరం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడం.. అనంతరం చోటు చేసుకొన్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని స్పష్టం చేస్తోంది.  ఇంకోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ఆమె కాలికి గాయం కావడంతో.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోన్నారని...ఆ తర్వాత మదర్స్ డే సందర్భంగా తల్లిని కలిశారని.. అయితే ఆ తర్వాత అంటే మే 17న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం ఆమె హాజరుకాలేదని.. బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలు సైతం పేర్కొంటున్నారు. మరోవైపు ఈ నెల 21న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ శిక్షణా శిబిరానికి కేసీఆర్‌తో పాటు కవిత కూడా వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆమె వెళ్లలేదు. అలాగే జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న దశాబ్ది ఉత్సవాల్లో అయినా ఆమె కనిపిస్తారా? అని తెలంగాణ ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  అదీకాక.. మద్యం స్కామ్‌లో తమ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నుంచి నోటీసులు రావడంతో.. పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు.. అందుకోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన అంటూ ప్రకటనలు గుప్పించి.. ఆ తర్వాత ఇలా చడీ చప్పడు చేయకుండా.. సైలెంట్ కావడం ఏమిటనే చర్చ సైతం తెలంగాణ సమాజంలో మొదలైంది. అయినా..  మద్యం కుంభకోణంలో తొలుత కవిత పేరు వినిపించడం.. ఆ తర్వాత ఆమె పేరు ఎక్కడ బయటకు రాకపోవడం.. దీంతో కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ బాస్ దోస్తి కట్టిఉంటారనే ఓ చర్చ సైతం.. తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతోంది. అయినా.. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. ఇలా కవిత ఏదో అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సైలెంట్‌గా ఉండడం ఏం బాగోలేదని చర్చ సైతం తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతోంది.

తెలుగు ప్రజల ఆస్తి ఎన్టీఆర్

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలంగాణలో కూడా ఘనంగా జరిగాయి. ఒక్క తెలంగాణ అనేమిటి తెలుగువారు ఉన్న అన్ని దేశాలలో, రాష్ట్రాలలో  ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ  తన 101వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్టీఆర్ ను స్మరించుకుని ఆయన గొప్పతనాన్ని ప్రస్తుతించారు.   తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో  రాజకీయ రంగ ప్రవేశం చేసిన విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,  నందమూరి తారక రామారావు  రాజకీయాలను ప్రజలకు చేరువ చేశారు. సంక్షేమం, సంస్కరణలలో విప్లవం తీసుకువచ్చారు.  అందుకే రాజకీయాలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఎన్టీఆర్ ను అందరూ అభిమానిస్తారు. గౌరవిస్తారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ, విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఘనంగా జరుపుకున్నారు.   తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా  పని చేసిన కేసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ.. శత జయంతిని ఘనంగా నిర్వహించడం ఎన్టీఆర్ గొప్పదనానికి, ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.  ఎన్టీఆర్ శత జయంతిని పలువురు బిఆర్ఎస్ నాయకులు నిర్వహించడం  రాజకీయాలకు అతీతంగా ఆయనపై ఉన్న అభిమానం, గౌరవాలకు తార్కానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  రాష్ట్ర విభజనకు ముందు, తరువాత కూడా అంటే ఎన్టీఆర్ మరణం తరువాత తెలుగుదేశం పార్టీని ఆంధ్రాపార్టీగా ముద్ర వేసినా.. ఎన్టీఆర్ ను మాత్రం బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తమ వాడిగా, ఆత్మీయుడిగా గుండెల్లో దాచుకుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీని ఉద్యమ నేతలు విమర్శలు చేసినా తెలంగాణ అభివృద్ధిలో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం భాగస్వామ్యాన్ని వారు విస్మరించలేదు.   తెలుగుజాతి ఉమ్మడి ఆస్తి ఎన్టీఆర్. రాజకీయ, ప్రాంతీయ విభేదాలతో ఎవరైనా సరే ఆయన ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని విస్మరించలేరు. తెలుగు నుడికారం ఎన్టీఆర్, తెలుగు జాతి చిరునామా ఎన్టీఆర్. జయమో ఎన్టీఆర్

