డిసెంబర్ లేదా జనవరిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?
posted on May 22, 2023 5:42AM
నిజం కావచ్చును ..కాకపోనూ వచ్చును, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి, తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు పోవడం ఖాయమని చెపుతూనే ఉన్నారు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
కార్యకర్తలలో జోష్ పెంచేందుకు విభిన్న కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ఓ వంక యువనేత నారా లోకేష్, యువ గళం పాద యాత్ర తో జన ప్రభంజనం సృష్టిస్తున్నారు. మరో వంక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనేందుకు నియోజక వర్గాల స్థాయిలో క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు.
అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయక పోవచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్త పరుస్తున్నా, చంద్రబాబు నాయుడుతో పాటుగా, ఇప్పటికే టీడీపీతో పొత్తుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ముందస్తు ముచ్చట తెచ్చారు.ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నెల నుండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అలాగే వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ముహూర్తాలు కూడా ఖరారు చేశారు. గతంలో కర్ణాటక ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పిన రఘురామకృష్ణం రాజు , తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ గా కనిపిస్తోందన్నారు. అయితే ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయమని అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు.
అదలా ఉంటే ఇప్పడు తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం (2023)డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం (2024)జనవరిలో ఎన్నికలువస్తాయని స్పష్టం చేశారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అదెలా ఉన్నా ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు కోరుకొవడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
ముఖ్యంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కారణాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం అండదండలు అడుగంటిపోతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక అక్రమాస్తుల కేసులు, బాబాయి మర్డర్ కేసుకు సంబందించిన చిక్కు ముళ్ళు తొలిగి పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో గుడ్డిదో ఎడ్డిడో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.