వచ్చే ఎన్నికలలో గద్దర్ కుమారుడికి కాంగ్రెస్ టికెట్?
posted on Aug 8, 2023 @ 5:45PM
ప్రజాయుద్ధ నౌక గద్దర్ కుమారుడు సూర్యం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అబ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక అభిమానులు ఆయన మరణంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయి ఉన్నారు. అటువంటి వేళ ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లతో ఆయన విజయం సాధిస్తారని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.
గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలుపుతూ సందేశం పంపిన సంగతి విదితమే. గద్దర్ భార్య విమలకు సానుభూతి తెలియజేసిశారు. కాగా గద్దర్ కుమారుడికి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ కి అవకాశం కల్పించాలన్న రాష్ట్ర పార్టీ ప్రతిపాదనను హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. గద్దర్ కుమారుడికి పార్టీ టికెట్ విషయమై ఎన్నికల కమిటీలో చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుని ఎక్కడ నుంచి ఆయన పోటీ చేసేది తదితర విషయాలను అధికారికంగా ప్రకటించే అవకాశలు ఉన్నాయంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో తన పాటతో జనాలను చైతన్యం చేయడంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. అయితే.. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు దాటినా.. బీఆర్ఎస్ గద్దర్ కు ఎటువంటి గుర్తింపూ ఇవ్వలేదని ఆయనే స్వయంగా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా గత రెండు మూడేళ్లుగా గద్దర్ ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు మెయిన్ టైన్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో కొద్దిరోజులు బీజేపీ వైపు అడుగులు వేసినా.. తన భావజాలానికి సెట్ కాదని గ్రహించి కమలం పార్టీకి దూరం జరిగారు. గద్దర్ మరణానంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి తదితర నేతలంతా కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇస్తూ అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ వెన్నంటే ఉన్నారు. అమీర్‌పేట్ నుంచి ఎల్బీ స్టేడియం.. అక్కడి నుంచి అల్వాల్ వరకు జరిగిన యాత్రలో కాంగ్రెస్నేతలు పాల్గొన్నారు.
గద్దర్ అన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆయనను తమ వాడిగా చెప్పుకునేందుకు ప్రయత్నించింది. అందుకే బీఆర్ఎస్ నేతలు పలువురు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గద్దర్ తన పాటలతో, ఉద్యమ స్ఫూర్తితో సమాజంలోని అత్యధికులను ప్రభావితం చేసిన వ్యక్తి కావడంతోఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు గద్దర్ ను తమకు ఆప్తుడిగా చెప్పుకునే విషయంలో పోటీ పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి గద్దర్ కుమారుడికి పార్టీ టికెట్ కూడా ఆఫర్ చేస్తున్నది.