అవినాష్ తల్లి హెల్త్ బులిటెన్లో ఏముంది? ఏం జరుగుతుంది?
posted on May 22, 2023 @ 10:43AM
అవినాష్ రెడ్డి సీబీఐకి చుక్కులు చూపిస్తున్నారు. దేశంలో సర్వోన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అవినాష్ ముందు చిట్టులుకలా మారిపోతోంది. విచారణకు డుమ్మా కొట్టినా, పదే పదే ఏవో సాకులు చెప్పి గైర్హాజరైనా చర్యలు తీసుకునే చొరవ చేయలేకపోతోంది. సీబీఐ తీరు చూస్తుంటే.. ఆసలది దర్యాప్తు సంస్థఏనా? అన్న అనుమానం సామాన్యులకు సైతం కలిగేలా ఉంది. అటువంటి సీబీఐ ఎట్టకేలకు ధైర్యం చేసి కర్నూలు చేరుకుని అక్కడి ఎస్పీకి తాము అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. లొంగిపొమ్మనండి లేదా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.
అయినా కర్నూలులో పోలీసుల సహకారం కరవైందా? లేక సీబీఐకే ధైర్యం తక్కువైందా తెలియదు కానీ ఈ తెల్లవారు జామునుంచీ ఆస్పత్రి వద్ద హైడ్రామా నడుస్తోంది. ఇహనో ఇప్పుడో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయనున్నారని అంతా భావిస్తున్న వేళ ఇప్పటి వరకూ హెల్త్ బులిటిన్ విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ చెబుతూ వచ్చిన కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు అవినాష్ తల్లి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ బులిటిన్ లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నారని చెప్పారు. వాంతులు అవుతున్నాయని తెలిపారు. లోబీపీ ఉందని వెల్లడించారు.
ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరి కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు రోజులుగా విడుదల కాని హెల్త్ బులిటెన్ ఇప్పుడే విడుదల కావడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఆసుపత్రి అవినాష్ స్నేహితుడికి చెందినది కావడం, పులివెందులకు దగ్గరగా ఉన్న బెంగళూరును కాదని, అలాగే అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే హైదరాబాద్ నూ కాదని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ తన తల్లిని చేర్చించడంపై నాలుగు రోజుల కిందటే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ లలో కంటే కర్నూలులో మెరుగైన వైద్యం లభిస్తుందని కాకుండా సీబీఐ నుంచి తనకు ర క్షణ ఏపీలో అయితేనే ఎక్కవ అన్న భావన ఆయనలో ఉందని కూడా పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని అంతా భావిస్తున్న వేళ.. అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల కావడం అనుమానాలకు తావిస్తున్నది.
నిజంగానే అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించి తీరాల్సిందే. అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. అయితే ఇప్పుడు విషయం అది కాదు.. అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపైనే అనుమానాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. ఆ సంస్థ నోటీసులను ధిక్కరించిన తీరు కారణంగానే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పూర్తిగా ఆయన స్వయం కృతం. విశ్వభారతి ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అవినాష్ ను అరెస్టు నుంచి కాపాడటానికా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కూడా అవినాష్ సీబీఐ విచారణను తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సోమవారం (మే 22) ఉదయం నుంచీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జరిగిన, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కాకమానవు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే స్వతంత్రంగా పని చేస్తోందా అన్న అనుమానాలూ వ్యక్తం కాక మానవు. కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్న విశ్వ భారతి ఆసుపత్రి మొత్తం వైసీపీ, అవినాష్ అనుచరుల అధీనంలోనే ఉందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సీబీఐ వాహనాలు ఆ ఆసుపత్రి ఆవరణలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన అవినాష్ రెడ్డి అనుచరులు ఆ తరువాత ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడ నుంచి తొలగించడానికి నానా అగచాట్లూ పడ్డుతున్నారు. వారిని బ్రతిమలాడుకుంటున్నారు. అంతకు మందు ఆదివారం రాత్రి విశ్వభారతి ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో అవినాష్ అనుచరులు సృష్టించిన వీరంగాన్ని పోలీసలు ప్రేక్షకుల్లా తిలకించారు. వైసీపీ ఎమ్మెల్యే తరువాత తీరిగ్గా రంగప్రవేశం చేసి పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ విలేకరులకు చెప్పారు.
అనినాష్ అనుచరుల స్వైర విహారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా విలేకరులకు అవకాశం లేకుండా అవినాష్ అనుచరులు వారికి వెంబడించారంటే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచీ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద పదుల సంఖ్యలో ఉన్న అవినాష్ అనుచరుల వీరంగం సృష్టిస్తే.. మీడియా ప్రతినిథులపై దాడులు చేస్తే.. ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదు కాలేదు. సీబీఐ అధికారులను ఆసుపత్రి వద్ద అడ్డుకుంటుంటే ఆపడానికి పోలీసులకు అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, లేదా అన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.