అర్థరాత్రి భేటీల ఆంతర్యమేమిటి?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనల వెనుక ఏమైనా మిస్టరీ ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మరీ ముఖ్యంగా వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే జనవరి నుంచి ఆయన హస్తిన పర్యటనలపై అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. అవినాష్ అరెస్టు అనివార్యం అని పించిన ప్రతి సారీ ఆయన హస్తినకు వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ  దర్యాప్తు సీన్ మారిపోయింది. వేగం మందగించింది. పరిశీలకులు సైతం సీబీఐ దర్యాప్తునకు జగన్ హస్తిన పర్యటనలకూ ఏదో లింక్  ఉందనే విశ్లేషణలే చేస్తున్నారు. అన్నిటికీ  మించి గత రెండు పర్యటనలలోనూ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ రెండు భేటీలూ కూడా నిశిరాత్రి వేళఏ జరిగాయి.  అ భేటీలో పోలవరం నిధులు, విభజన హామీల అమలు గురించి చర్చ జరిగిందంటూ జగన్ సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటుంది. కానీ పోలవరం నిధులకు, విభజన హామీల అమలుకూ, కేంద్ర హోంమంత్రికి ఏమిటి సంబంధం అన్న ప్రశ్నకు మాత్రం అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ సమాధానంొ ఉండదు.  సాధారణంగా కేంద్ర మంత్రులు,  కేంద్ర మంత్రులేమిటి మంత్రులెవరైనా సరే అధికారిక కార్యక్రమాలను  అధికారిక భేటీలను ఉదయం సమయంలోనే నిర్వహిస్తారు. పార్టీ వ్యవహారాలకు మాత్రమే కార్యాలయ సమయం పూర్తయిపోయిన తరువాత  సమయం ఇస్తారు.   దీంతోనే ఏపీ సీఎం జగన్ అమిత్ షా తో అర్ధరాత్రి భేటీలు రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక సీఎం స్వంత వ్యవహారాల కోసమా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఈ భేటీలపై ఏపీ ప్రజలలో కూడా సందేహాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో సీబీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో జగన్ పేరు ఉండటంతో ఆయన అమిత్ షాతో జరిపిన తాజా అర్ధరాత్రి భేటీపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

రాష్ట్ర భవిష్యత్ కు తెలుగుదేశం గ్యారంటీ!

తెలుగుదేశం రాష్ట్ర భవిష్యత్ కు మాదీ గ్యారంటీ అని ఎలుగెత్తింది. సంక్షేమం అంటే అప్పులు చేసి సొమ్ములు పందేరం చేయడం కాదని ఉద్ఘాటించింది. సంపద పెంచి దానికి పేదలకు అందజేయడమే నిజమైన సంక్షేమం అని కుండబద్దలు కొట్టింది. నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించి.. సంక్షేమం పేర పేదలకు రూపాయి విదిల్చి వంద రూపాయలు దోచేసిన జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది. నిజమైన సంక్షేమం అంటే ఏమిటో ఆరు హామీల రూపంలో ప్రజల కళ్లకు కట్టేల వివరించింది. రాజమహేంద్ర వరం వేదికగా తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో సంక్షేమ రంగంలో  ఆరు హామీలు ఇస్తూ.. రాష్ట్ర భవిష్యత్ కు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ అని నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. భవిష్యత్ కు గ్యారంటీ పేరిట మినీ మేనిఫెస్టోనూ ప్రకటించారు.  నిరుద్యోగులు, మహిళలు, రైతులకు అండగా, చేదోడువాదోడుగా నిలవడమే కాదు.. ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచిన బీసీలకు కూడా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు.  ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ,  జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అలాగే  రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదలను ధనవంతులు చేయడం తెలుగుదేశం లక్ష్యమని, అధికారంలోకి రాగానే ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రిచ్ టూ పూర్  పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా  వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టే ప్రభుత్వం  ముందడగు వేయనుందని ఉద్ఘాటించారు.  బీసీల  రక్షణ చట్టం తీసుకువచ్చి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇంత వరకూ  26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు, 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి అని వెల్లడించిన చంద్రబాబు, వీటిని దృష్టిలో పెట్టుకుని  బీసీలకు రక్షణ చట్టాన్నితీసుకురావాలని తెలుగుదేశం సంకల్పించిందన్నారు.  అలాగే ఇంటింటికీ మంచి నీర  పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ కు తెలుగుదేశం పార్టీ పూచీ పడుతుందని చంద్రబాబు చెప్పారు.  తెలుగుదేశం ధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. ఇక రైతులకు అన్న దాత ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.   మహిళ మహా శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు  స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.  తల్లికి వందనం  పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు.   ఉచిత బస్సు ప్రయాణం  పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.  నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుందని… ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు.  చంద్రబాబు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా జగన్ నవరత్నాలు పథకంలోని డొల్లతనాన్ని అందరికీ అర్ధమయ్యేలా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న వాలంటీర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పథకాలను పొందాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం అర్హులందరినీ ఒకే విధంగా చూస్తుందని చెప్పకనే చెప్పారు. సంక్షేమం అంటే ఉపాధి, ఉద్యోగ కల్పనతో పాటుగా భవిష్యత్ కు భరోసా కల్పించడమని విస్పష్టంగా చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. తెలుగుదేశంకు సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపద ఫలాలను పేదలకు అందించం తెలుసు అని చంద్రబాబు తన ప్రసంగం ద్వారా అందరికీ  స్పష్టం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. 

