హిందూ ధర్మ సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ కూడదు.. ఐవైఆర్
posted on Aug 14, 2023 @ 10:49AM
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం పూర్తయినా ఇంకా ఆ నియమకంపై వివాదాలుకు ఫుల్ స్టాప్ పడలేదు. నాస్తికుడికి తిరుమల తిరుపతి దేవస్థాం చైర్మన్ పదవి కట్టబెట్టడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అంటే వైఎస్ హయాంలో ఆయనను టీటీడీ దేవస్థానం చైర్మన్ గా నియమించిన సమయంలో కూడా ఇదే విధంగా విమర్శలు ఎదురయ్యాయి. అప్పటిలో ఆయన తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే వైఎస్ ఆదేశం వల్లనే ఆయన ప్రచారం విషయంలో ఉద్దేశపూర్వకంగా పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడమే కాకుండా.. అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్పటి ఎన్నికలు ఓటమిని ఆహ్వానించారని, ఆ కారణంగానే వైఎస్ ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమించారనీ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు వైఎస్ హయాంలో వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా పని చేశారు. రెండో సారి కాలపరిమితి ముగిసిన తరువాత ఆయన స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తారని గట్టిగా ప్రచారం జరిగినా.. చివరి నిముషంలో జగన్ భూమననే టీటీడీ చైర్మన్ గా నియమించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా వెంకన్న దేవుడిని నల్లరాయిగా అభివర్ణించిన వ్యక్తికి టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ఎలా నియమింస్తారంటూ సామాన్య భక్త జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే అవన్నీ పక్కన పెడితే టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ పోస్టింగ్ గా మారడం దురదృష్టకరమంటూ టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ లో చేసిన ఒక పోస్టులో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా హిందూ ధర్మం పట్ల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలనీ, అయితే జగన్ సర్కార్ అందుకు భిన్నంగా రాజకీయ అవసరాల కోసం భూమన నియామకం చేపట్టిందని అభిప్రాయపడ్డారు. తన పోస్టుకు ఆయన భూమనను నియమిస్తున్నట్లుగా వచ్చని వార్తల క్లిప్పింగులను జోడించారు. హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరన్నట్లుగా అ ప్రభుత్వ తీరు ఉందని పేర్కొన్నారు. హిందూ ధర్మ సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీని ఎంత త్వరగా తప్పిస్తే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.