అంతా అయ్యాక తీరిగ్గా సీఎం జగన్ ..!
posted on Aug 7, 2023 @ 5:08PM
ఈ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన ఈ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. ఏపీలో అన్ని జిల్లాలలో ఈ వర్షాలు, వరదల ప్రభావం లేకపోగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో మాత్రం ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలనువరదలు ముంచెత్తాయి. ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాలలో బిక్కుబిక్కు మంటూ గడిపారు. అధికారులే వారికి తోచిన సాయం అందించగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్న విమర్శలు భారీగా వినిపించాయి. అందుకే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వరద ప్రాంతాలలో పర్యటించారు.
సీఎం జగన్ సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాంతంలో ఉన్న కూనవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల వర్షాల కారణంగా వరదతో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు. ఇక్కడ జగన్ మాట్లాడుతూ.. బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ముందుందని తెలిపారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకునేందుకు పర్యటిస్తున్నారని.. అక్కడే ఉంటున్నారని చెప్పారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. మొత్తం రెండు రోజులు సీఎం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నట్లు రెండు రోజుల క్రితమే సీఎంఓ ప్రకటించింది.
అయితే, ప్రజలు ఇబ్బందులలో ఉండగా కనీసం అటు కన్నెత్తి కూడా చూడకుండా, ఇప్పుడు వరదలు తగ్గి అంతా అయిపోయాక సీఎం పర్యటనకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎం అనే సంగతి మర్చిపోయి ఒక ప్రతిపక్ష నేత మాదిరి వరద బాధితుల పరామర్శకు వెళ్లినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో వరదలు, తుఫాన్ల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ప్రజలకు అండగా నిలిచారో గుర్తు చేసుకుంటున్న ప్రజలు.. ఇప్పుడు వరదలు అయ్యాక వెళ్లి పరామర్శించి హామీలు ఇస్తున్న సీఎం జగన్ తీరును విమర్శిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రల ప్రభావం ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై కనిపిస్తున్నదని.. అందుకే సీఎంగా బాధితులకు అండగా ఉండాల్సిన జగన్.. ఇలా సర్వం కోల్పోయాక ఓదార్చి అండగా ఉంటానని హామీలు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.
అంతేకాదు, జగన్ ఈ పర్యటన విషయానికి వస్తే సోమ, మంగళవారం రెండు రోజుల పర్యటన అని సీఎంఓ పేర్కొంది. కానీ, ఇది కనీసం ఒక్క రోజు కూడా లేదు. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ పర్యటన మంగళవారం ఉదయం ముగుస్తుంది. మంగళవారం మధ్యాహ్నానికి సీఎం తిరిగి తాడేపల్లి ఇంటికి కూడా చేరుకోనున్నారు. దాదాపుగా సీఎంగా జగన్ పర్యటనలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఉదయం తాడేపల్లిలో బయలుదేరితే మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునేలా ఉంటుంది. లేదా రెండు రోజుల పర్యటన అంటే ఇలా ఒకరోజు మధ్యాహ్నం మొదలై మరుసటి రోజు ఉదయానికి ముగుస్తుంది. ఒక రాత్రి, ఒక పూట జరిగే ఈ పర్యటనను రెండు రోజుల పర్యటన అని చెప్పుకుంటారు.
కాగా, ఈ మూడు జిల్లాల పర్యటనను చూసిన బాధితులకు ముందే విషయం చెప్పి ప్రిపేర్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. బాధితులలో మన పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని వారికి ముందే సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ఓదార్పు పర్యటనలను సాగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. అందుకే అది బయటపడకుండా ఇలా తమ పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. నిజానికి జగన్ గతంలో దీక్షలు, ఓదార్పు యాత్ర, పాదయాత్రలలో కూడా ఇలాగే చేసేవారు. ప్రతిదీ ముందే ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ పెట్టుకొని ముందుకెళ్ళేవారు. ఇప్పుడు సీఎంగా కూడా ఆ పద్ధతి వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.