ఒంగోలు టు రాజమహేంద్ర వరం!.. దేశం జోష్ బ్రహ్మాండం!

టైమ్ మనది కానప్పుడు.. వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడం వల్ల వచ్చే ఫలితాలు సూపర్బ్ గా ఉంటాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. సూపర్‌గా కిక్ ఇస్తాయి. ప్రస్తుతం ఆ కిక్ ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంజాయి చేస్తున్నాయి. ఉదాహరణ  చెప్పాలంటే.. తాజాగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన మహానాడు మహాద్భుత విజయం సాధించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. అయితే ఈ మహానాడు సూపర్ సక్సెస్‌ కావడంపై పోలిటికల్ సర్కిల్‌లో వాడీవేడీ చర్చ జరురగుతోంది. గత ఏడాది అంటే 2022 మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన మహానాడు... నుంచి సైకిల్ పార్టీ శ్రేణుల్లో  నయా జోష్ కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ఈ మహానాడు వేదికగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభ ప్రకటన చేయడం.. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తామని వెల్లడించడం.. అదే విధంగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం... చివరకు తెలంగాణ  లోని ఖమ్మం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ విజయవంతం కావడంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో సైతం కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది.   అయితే ఈ శంఖారావ సభ సక్సెస్‌తో అధికార గులాబీ పార్టీలో   గుబులు  రేగింది.  ఇక హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. అదే విధంగా అటు విజయవాడలో ఇటు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించడం.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కైవసం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.    ఈ వరుస పరిణామాలన్నీ నిశీతంగా పరిశీలిస్తే.. ఒంగోలులో నిర్వహించిన మహానాడు నుంచి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం శ్రేణుల్లో  ఉత్సాహం ఉరకలేస్తోందని పోలిటికల్ సర్కిల్‌లో  బలంగా వినిపిస్తోంది.  ఒక్క సారి 2019 నుంచి 2022 మే వరకు చోటు చేసుకొన్న పరిణామాలను గమనిస్తే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. దీంతో ఆ ఏడాది ఆ పార్టీ ఆధినాయకత్వం మహానాడును నిర్వహించ లేదు. ఇక 2020లో కరోనా వేళ.. మహానాడు ఊసే లేదు. ఆ మరుసటి ఏడాది అంటే 2021లో కూడా కరోనా ఎఫెక్ట్‌తో మహానాడు నిర్వహించలేదు కానీ... టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించగా.. దానికి మంచి స్పందన అయితే వచ్చింది.  మరోవైపు   జగన్.. గద్దెనెక్కిన తర్వాత తొలి కేబినెట్‌లోని మంత్రుల బూతుల పంచాంగానికి... అలాగే ప్రతిపక్ష పార్టీ నేతగా  జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. ఆయన గద్దెనెక్కిన తర్వాత అమలు చేస్తున్న విదివిధానాలకు ఎక్కడా పొంతన లేదని.... దీంతో  జగన్  పాలనపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది కానీ ...  అది ఏ స్థాయిలో ఉందనేది మాత్రం ఎవరికి ఇతమిద్దంగా అంతు పబట్టని విధంగా.. అర్థం కానీ విధంగా ఉండేది.. కానీ 2022లో ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడుకు  జనం పోటెత్తారు. దీంతో జగన్ పాలనపై ప్రజలు క్లారిటీగా ఉన్నారని.. వారంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని.. నిన్న.. నేడు.. రేపు కూడా ఆ పార్టీతోనే కలిసి నడుస్తారని అందరికీ అర్థమైంది. తాజాగా రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుతో అది సుస్పష్టమైందని  రాజకీయవర్గాల్లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మహానాడు విజయవంతం కావడంతో.. రాబోయే ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ తప్పకుండా సత్తా చాటి... అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో  బలంగా వ్యక్తమౌతోంది. 

