తిరుపతి కొండపైనా.. కొండ కిందా పెత్తనం ఎవరిదంటే?
posted on Aug 16, 2023 6:52AM
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో కీలక పదవులు, ఉన్నతాధికారులు, నామినేటెడ్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల సలహాదారులు ఇలా ఎక్కడ చూసినా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారి పేర్లే వినిపిస్తున్నాయి. పలు సందర్భాలలో ఏదైనా ఒక పదవి ఖాళీ కాగానే ఎన్నో పేర్లు వినిపించినా చివరికి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే ఆ పదవి దక్కుతుంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు కొన్ని వందలసార్లు ఆరోపణలు చేయగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ తరహా ఆరోపణలు వచ్చినా ఈ నాలుగేళ్ళలో ఇవి మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ఏ మాత్రం పట్టించుకోని జగన్ రెడ్డి సామజిక వర్గానికే పదవులలో పెద్ద పీఠ వేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణే తిరుపతి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల దేవస్థానం నుండి కొండ కింద తిరుపతి పట్టణం, తిరుపతి రూరల్ ఇలా ఎక్కడ చూసినా అంతా రెడ్డి సామాజికవర్గం వారికే పదవులు కట్టబెట్టారు.
సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్ళగా వైవీ సుబ్బారెడ్డే చైర్మన్ కాగా మరో రెండేళ్లు కరుణాకర్ రెడ్డికి అప్పగించారు. అదలా ఉండగానే తాజాగా తిరుపతి నగరాభివృద్థి సంస్థ తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుపతి గ్రామీణ నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే మోహిత్ రెడ్డి. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం రానున్న మూడేళ్ల పాటు తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు మోహిత్ ఇప్పటికే తిరుపతి గ్రామీణ మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అదనంగా తుడా చైర్మన్ పదవిని చేపట్టాడు. అంతేకాదు, చంద్రగిరికి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా కూడా ఆయనే. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా మొహిత్ రెడ్డి బరిలోకి దిగడం లాంఛనమే.
మరోవైపు ఈ మధ్యనే మరోసారి టీటీడీకి చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. దీనిని బట్టి చూస్తే.. ఇటు చెవిరెడ్డి, అటు భూమన ఈ రెండు కుటుంబాలలో పదికి పైగా పదవులు ఉన్నాయి. అంతే కాదు, తిరుమల కొండపైన చైర్మన్ తర్వాత కీలక పదవులైన.. ఈవో, జేఈవోలు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. కొండ కిందకి వస్తే తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో వారే ఉన్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులలో ఉన్న రెడ్డి సామాజికవర్గ నేతల లిస్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో సలహాదారుల నియామకంలో కూడా సీఎం జగన్ ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులన్నీ కట్టబెడుతున్నారని.. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాలలో ఎవరూ సమర్థులైన వారు సీఎం కంటికి కనిపించడం లేదా అని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ పదవుల పందేరంలో రెడ్డి సామాజికవర్గమే సీఎం జగన్ కు కనిపించడం శోచనీయం.