జగన్ కు మరో ట్రబుల్ సెప్టెంబర్ 1 ముహూర్తం..!
posted on Aug 7, 2023 @ 2:01PM
ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం సహజం. అయితే, ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇది రాజకీయ సంకటంగా మారింది. గత నాలుగేళ్ళలో కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం కావడంతో ఇప్పుడు అన్ని వైపుల నుండి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన, కుంటుపడిన అభివృద్ధికి తోడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేరని హామీలు అన్నీ ప్రభుత్వానికి గుదిబండలా మారాయి. ఒకవైపేమో ముంచుకొస్తున్న ఎన్నికలు.. మరోవైపు సూటిగా ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలకు తోడు ఇప్పుడు నెరవేరని హామీల తాలూకు బాధితులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలన్నిటీనీ ప్రజల మధ్య చర్చకు పెట్టారు. మరోవైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని ప్రజల కళ్ళకు కనిపించేలా చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కక్ష్ పూరిత వైఖరి, అసమర్ధ పాలనను ఎండగడుతున్నారు.
ఇప్పటికే ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు మరో ట్రబుల్ మొదలు కానుంది. అదే ఉద్యోగ సంఘాల సీపీఎస్ రద్దు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ స్కీం తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. వారం కాదు నాలుగేళ్లు అయినా ఆ హామీ నెరవేరనేలేదు. సీపీఎస్ బదులు జీపీఎస్ అని మరో పథకాన్ని తీసుకొచ్చి మసి పూసి మారేడు కాయ చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. కానీ, అందుకు ఉద్యోగులు అసలు ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా ఓల్డ్ పెన్షన్ స్కీం మాత్రమే అమలు చేయాలనీ, జగన్ మైకులలో ఊదరగొట్టిన హామీ అమలు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబట్టి ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి గళం విప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
సెప్టెంబరు ఒకటిన చలో విజయవాడకు పిలుపునిస్తూ ఉద్యోగ సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. సీపీఎస్ రద్దుతో పాటు, సీపీఎస్ ఉద్యోగులపై గతంలో పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చని నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు.. జీపీఎస్ వద్దు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమరానికి సిద్ధమవుతున్నాయి. వైనాట్ ఓపీఎస్ అంటూ రోడ్డెక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలోనూ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎలాగైనా నిరోధించాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఉద్యోగుల ముందు ప్రభుత్వం పప్పులు ఉడకలేదు.
గతంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా వేలాది మంది ఉద్యోగులు వివిధ మార్గాల్లో విజయవాడకు చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ నిరసన గళాన్ని మరింత బలంగా వినిపించారు. ప్రభుత్వం అడ్డుకున్నా బెజవాడ రోడ్లు ఉద్యోగులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన చేపట్టిన చలో విజయవాడ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ట్రబుల్ గా మారింది. మరోవైపు ఒక్కసారి ఉద్యోగ సంఘాలు బయటకి వస్తే.. గత ఎన్నికలలో ఇచ్చిన మిగతా హామీల బాధితులు కూడా బయటకి రావడం గ్యారంటీ. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లుల విషయంలో హాస్పటిల్స్, కాలేజీల యాజమాన్యాలు గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైతే.. అది అన్ని వర్గాలలో వ్యక్తమవడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితులను వైసీపీ సర్కార్ ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.