తెలుగుజాతికి పెద్ద పండుగ మహానాడు!

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రాజమహేంద్రవరం వేదిక అయింది. ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అన్నగారు అభిమానులు భారీగా పోటెత్తారు. మరోవైపు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు పసుపు   శోభను సంతరించుని బంతిపూల వనంలా మారాయి. ఇక ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో రాజమహేంద్రవరంలో మహానాడు.. రాజమహేంద్రవరంలో మహానాడు అంటూ.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.   తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా జరుపుకొంటున్న మహానాడు.. పార్టీ శ్రేణులకు ఓ పర్వదినం. అదే విధంగా తెలుగు తమ్ముళ్లకు అత్యంత ఆత్మీయమైన రోజు. అంతే కాదు.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ మహానాడు తెలుగుజాతీ యావత్తుకు పెద్ పండుగ.  అసలు అలాంటి రోజుకు.. మహానాడు అనే పేరు అసలు ఎలా వచ్చింది. అలాగే ఈ మహానాడును తెలుగుదేశం పార్టీ మే నెల చివరి రోజుల్లోనే ఎందుకు జరుపుకొంటుంది. అయినా మహానాడు అంటే అర్థం ఏమిటి?.. ఇంతకీ మహానాడు అనే పేరు ఎవరు,ఎందుకు పెట్టారనే అంశాలను తెలుసుకునేందుకు రాజమహేంద్రవరంలో మహానాడు జరుగుతోన్న వేళ ప్రజలు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.   వెండితెర కథనాయకుడిగా ఓ వెలుగు వెలుగుతోన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. 1982, మార్చి 29వ తేదీ హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తొమ్మిది నెలలకే జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. దీంతో అప్పటి వరకు రాష్ట్రంలో అప్రపతీహతంగా సాగుతోన్న కాంగ్రెస్  పాలనకు అన్న ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లు అయింది.  మరోవైపు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. పార్టీ జెండా, గుర్తు, పథకాల రూపకల్పన తదితర అంశాలపై వాడివేడిగా చర్చోపచర్చలు జరుగుతోన్న వేళ.. పార్టీలోని ఇతర నాయకుల అభిప్రాయాలను సైతం ఎన్టీఆర్ స్వీకరించారు. ఆ క్రమంలో 1982, ఏప్రిల్ 11వ తేదీన పార్టీ విధి విధానాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగాతీసుకు వెళ్లేందుకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. అందులోభాగంగా ఈ సభకు ఏ పేరు పెడితే బాగుంటుందంటూ చర్చ జరుగుతోండగా.. మహానాడు పేరు పెడదామని ఎన్టీఆర్ సూచించడంతో.. ఆయన సూచనకు అందరు హ్యాట్సాఫ్ చెప్పారు. కానీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మే 28న  గుంటూరులో నిర్వహించిన సభ నే  తొలి మహానాడుగా పేర్కొనడం విశేషం.  