బాబు చంద్ర నిప్పులు..ఇక సమరమే!
posted on Aug 7, 2023 @ 4:44PM
నిదానమే ప్రధానం అనే చంద్రబాబు దూకుడు పెంచారు. శాంతం శాంతం అనే పెద్దాయన పులివెందుల నడిబొడ్డున నిలబడి.. ఏయ్ జగన్ ఇది నా అడ్డా అంటూ గర్జించారు. తన కుటుంబంపై, కార్యకర్తలపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా ఇది సంస్కారం కాదంటూ వైసీపీకి క్లాస్ పీకిన, న్యాయపోరాటం చేద్దాం అంటూ తెలుగుదేశం శ్రేణులను శాంత పరిచిన చంద్రబాబు ఇప్పుడు తెగించాల్సిన సమయం వచ్చింది తమ్ముళ్లూ అంటూ హుంకరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు.. విలువలు కలిగిన రాజకీయం రావాలని చెబుతూ వచ్చిన చంద్రబాబు, రేపు మాదే అధికారం రాసి పెట్టుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు స్వరం మారింది. గళంలో తీవ్రత పెరిగింది. ఆయన భాషలో మునుపెన్నడూ లేని పదును కనిపిస్తున్నది. పులివెందుల వెళ్లి మరీ వైసీపీ నేతలకు రీ సౌండ్ వినిపించేలా గద్దించి మాట్లాడారు. రాయలసీమ నడి బొడ్డున సభ పెట్టి వై నాట్ పులివెందుల అంటూ నినదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమలో మొదలైన చంద్రబాబు బిగ్ సౌండ్ ఇప్పుడు ఏపీ మొత్తం వినిపిస్తోంది.
చంద్రబాబు దూకుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన నుండే మొదలైంది. పులివెందుల సభలో ఆయన మాట్లాడిన తీరు, పుంగనూరు ఘర్షణలతో ఆయన తెగింపు, నెల్లూరులో ఆయన హెచ్చరికలు.. ఎక్కడ చూసినా గత నాలుగేళ్ళలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే
అలిగిననాడు అన్నట్లుగా చంద్రబాబు ఆగ్రహం కనిపిస్తోంది. అది రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నేను మా నాన్న అంత మంచోడిని కాదంటూ నారా లోకేష్ మాట్లాడితే.. ఇప్పుడు ఆ లోకేష్ ను మించి చంద్రబాబు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతూ ప్రాజెక్టులకు మీరేం చేశారో చెప్పండి.. ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తానని బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ యుద్ధం డిక్లేర్ చేశారు.
అయితే, చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ప్రజల నుండి వస్తున్న స్పందనే అని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భవం తరువాత ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర సమయంలో కనిపించిన జనచైతన్యం ఇప్పుడు చంద్రబాబు పర్యటనల్లో కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా చంద్రబాబు రోడ్ షోకు ఊహించని స్థాయిలో జనాలు పోటెత్తారు. దీంతో చంద్రబాబులో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందంటున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకొని ఈ ప్రాజెక్టుల సందర్శనకు బ్రేకులు వేయాలని చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు తెగించి పోరాడడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా శాంత ప్రవచనాలు వల్లిస్తూ వారి ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని నియంత్రించడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నారనీ అందుకే ఆయన స్వరంలో మార్పు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రజలలో తెలుగుదేశం వైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తుండడంతో చంద్రబాబు తన వయసును మరచి ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం చంద్రబాబు ఏలూరు జిల్లాలో ఉన్నారు. చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించారు. పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలించారు.