మళ్లీ సుప్రీంకు అవినాష్?
posted on May 22, 2023 @ 11:05AM
సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ న మెన్షన్ చేయనున్నారు. గతంలోనే హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
అయితే ఆ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు తేదీ ఖరారు చేయలేదు. జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే సోమవారం (మే22) సీబీఐ అవినాష్ ను దాదాపుగా చుట్టుముట్టి అరెస్టు చేయడానికి సిద్ధం అయిన నేపథ్యంలో అవినాష్ మరో సారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు. హై కోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన బెయిలు పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను అరెస్టు చేయవద్దని సుప్రీంను అవినాష్ అభ్యర్థించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
అరెస్టు అనివార్యం అని తేలిపోయినా, సుప్రీం కోర్టు పదే పదే సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెబుతున్నా అవినాష్ ఎందుకు పరుగులు తీస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నారు? అన్న ప్రశ్నకు ఆయన ఆశలన్నీ ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మీదే ఉన్నాయని అంటున్నారు.
జగన్ హస్తన వెళ్లే వరకూ తన అరెస్టును నిలువరించుకోగలిగితే అక్కడ ఆయన ఎలాగోలా చక్రం తిప్పి సీబీఐ అరెస్టు నుంచి తనను కాపాడగలరని అవినాష్ హోప్ ఫుల్ గా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అవినాష్ అరెస్టునకు సీబీఐ రంగం చేసిన సందర్భంలో జగర్ హస్తిన వెళ్లి రాగానే అరెస్టు విషయం వెనక్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో సారి అటువంటిదే ఏదో ఒకటి జగన్ చేయగలర్న నమ్మకంతోనే ఎలగైనా ఈ నెల 26 వరకూ సీబీఐకి చిక్కకుండా తప్పించుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఇంత వరకూ వచ్చిన తరువాత సీబీఐ కూడా అవినాష్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనీ, అందుకే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్వయంగా అవినాష్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంలో అవినాష్ పిటిషన్ వేస్తే దానిని సీబీఐ కూడా గట్టిగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.