అయితే టీడీపీ అగ్రశేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా మహానాడుకి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సభ ప్రాంగణం వేదికగా అంతా కలసి తీర్మానాలు ఆమోదించుకోవడం... పార్టీ ప్రారంభమైన నాటి నుంచి ఓ ఆచారంగా వస్తుందన్న విషయం విధితమే. అలాగే ఇదే వేదికగా పార్టీ అధ్యక్షులను సైతం ఎన్నుకొవడం మరో విశేషం. అలాగే పార్టీ చేపట్టే భవిష్యత్తు కార్యాచరణను సైతం ఇదే మహానాడు వేదికగా ప్రకటిస్తూ పార్టీ అధినేతలు వస్తున్నారు.   మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా మహానాడును మే 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అంటే మే 28వ తేదీ ఎన్టీఆర్ జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అలాగే ఆయన జన్మదినం మరునాడు నిర్వహిస్తు వస్తున్నది.. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, అలాగే 2020, 2021 కరోనా నేపథ్యంలో మహానాడు ప్రజల మధ్య జరుపుకోలేదు. ఈ మహానాడును ఆన్‌లైన్‌లో జరుపుకోవడం విశేషం. మరోవైపు కరోనా నేపథ్యంలో మహానాడును మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదించారు.  ఇక 2022, మే 27న ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు కావడంతోపాటు ఎన్టీఆర్ 99వ జయంతి   కూడా ఇదే మహానాడు వేదికగా జరగడం మహావిశేషం.   తెలుగుదేశం పార్టీ స్థాపించిన 41 ఏళ్లు అయినా.. కొన్ని సార్లు మహానాడు జరుపుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక మహా అంటే మొత్తం సమీకరణ, గంభీరం అని అర్థాలు సూచిస్తుంది. దీంతో మహానాడు అంటే.. అందరికీ కలుపుకొని పోయే రోజుగా భావిస్తున్నారు. అదీకాక పార్టీ స్థాపించిన తొలినాళ్లలో మహనాడు ఒక రోజే నిర్వహించే వారు. కానీ ఈ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడం.. వారిందరిని మాట్లాడించడం కోసం.. సమయం చాలకపోవడంతో.. ఆ తర్వాత ఒక రోజును..  రెండు రోజులకు. అలాగే రెండు రోజులను మూడు రోజులకు  పొడిగించారు. కానీ కరోనా నేపథ్యంలో మహానాడు రెండు రోజులకే పరిమితం చేస్తున్నట్లు ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఏదీ ఏమైనా అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదగా.. ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ అన్న గారి చిరు నవ్వులా... నిత్యం వెలుగుతూ.. సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్నట్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తి అన్నగారి నిత్య సత్యాస్పూర్తితో ముందుకు కదం తొక్కుతోంది.

శకపురుషుని శతజయంతి.. జయహో ఎన్టీఆర్!

