రాజాసింగ్ దుస్థితి.. స్వయంకృతం!
posted on Aug 8, 2023 @ 6:02PM
బీజేపీలో వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ ఎటు వెళ్తున్నారు..? రాజకీయాలకు దూరమవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కష్టమేనా? అంటే దాదాపు అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో తాజాగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలనే అందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. తాను మళ్లీ సభలో ఉండను అని స్వయంగా రాజా సింగ్ చెప్పడం విస్తృత చర్చకు దారి తీసింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో నిర్వేదంగా మాట్లాడారు. ఇప్పుడు సభలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు వచ్చేసారి శాసన సభలోకి రావొచ్చు. రాకపోవచ్చు. తాను అయితే మళ్లీ సభలో అడుగుపెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు అని సభాముఖంగానే చెప్పేశారు. తనను అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని అంటూ రాజాసింగ్ భావోద్వేగానికి గురయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలోని ధూల్‌పేట్‌లో లోధి ప్రజలకు ప్రభుత్వం తోడుగా ఉండాలని ఆయన కోరారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక మర్మమేదో ఉందన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో రాజాసింగ్ ఘోషామహల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికలలో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. హింసను ప్రేరేపించేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే బీజేపీ మాత్రం ఇంకా ఆ సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. అంతే కాకుండా గోషామహల్ నియోజకవర్గానికి ఆయన్ని దూరం చేసేలా బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నదన్న అభిప్రాయం ఆ నియోజకవర్గ ప్రజల నుంచే వ్యక్తం అవుతోంది. కాగా రాజాసింగ్ కూడా ఇటీవల పలు సందర్భాలలో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో నూ బయటా కూడా తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని రాజాసింగ్ దాపరికం లేకుండా చెబుతున్నారు.
గోషామహల్ నియోజకవర్గాన్ని వదులకోవాల్సి వస్తే రాజకీయాలకు దూరమవుతానని ఆయన విస్పష్టంగా చెబుతున్నారు. అయితే రాజాసింగ్ కు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదురుకావడానికి ఆయన స్వయంకృతమే కారణమని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. పరిధి మీరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. స్థానిక ముస్లిం వర్గాలతో దురుసుగా ప్రవర్తించడం.. ఇవన్ని ఆయనను పార్టీ పక్కన పెట్టేయడానికి కారణమైంది. తీరా ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత వగచి ఏం ప్రయోజనం అని, ఇప్పుడు ఆయన ఏం చేసినా చేతులు కాలాక..ఆకులు పట్టుకున్నట్లే అవుతుందని అంటున్నారు.