ఏపీలో పొత్తుపొడుపుల దాగుడుమూతలు!
posted on Aug 8, 2023 @ 11:38AM
ఆంధ్రప్రదేశ్ లో పొత్తుపొడుపుల దాగుడుమూతలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎటూ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తెలుగుదేశంతో పొత్తుతో రంగంలోకి దిగుతుందని అంతా భావిస్తున్నారు. జనసేనకు ఇప్పటికే మిత్రపక్షమైన బీజేపీ కూడా ఈ రెంటితో కలిసి ఎన్నికల సమరంలో పాల్గొంటుందా? అన్న విషయంలో మాత్రమే సందిగ్ధత ఉందని అంతా ఇంత కాలం భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి.
ముఖ్యంగా హస్తినలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లి వచ్చిన తరువాత రాష్ట్రంలో పొత్తుల విషయంలో ఒకింత సందేహం వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ ఇప్పటికీ జగన్ సర్కార్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతున్నప్పటికీ.. పొత్తు చర్చల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. బీజేపీ వ్యూహాత్మకంగా ఒక వైపు జగన్ సర్కార్ పై పార్టీ అగ్రనాయకత్వం నుంచి రాష్ట్ర నాయకుల వరకూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు అంటూ వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అవసరమైన సహకారం అందుతోంది. దీంతో బీజేపీ అటో ఇటో తేల్చుకోలేకపోతున్నదనీ, రాష్ట్ర రాజకీయాల గురించి ఆ పార్టీకి పెద్దగా పట్టింపు లేదనీ, జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికలలో ఏపీ నుంచి చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాల మద్దతు కోసమే ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరి వైపు నిలవాలి అన్నది తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ పార్టీ ఎటు వైపు ఉన్నా అసెంబ్లీ ఎన్నికలలో అది చూపే ప్రభావం దాదాపు శూన్యమనే అంటున్నారు.
ఇక మిగిలినది తెలుగుదేశం, జనసేన పార్టీలు. పొత్తుల విషయంలో ఆ రెండు పార్టీలూ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయంటున్నారు. తెలుగుదేశంపై ఒత్తిడి పెంచేందుకు జనసేన, జనసేనపై ఒత్తిడి పెంచాలని తెలుగుదేశం భావిస్తున్నాయన్ని పరిశీలకుల విశ్లేషణ. జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగితే జరిగేదేమిటన్నది విస్పష్టంగా తెలుసు. తనకున్న సినీ గ్లామర్ ఓటుగా మారుతుందన్న విశ్వాసం లేదని ఆయనే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు కేడర్ కు చెప్పేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను కీలక పాత్ర పోషిస్తానని కూడా విస్పష్టంగా చెప్పారు.
అయితే ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్న జనసేన అసెంబ్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తెలుగుదేశంలో పొత్తులో భాగంగా ఆ పార్టీ ప్రతిపాదిస్తున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి పొత్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ కొండకచో గత తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అదే సమయంలో మరో వైపు తెలుగుదేశం కూడా పొత్తుల విషయంలో తొందరపాటు లేకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన పోటీ చేసే సీట్ల ఎన్ని, ఏవి అన్న విషయంలో త్వరలో వెల్లడిస్తామని ప్రకటించి ఒత్తిడిని మరింత పెంచే ప్రయత్నం చేశారు.
అయితే తెలుగుదేశం నుంచి మాత్రం నాదెండ్ల ప్రకటనపై ఎటువంటి స్పందనా రాలేదు. అలాగే జనసేనాని స్వయంతో తెనాలి నుంచి నాదెండ్ల పోటీ చేస్తారని ప్రకటించడం ద్వారా కీలక సీటు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పొత్తుల మీద ప్రభావం చేపుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు తెలుగుదేశం అయితే పొత్తులు ఉంటే మంచిదే.. లేకపోయినా మంచిదో అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. పొత్తల పేరు చెప్పి పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. గత నాలుగేళ్లకు పైగా ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కేసులు, దాడులూ ఎదుర్కొంటూ పోరాడుతున్న తమ పక్షానే ప్రజలు ఉన్నారన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నది. మొత్తం మీద రానున్న రోజులలో పొత్తుల విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుందని పరిశీలకులు అంటున్నారు.