అవినాష్.. సీబీఐ.. ఓ అంతులేని కథ
posted on May 22, 2023 6:38AM
తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏసీబీ, ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారి జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. సీనియర్ జర్నలిస్టు అంకబాబు వంటి వారిని అర్ధరాత్రి అరెస్టు చేసిన సంఘటనలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీళ్లెవరూ ఉగ్రవాదులు కాదు... రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసి పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. అర్థరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, ఒక్కో చోట తలుపులు బద్దలుకొట్టి, కాంపౌండ్ వాల్ దూకి మరీ అరెస్టు చేశారు.
టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నఉన్నారంటూ 2020 జనవరిలో అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడ కు తరలించింది. శస్త్ర చికిత్స చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇందు కోసం దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాదాపు దాడి చేసినంత పని చేశారు.
అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరు కూడా వివాదా స్పదంగానే ఉంది. ఆయన జన్మదినం రోజున అర్దరాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ రోడ్డు మార్గాన ఏపీకి తీసుకువచ్చింది. దారి పొడవునా చిత్రహింసలు పెట్టిందని ఆయన ఆరోపించిన సంగతి విదితమే. అలాగే ఏపీలో విపక్ష నేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారి పట్ల ఏపీ సీఐడీ ఇలాగే వ్యవహరించింది. నోటీసులు, పద్ధతులు, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా అరెస్టులు చేసింది. అదే వివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ విషయానికి వచ్చే సరికి అన్ని అనుమతులూ ఉన్నా, అరెస్టే తరువాయి అని స్వయంగా కోర్టులకు చెప్పిన సీబీఐ ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి జంకుతోంది.
కేంద్ర దర్యాస్తు సంస్థ అయిన సీబీఐ తీరు నవ్వుల పాలౌతోంది. జనంలో ఆ దర్యాప్తు సంస్థ చులకన అవుతోంది. అయినా పట్టించుకోవడం లేదు. విచారణకు రండి సార్ అని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి బతిమలాడుకుంటోంది. అయినా కూడా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాను కాక కాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పనులంటూ ఓసారి, తల్లి అనారోగ్యం అంటూ మరోసారి, ఇంకోసారి కడుపునొప్పి అంటూ స్వయంగా తానే ఆసుపత్రిలో చేరారు. ఇక తాజాగా తన తల్లి ఆనారోగ్యంతో ఉన్నందున ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వరకూ విచారణకు హాజరు కావడానికి కుదరదని మరోసారి సీబీఐకి లేఖ రాశారు. సోమవారం( మే10) విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మొదలైన హై డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు విచారణకు బయలుదేరిన అవినాష్ తల్లి ఆనోరోగ్యం సమాచారం అందిందంటూ డుమ్మా కొట్టారు. హైదరాబాద్ కు కానీ.. ఇటు బెంగళూరుకు కానీ తీసుకెళ్లకుండా మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు, అవినాష్ రెడ్డి స్నేహితుడు.
సరే సీబీఐ సోమవారం(మే 22) విచారణకు రండి అంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కూడా ఆయన కుదరదనే సమాధానం ఇచ్చారు. ఆయన తీరును చూస్తే.. ఇప్పట్లో ఆయన విచారణకు హాజరు కాను అని చెప్పినట్లే ఉంది. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడానికి చాలా పకడ్బందీగా అవినాష్ రెడ్డి ఆడుతున్న గేమ్ లో సీబీఐ చిత్తవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అవినాష్ తీరు పట్ల సీబీఐ సీరియస్ గా ఉందనీ, సీబీఐ కేంద్ర కార్యాలయం ఆయనను అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసిందనీ వార్తలు వస్తున్నా.. సీబీఐ మాత్రం గడువు మీద గడువు ఇచ్చుకుంటూ వెళుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తోందా.. లేక అవినాష్ చెప్పినట్లు చేస్తోందా అని పరిశీలకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అవినాష్ విచారణ తెలుగు టీవీ సీరియల్ లా అంతులేకుండా సాగుతోందని అంటున్నారు.