ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై మళ్లీ సుప్రీంకు జగన్ సర్కార్
posted on Aug 9, 2023 8:50AM
ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీలో జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని వాదించడమే కాదు.. నమ్ముతోంది. అలా నమ్మకుండా నాలుగు కాళ్లు ఉంటాయన్న వాళ్లని ప్రజా ద్రోహులుగా, పేదల వ్యతిరేకులుగా ముద్ర వేసి ప్రచారం చేయాలనుకుంటోంది. ఈ విషయంలో కోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయడంలేదు. ఎలాగైనా సరే తాను అనుకున్నది చేసి తీరాలని భావిస్తోంది.
ఇప్పటికే పలు మార్లు అమరావతి విషయంలో ప్రజలలోనే కాదు, కోర్టులలో కూడా భంగపాటుకు గురైన జగన్ సర్కార్ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై స్టే ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. అసలింతకీ ఏమీటీ ఆర్5 జోన్ ఇళ్ల నిర్మాణం కథ అంటే పెద్దగా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఆర్5 జోన్ లో ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగానే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పట్టాల పంపిణీకి అనమతి ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పట్టాలపై పేదలకు హక్కు అమరావతి కేసులో తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే లబ్థిదారులకు ఆ భూములపై ఎటువంటి హక్కూ ఉండదని విస్పష్టంగా చెప్పింది. అయినా సరే పేదలను వంచించడమే లక్ష్యం అన్నట్లుగా జగన్ సర్కార్ ఆర్భాటంగా ఆర్ 5 జోన్ లో రాజధానేతర పేదలకు పట్టాలు పంచేసింది.
నిజంగా సుప్రీం కోర్టు తీర్పును జగన్ సర్కార్ గౌరవించి ఉంటే.. ఆ తీర్పు ప్రకారం పట్టాలపై అమరాతి కేసులో తుది తీర్పునకు లోబడే హక్కులు ఉంటాయనీ, ఒక వేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే లబ్ధిదారులకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై ఎటువంటి హక్కూ ఉండదనీ, అవి చెల్లుబాటు కావనీ పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనే వెల్లడించి ఉండాలి. కానీ జగన్ సర్కార్ ఆ పని చేయలేదు. పట్టాలు పంపిణీ చేసిన రోజు ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సభా ముఖంగా ఇళ్ల నిర్మాణం అని చెప్పారు. చెప్పి ఊరుకోలేదు.. గుంతలు పడిన రోడ్లకు కనీపం మరమ్మతులు కూడా చేయకుండా నాలుగేళ్లు లాగించేసిన జగన్ సర్కార్.. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా శరవేగంగా ఆర్5 జోన్ లో ఇళ్ళ నిర్మాణానికి శంకు స్థాపన చేసేని పనులు జరిగేలా చర్యలు జరిగేలా చర్యలు చేపట్టింది. దీంతో అమరావతి కోసం భూములిచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఇళ్ల నిర్మాణంపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. పట్టాల మీద లబ్ధిదారులకు హక్కులు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని గతంలోనే విస్పష్టంగా చెప్పిన సుప్రీం కోర్టు.. ఆ హక్కులేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకం. అలాగే ఇప్పటికే రైతులు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం (ఆగస్లు10) లేదా సోమవారం (ఆగస్టు12)న విచారణకు వచ్చే అవకాశం ఉంది.