వనమాకు సుప్రీంలో ఊరట!
posted on Aug 7, 2023 @ 3:45PM
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంలో ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడాన్ని రద్దు చేస్తూ ఆయనపై ఆ ఎన్నికలలో ప్రత్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించింది. కాగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంను ఆశ్రయించారు.
సుప్రీం కోర్టు వనమా పిటిషన్ ను విచారణకు స్వీకరించి, 15 రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. 2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే వనమా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ జలగం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇటీవల వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా కాంగ్రస్ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి విజయం సాధించిన వనమా ఆ తరువాత కొద్ది రోజులకు బీఆర్ఎస్ (అప్పటికి ఇంకా తెరాసయే)లో చేరిపోయారు. దీంతో ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో చేరిపోయి పరస్పరం వ్యతిరేకించుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ కు అప్పటి నుంచీ ఒకింత ఇబ్బందికరంగానే మారింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగులందరికీ టికెట్లు.. అని ఒక సారి.. కాదు కాదు కొందరికే అని మరోసారి ఇలా తెరాస అధినాయకత్వమే అయోమయంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులిద్దరూ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.
వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువడగానే స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక విధమైన రిలీఫ్ కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వనమాకు పార్టీ టికెట్ లభిస్తే.. ఆయన విజయానికి ఆయన కుమారుడిపై ఉన్న తీవ్ర ఆరోపణలు అవరోధంగా మారతాయని కొత్తగూడెం బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పుతో వారు ఒక విధంగా రిలీఫ్ చెందారని చెప్పవచ్చు. ఇప్పుడు వనమాకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.