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనీషి ఎన్టీఆర్. ఇది.. తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం ఎన్టీఆర్ శతజయంతి సందర్భం. ఆకర్షణకూ, సమ్మోహనత్వానికీ మరోపేరుగా భాసించిన తారకరాముడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న లక్ష్మయ్య, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన నోట ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలికాయి. 1942 మేలో పందొమ్మిది సంవత్సరాల వయసులో మేనమామె కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్. శర్మ వంటి నటులతో కలిసి ఎన్నో నాటకాలు ఆడారు. ఆయన కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయని ఆనాడే అందరూ ప్రశంసించారు.  మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే బీయే పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా! సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు. కొన్ని కష్టాల తర్వాత లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ రూపొందించగా 1949లో విడుదలైన 'మనదేశం' చిత్రంలో చేసిన పోలీస్ సబిన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌తో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు. అప్పుడెవరూ ఊహించలేదు.. నందమూరి తారక రామారావు అనే యువకుడు సమీప భవిష్యత్తులోనే తన సమ్మోహన శక్తితో, అనితర సాధ్యమైన అభినయంతో తెలుగువారి ఆరాధ్య తారగా వెలుగొందుతాడని! 1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పాతాళభైరవి' సినిమా ఎన్టీఆర్ నటజీవితాన్ని మలుపు తిప్పింది. తోటరామునిగా తారకరాముడు తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచాడు. తన రూపం, వాచకం, అభినయం, ఖడ్గచాలనంతో వారిని సమ్మోహితుల్ని చేసేశాడు. ఆయన నటన ఒక ఎత్తు, నడక మరో ఎత్తు.  ప్రధానంగా పౌరాణిక చిత్రాలు తారాకరాముని తెలుగువారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు.. ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు.. ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు.. ఆయనే భీముడు, ఆయనే బృహన్నల.. అన్నీ ఆయనే! తెరపై కనిపించేది ఎన్టీఆర్ కాదు, ఆయా పాత్రలే. శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం, సుయోధనుడి వాచకం రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లు. 'లవకుశ' చిత్రంలో చేసిన అపూర్వాభినయంతో తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడు ఆయనే అయిపోయారు. అంతకంటే ముందుగానే 'మాయాబజార్' సినిమాతో శ్రీకృషునిగా నీరాజనాలు అందుకున్నారు. ఆ కాలంలో శ్రీరామ, శ్రీకృష్ణ వేషాల్లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు పటాలు, క్యాలెండర్లు.. అనేక తెలుగిళ్లలోని గోడలపై అలంకారాలయ్యాయి. ఆయనే రామునిగా, ఆయనే కృష్ణునిగా భావించి పూజలు చేసిన వాళ్లెందరో!  తారకరాముడు కేవలం తెరపై గొప్పనటుడు మాత్రమే కాదు, తెరవెనుక మహాగొప్ప దర్శకుడు కూడా! 1961లో వచ్చిన 'సీతారామ కల్యాణం' దర్శకునిగా ఆయన తొలి సినిమా. అయితే సొంత బేనర్ ఎన్ఏటీపై తీసిన ఆ సినిమా టైటిల్స్‌లో దర్శకుని పేరు వేయకుండా రిలీజ్ చేయడం ఆయనకే చెల్లింది. ఇందులో ఆయన రావణాసురుని పాత్రను పోషించారు. దర్శకునిగా తన ప్రతిభ ఏమిటో తొలి సినిమాతోనే ఆయన చాటిచెప్పారు. 1977లో విడుదలైన 'దానవీరశూర కర్ణ' చిత్రంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసి, మరో చరిత్ర సృష్టించారు. పౌరాణిక పాత్రలతో తెలుగువారి అవతార పురుషునిగా రాణించిన ఎన్టీఆర్ జానపద, చారిత్రక చిత్రాల ద్వారానూ అమితంగా ఆకట్టుకున్నారు. 'శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' చిత్రం నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. టైటిల్ రోల్‌ను పోషిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లోనే పూర్తయినా, సెన్సార్ చిక్కుల్లో పడి, ఆయన ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తర్వాత 1984లో విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిన నందమూరి తారకరామారావు.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో జీవించి, తరించారు. తరగని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచారు. 'మనదేశం'తో మొదలైన మహానటప్రస్థానం 'మేజర్ చంద్రకాంత్' వరకూ జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో, తనకెంతో ఇష్టమైన 'శ్రీనాథ కవిసార్వభౌమ' పాత్ర కూడా పోషించి సంతృప్తిపడ్డారు. నటునిగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైనందుకు తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో స్వీయానుభావంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం కించపరుస్తున్నదని గ్రహించి, తెలుగువాడి సత్తా ఏమిటో తెలియజెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగి, 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు ఎన్టీఆర్. తెలుగువారు ఈ నేలమీద ఉన్నంతవరకూ ఒక శకపురుషునిగా నందమూరి తారకరామారావు పేరు నిలిచే ఉంటుంది. ఇది సత్యం, ఇది తథ్యం.                                                                                                                                   - బుద్ధి యజ్ఞమూర్తి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేకం