విలువల గురించి బే ఫికర్.. రాపాక రాజకీయం!
posted on May 22, 2023 6:55AM
ఎన్నికలు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందాలంటే.. పార్టీ అండ దండ కావాలి. అలా అయితేనే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అధ్యక్షా అనొచ్చు. కానీ గత ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. ఇప్పటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్నికల నాటికి సీన్.. సితారా అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌కు గట్టిగానే అర్థమైన్నట్లుందనే ఓ టాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఆయన ఫ్యామిలీకి రాపాక వారు గట్టిగానే సోప్ వేస్తున్నట్లు ఆయన చర్యలు చూస్తే ఇట్టే అర్థమవుతోందనే చర్చ సైతం సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం తన కుమారుడు వివాహ వేడుకను రాపాక వాడుకొంటున్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఆ క్రమంలో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రంపై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో.. అంటూ వారి పొటోలను ముద్రించిన శుభలేఖ అటు మీడియాను ఇటు సోషల్ మీడియాను చూట్టేస్తోంది. అయితే ఈ పోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు..ఫ్యాన్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. జనసేన శ్రేణులు మాత్రం వ్యంగ్య బాణాలు సంధిస్తోంది.
ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇవే ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు రాపాక.. దాంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.
తాను జనసేన సభ్యుడిగానే ఉంటానని.. అలా అయితే తన నెంబర్ 1 గా ఉంటుందని.. అదే జగన్ పార్టీలోకి వెళ్లితే.. తన నెంబర్ 152గా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా రాపాక ప్రకటించారు. అలా చెప్పిన కొద్ది రోజులకే రాపాక.. పార్టీ కండువా మార్చే చేశారు. ఆయన కుమారుడిని ముందుగా పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పారు. అలాగే పి.గన్నవరంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో సైతం ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకొని.. వేదిక మీద ఆశీసునులు అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి అధికార ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రాపాక సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఓ వేళ పార్టీ టికెట్ సీఎం జగన్ వలదన్నా... తన వంతు ప్రయత్నంగా ముందు చూపుతో రాపాక వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరందుకొంది.