అవినాష్ అరెస్టు.. రంగంలోకి కేంద్ర బలగాలు?
posted on May 22, 2023 @ 12:16PM
అవినాష్ ఇక అరెస్టు నుంచి తప్పించుకోలేరా? ఆఖరి ఆశగా ఆయన దాఖలు చేసుకున్నముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించడంతో ఇక సీబీఐ కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఇప్పటికే కర్నూలు ఎస్పీకి అవినాష్ ను అరెస్టు చేస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయమని సీబీఐ కోరింది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పడంతో సీబీఐ కేంద్ర బలగాలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని సీబీఐ అధికారులే చెబుతున్నారు. మరో వైపు అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. కర్నూలులోని అవినాష్ రెడ్డి స్నేహితుడి ఆస్పత్రి అయిన విశ్వభారతి ఆస్పత్రి వైద్యులపై అంతగా విశ్వాసం ఉంచని సీబీఐ ఆమెను వేరే వైద్యుల ఒపీనియన్ తీసుకునే దిశగా కూడా సీబీఐ యోచన చేస్తున్నది.
ఇలా ఉండగా ఇప్పటికీ విశ్వభారతి ఆస్పత్రి పూర్తిగా అవినాష్ అనుచరుల అధీనంలోనే ఉండటంతో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇలా ఉండగా అవినాష్ ను అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కర్నూలు ఎస్పీ చెప్పడాన్ని సీరియస్ గా తీసుకున్న సీబీఐ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వివరించి సూచనలు తీసుకుంటున్నారు. అవినాష్ తీరుపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆయనను అరెస్టు చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇక అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోనికి దించైనా అదుపులోనికి తీసుకోవాలని చెప్పినట్లు ప్రచారం అవుతోంది.
ఇక అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐ తాత్సారంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘అవినాష్ రెడ్డిగారూ పిచ్చి చూపులు చూస్తున్న సీబీఐ మీద దయ చూపించడండి.. సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రపంచానికే హీరోగా నిలబడిన ప్రధాని మోడీ చేతిలో చేతకాని సీబీఐ ఉందన్న చెడ్డ పేరు తీసుకురాకండి.. దయచేసి లొంగిపోండి’ అంటూ ఓ రేంజ్ లో నెటిజన్లు సీబీఐని ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన సీబీఐ ఒక్కటొక్కటిగా అడ్డంకులను తొలగించుకుంటూ.. ముందుకు అడుగులు వేస్తున్న సీబీఐని నిలువరించడానికా అన్నట్లు అవినాష్ రెడ్డికి ర క్షణ కవచంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బైఠాయించారు. వారితో పాటు హాస్పిటల్ ముందే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు, వారి బంధువులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని సీబీఐ బృందాలు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి నివేదించాయి. దీంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిన సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఆమేరకు చర్యలు చేపట్టింది. ఈ మధ్యాహ్నానికి కేంద్ర బృందాలు కర్నూలు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత ఏ క్షణంలోనైనా అవినాష్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.