జగన్ కొత్త నినాదం మూడు రాజధానులు మూడు ప్రాంతాల హక్కు!
posted on Aug 16, 2023 6:18AM
దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నాం. సింపుల్ గా సూటిగా చెప్పాలంటే ఇదీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019 లో చేసిన ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ముందు బయటపెట్టగా.. ఆ తర్వాత మిగతా వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. అయితే ప్రభుత్వం ఇది ప్రకటించి నాలుగేళ్లు కాబోతుంది. మరి మూడు రాజధానులు ఎక్కడ అంటే చేస్తాం.. చూస్తాం అంటున్నారు. అసలు ఇంతకీ ఇది సాధ్యమేనా అని అడిగితే తప్పకుండా చేస్తాం.. మా నాయకుడిపై మాకు నమ్మకం ఉందని వైసీపీ నేతలు చెప్తారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. మరి నాలుగేళ్ళలో చేయలేనిది.. ఈ 8,9 నెలలలో చేస్తారా?. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికే లేదు. ఎందుకంటే ఈ విషయం ప్రస్తుతం కోర్టు ఉంది. సో మూడు రాజధానులు అంటూ మాట్లాడేందుకు అవకాశమే లేదు.
ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చేత చాలాసార్లు మొట్టికాయలు తిన్నది. అక్షింతలు వేయించుకున్నది. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం.. సీఆర్డీయే చట్టం ప్రకారం హైకోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం తీర్పు వచ్చే వరకూ మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మాట్లాడినా.. మూడు రాజధానుల ఏర్పాటుకు సాహసించినా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అయితే, ఇందులో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తున్నది. అమరావతిలో పేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టించాలని చూడడం కూడా అలాంటిదే. అందులో మరోసారి హైకోర్టు కలుగజేసుకొని చివాట్లు పెట్టడంతో దానికి కూడా బ్రేక్ పడింది. మరోవైపు విశాఖ రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నది. ఈ విషయాన్ని బయటకి చెప్తే కోర్టు సమస్యలొస్తాయని దొంగతనంగా నిర్మాణాలు చేపడుతున్నది.
ఇక, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడకూడదని తెలిసే ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంతకు ముందు సీఎం ఎక్కడ అడుగుపెట్టినా ఈ రాజధానుల అంశంపై ఏదో ఒక ప్రకటన చేయడం.. ప్రజలలో అది చర్చకు రావడం జరిగేది. కానీ, ఈ మధ్య అది తగ్గింది. అయితే, ఉన్నట్లుండి ఇప్పుడు మరోసారి రాజధానుల అంశంలో సీఎం జగన్ మరో కొత్త నినాదం అందుకున్నారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుగుతుండగా జగన్ మరోసారి మూడు రాజధానుల కుంపటిని రగిలించారు. విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం మరోసారి మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు.
యధావిధిగా ప్రతి సభలో జగన్ మాట్లాడినట్లే ఇక్కడ కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తడబడుతూనే చదివి వినిపించారు. ఇందులో ఆనాడు భారతంలో సైంధవుడు ఉండేవాడట. అయినా జరగాల్సిన న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధవులు ఉన్నారు. మూడు ప్రాంతాలకు మంచి జరగకూడదనివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయమే గెలుస్తుంది. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సైంధవులు అని జగన్ ఎవరిని అన్నారో చెప్పాల్సింది. ఎందుకంటే ఇక్కడ జగన్ మూడు రాజధానులను అడ్డుకుంటుంది చట్టం, అమరావతికి కోట్ల విలువ చేసే భూములను రూపాయి తీసుకోకుండా ఇచ్చిన ఆ ప్రాంత రైతులు. మరి జగన్ వారినే సైంధవులు అన్నారా?
నిజానికి ముందు నుండి మూడు రాజధానులకు బ్రేక్ పడుతున్నది గత ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం.. సీఆర్డీఏ చట్టం వలనే. ఈ చట్టాన్ని కాదని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే ఏపీ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను అమరావతి రైతులకు చెల్లించాలి. అయితే, జగన్ అలా కాకుండా అమరావతి రైతులను మోసం చేస్తూ రాజధానిని తరలించాలని చూస్తున్నారు. అందుకే కోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. కానీ, ప్రజలకు మాత్రం ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే చేస్తున్న సీఎం.. ఇప్పుడు ఇలా మూడు రాజధానులు మూడు ప్రాంతాల హక్కు అంటూ కొత్త నినాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.