భక్తుల రక్షణను టీటీడీ గాలికొదిలేసిందా?.. భక్తులలో వెల్లువెత్తుతున్న అనుమానాలు
posted on Aug 14, 2023 @ 11:29AM
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక దారిలో పిల్లలకు రక్షణ కరవైంది. అది నడక దారి కాదు.. మృత్యుమార్గం అని భక్తులు ఆవేదన, భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దేవుడి కొండకు నడిచి వస్తామని మొక్కుకున్న భక్తులు ఆ మొక్కు తీర్చడానికి ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ అధికారుల సంయుక్త వైఫల్యం, నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా భక్తుల ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోయిన పరిస్థితి అలిపిరి నడకదారిలో ఏర్పడింది.
ఒక సంఘటన జరిగిన తరువాత నిద్రనుంచి మేల్కొన్నట్లుగా ఇకపై అలా జరగదని హామీ ఇచ్చి కొన్ని రోజులు భక్తుల భద్రత, రక్షణ అంటూ హడావుడి చేసి ఆ తరువాత షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే వన్య ప్రాణులు భక్తులపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల తల్లిదండ్రులతో కలిసి నడక మార్గంలో వెంకన్న దేవుడి దర్శనం కోసం వెళుతున్న కౌశిక్ అనే బాలుడు చిరుత పులి పంజాకు చిక్కి అదృష్ట వశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సంఘటన తరువాత కూడా మొద్దు నిద్ర నుంచి మేల్కొని తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ అధికారుల కారణంగా తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితఅనే బాలిక చిరుత పలి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అర్థరాత్రి సమయంలో చిరుత దాడి చేసి లక్షితను అడవిలోకి లాక్కుపోయింది. ఆ తరువాత చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, అటవీ ఆధికారుల గాలింపులో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం బయటపడింది.
చిన్నారి లక్షిత కనిపించని రోజు నుంచి.. ఆసుపత్రి నుంచి నెల్లూరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేంతవరకూ టీటీడీ అధికారులు కానీ, కొత్తగా టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ఈవో ధర్మారెడ్డి కానీ ఆ చుట్టుపక్కలకు రాలేదు. ఒక్క మాట మాట్లాడలేదు.
‘ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని’ గతంలో కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకున్న తరువాత.. కాదు కాదు.. దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించిన తరువాత కౌశిక్ తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇటువంవటి సంఘటనలను పునరావృతం కానీయబోమనీ, పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఇచ్చారు. అయితే తాజాగా చిన్నారి లక్షిత పులి దాడిలో మరణించిన ఘటనలో మాత్రం ఈవో ధర్మారెడ్డి.. అసలు ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా ముఖం చాటేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
వరుస సంఘటనలు జరుగుతున్నా.. భద్రతా చర్యల విషయంలో పట్టించుకోకపోవడంతో ముఖం చాటేశారా అని నిలదీస్తున్నారు. కాలి నడక దారిలో ఇరువైపులా ఫెన్సింగ్ వేయిస్తామని టీటీడీ ఇచ్చిన హామీ హామీలాగే మిగిలిపోయింది. లక్షిత వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నడక దారిలో వెళ్లే భక్తులకు చిరుతపులుల దాడుల ముప్పు వెంటాడుతూనే ఉంది. వెంకన్న దేవుడి దర్శనం కంటే ముందే ఎలుగుబంట్లు, చిరుతలు దర్శనమిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడకమార్గంలో నడుస్తున్నామని చెబుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లమనీ టీటీడీ చెబుతోందనీ, దాని వల్ల దాడుల భయం పోతుందా అని అనిదీస్తున్నారు. చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కట్టి ఉపయోగమేమిటని నిలదీస్తున్నారు.
అంతా అయిపోయిన తరువాత గుర్తించడానికా ఇందుకేనా అటవీ శాఖ, టీటీడీ ఉన్నదని దుమ్మెత్తి పోస్తున్నారు. వన్యప్రాణుల దాడులు జరుగుతున్నా కూడా రాత్రి వేళలో నడక దారి మూసేయాలన్న ఉద్దేశమే టీటీడీకి కలగకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. లక్షిత సంఘటన తరువాత కూడా రాత్రి వేళల్లో నడకదారి మూసివేతపై చైర్మన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. నాస్తికులను టీటీడీ పాలకమండలి చైర్మన్ గా నియమించడం, కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతుండటం, అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం సరిపోక.. ఇప్పుడు భక్తుల రక్షణను సైతం గాలికొదిలేసి.. వెంకన్న స్వామి దర్శనానికి వచ్చే వారిని రాకుండా చేయడమన్న కుట్ర ఏమైనా దీని వెనుక ఉన్నదా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వంటి సంఘటనలను తమ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు.