పాలన పడకేసింది... అరాచకం రాజ్యమేలుతోంది!
posted on Aug 8, 2023 @ 2:15PM
ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు చేయడం అనేది రాజకీయాలలో అత్యంత సహజమైన ప్రక్రియ. అయితే ప్రతిపక్షాలు చేసే ప్రతి ఆరోపణ నిజమైతే ఆ ప్రభుత్వం ఫెయిలయినట్లే లెక్క. అందులో కొన్ని సరిదిద్దుకొనే అవకాశం ఉండేవైతే ప్రభుత్వం సరిచేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక, అసలు చేయరాని తప్పులు, తీవ్ర నేరంగా పరిగణించాల్సినవి కూడా జరిగిపోతుంటే ఇక ఆ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేనట్లే. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అలాంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ అభాసుపాలైన జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు.. ఎవరికి కావాల్సినట్లు వారు పరిపాలన సాగిస్తూ అసలు చట్టాలు, అధికారాలు అనేవి ఉన్నాయన్న సోయ లేకుండా అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఈ నాలుగేళ్ళలో జగన్ సర్కార్ పై వచ్చిన ఆరోపణలు, కోర్టుల మొట్టికాయలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఏడాది వస్తున్న ఆరోపణలు మరో ఎత్తు. ఎందుకంటే ఒక్కొకటి బయటపడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత ఘోరంగా విఫలమయ్యారో స్ఫష్టంగా తేటతెల్లమౌతోంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నఆరోపణ అన్నిటికంటే తీవ్రమైనది. ముఖ్యమంత్రికే తెలియకుండా ఆయన డిజిటల్ సంతకాన్ని చోరీ చేసి ఎవరో ప్రభుత్వాన్ని నడిపించేస్తే? చంటి పిల్లాడు మార్కులు తక్కువచ్చాయని తన ప్రోగ్రెస్ కార్డు మీద తండ్రి సంతకం పెట్టేసుకున్నట్లు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకాన్ని సీఎంఓలో పనిచేసే వాళ్లే పెట్టేసుకొని ఫైళ్లను క్లియర్ చేసేసుకుంటున్నారంటే? ఔను.. ఇప్పుడు ఏపీ సీఎంఓలో ఇదే జరిగిందని ప్రభుత్వ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన డిజిటల్ సంతకాన్ని వాడేసుకుని కొందరు వాళ్లకు కావాల్సిన ఫైళ్లను క్లియర్ చేసుకున్నారని దుమారం రేగుతున్నది.
ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సౌలభ్యం కోసం తీసుకొచ్చిందే డిజిటల్ సిగ్నేచర్. అంతా ఆన్ లైన్ అయిన ఈ కాలంలో ఈ ఫైళ్ల కోసం సీఎం నుండి ఒక గ్రామ రెవెన్యూ అధికారి వరకూ అందరికీ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. సదరు అధికారి సంతకం.. ఈ డిజిటల్ సిగ్నేచర్ రెండూ ఒక్కటే. అందుకే దీని కోసం పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. ఇక సీఎం స్థాయిలో భద్రత అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని కోసం సీఎం థంబ్ ఇంప్రెషన్ తప్పకుండా ఉంటుంది. ఒకసారి సీఎం థంబ్ ఇచ్చారంటే డిజిటల్ సిగ్నేచర్ కొద్ది సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఎలా జరిగిందో.. ఏం చేశారో కానీ.. సీఎం జగన్ డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి తమకి కావాల్సిన పెండింగ్ ఫైళ్లను సీఎంఓ అధికారులు కొందరు క్లియర్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం డిజిటల్ సిగ్నేచర్ చోరీ చేసిన నిందితులు ఎవరన్నది వెల్లడించడం లేదు కానీ, సీఎంఓలో అందిరికీ ఈ వ్యవహారం, నిందితుడు కూడా తెలుసని ఉద్యోగవర్గాలలో పెద్దగా చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? నిందితులు ఎవరు అన్నది అందరికీ తెలిసినా బయటకి పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. సీఎం డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి ఆయనకు తెలియకుండా ఫైళ్లు క్లియర్ చేయడం అంటే రాష్ట్రంలో దిగజారిన పరిపాలనకు పరాకాష్టగానే చూడాలి. అందునా వాళ్ళు క్లియర్ చేసిన ఫైళ్లు ఏంటి? దేనికి సంబంధించి ఫైళ్లు క్లియర్ చేసుకున్నారు? దాని వలన రాష్ట్ర ప్రజలపై పడే ప్రభావం ఎంత అనేది చెప్పేవారు కూడా లేరు. అయితే, ఈ తంతంగం వెనక అటెండర్ ఉన్నాడని, ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే సీఎం డిజిటల్ సిగ్నేచర్ చోరీ అంశాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ లేవనెత్తగా.. త్వరలోనే జనసేన దీనిపై భారీ ఎత్తున ఆరోపణలకు దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ప్రభుత్వ పరువు గంగపాలు అయినట్లే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు మూల స్తంభం. అలాంటి సీఎం సిగ్నేచర్ చోరీ అవ్వడం అంటే ఆ మూల స్తంభం.. ఆ వ్యవస్థ కుప్పకూలినట్లే. మరి దీనికి వైసీపీ ఎలాంటి సమాధానం చెప్పుకుంటుందో , ఏచర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.