అవినాష్ సీబీఐ..టామ్ అండ్ జెర్రీ తీరు!
posted on May 21, 2023 7:40AM
వివేకా హత్య కేసు దర్యాప్తు తీరు ప్రతిష్ఠాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను మంటగలుపుతోంది. అవినాష్, సీబీఐల మధ్య గత నాలుగు నెలలుగా సాగుతున్న వ్యవహారం టామ్ అండ్ జెర్రీని గుర్తుకు తెస్తోంది. ఒక సారి నువ్వు పై చేయి సాధించు.. మరో సారి ఆ చాన్స్ నాకివ్వు అని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా అవినాష్, సీబీఐ తీరు ఉంది. అనివాష్ పార్టీ పనులున్నాయంటూ విచారణకు డుమ్మా కొడితే.. సరే సార్ మీ పనులన్నీ అయ్యాకే తీరిగ్గా విచారణకు రండి అంటూ సీబీఐ గడువులు పెంచుకుంటూ పోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు వరుసకు సోదరుడనేనా అవినాష్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయన పట్ల ఇంత ఉదారంగా వ్యవహరిస్తోంది. లేదా అవినాష్ రౌడీయిజానికి అంత పెద్ద దర్యాప్తు సంస్థా బెదరిపోయి జీ హుజూర్ అంటోందా? అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అవినాష్ వ్యవహారంలో సీబీఐ తీరుతో తెలుగు రాష్ట్రాలలో సీబీఐ విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్ లో బెట్టింగ్ లు చేస్తున్నట్లుగా జనం అవినాష్ ను సీబీఐ అరెస్టు చేయదంటూ కోట్లలో బెట్టింగులు చేస్తున్నారంటే.. సీబీఐ సత్తా, సామర్థ్యంపై విశ్వాసం, విశ్వసనీయతా జనంలో ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్ధమౌతుందంటున్నారు.
కాగా కొంచం అటూ ఇటూగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఇవే సందేహాలను, ఇవే అనుమానాలనూ వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీకి ఉన్న పాటి సత్తా, ధైర్యం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు లేదా అని నిలదీశారు. లేదా ఏపీ సీఎం తమ్ముడికి సీబీఐ దృష్టిలో ఏమైనా ప్రత్యేక అర్హతలు ఉన్నాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఒక రూలు, ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి మరో రూలూ ఉంటుందా అని ప్రశ్నించారు.
తలా తోకా లేని నోటీసులతోనే రాత్రికి రాత్రి ఏపీ సీఐడీ అరెస్టులు చేసి పట్టుకు పోతుంటే.. కోర్టుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాత కూడా సీబీఐ అవినాష్ దరిదాపుల్లోకి కూడా ఎందుకు వెళ్లలేకపోతోందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇక నుంచి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చినా ఎవరూ విచారణకు హాజరు కావద్దని పిలుపు నిచ్చారు. ఏపీలో అయితే సీబీఐ అడుగు పెట్టలేదన్న ధైర్యంతోనే అవినాష్ కర్నూలు ఆస్పత్రిలో తలదాచుకున్నారని ఆయన ఆరోపించారు.