నోటు వాపస్ ఓటు వాపస్?
posted on May 21, 2023 7:50AM
అనుకున్నదే జరిగింది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించిన నేపధ్యంలో, విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అస్త్రాన్ని బయటకు తీసింది.రూ.2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పెద్ద నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఆ తర్వాత 2 వేల రూపాయల నోటు ఉన్నా.. అది చెల్లని కాగితంతో సమానంగా విలువను కోల్పోతుంది.
అయితే, రూ.2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకోవడం వల సామాన్యులపై అంతగా ప్రభావం ఉండదు, నిజానికి సామాన్యులు రూ. 2000 నిటు చూసి చాలా కాలం అయింది. 2016 లో పెద్ద నోట్ల రద్దు సమయంలో అవసరార్ధం రూ.2000 నోట్లను చెలామణి లోకి తెచ్చిన రిజర్వు బ్యాంకు, అవసరం తీరిన తర్వాత 2018 నుంచే రూ.2000 నోట్ల ముద్రణను నిలుపు చేసింది.
అంతే కాకుండా, చాలా కాలంగా బ్యాంకుల ఏటీఎంలలో రెండువేల రూపాయల నోట్ల అంతగా ఉంచడం లేదు. ఇక ఇప్పుడు కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అంటే, స్పెషల్ పర్పస్ కోసం కోట్లలో నోట్ల కట్టలను పేర్చుకున్న వారికి తప్పించి , రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం సామాన్యుల పై ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, రూ.2000 నోట్ల చెలామణిని నిలిపివేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంపన్నులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఐటీ లెక్కల్లో చూపకుండా ఎక్కువ నగదును నిల్వ చేసుకునే వారు సాధారణంగా పెద్ద నోట్లనే ఎంచుకుంటారు. అంటే, కోట్ల రూపాయల సొమ్మను రూ.2000 నోట్ల కరెన్సీలో నిల్వ చేసుకునే వారు లెక్కలేనంత మంది ఉంటారు. పెద్ద మొత్తంలో అవసరం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఖర్చు చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారు చిక్కుల్లో పడ్డట్లే. బ్యాంక్ ఖాతాల్లో రూ.2000 నోట్లను ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఆర్బీఐ చెప్పింది.
అయితే, రూ. 50 వేలు మొదలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సి వస్తే.. పాన్ కార్డ్ కావాల్సిందే. కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాల్సి వస్తే.. అందుకు తగిన లెక్కలు చూపించి, ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇప్పటిదాకా దాచుకున్న డబ్బును ఒకేసారి డిపాజిట్ చేస్తే.. కచ్చితంగా ఐటీ అధికారుల దృష్టిలో పడతారు. అంటే, ఎన్నికల ముందర రాజకీయ నాయకులకు ఇది గట్టి దెబ్బగానే చెప్పవచ్చు.అందుకే రిజర్వు బ్యాంకు తీకున్న నోటు వాపస్ నిర్ణయం.. ఓటు వాపస్ నిర్నయంగానూ భావిస్తునారు.