తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా రెడీ?
posted on Aug 16, 2023 6:58AM
చూస్తూ ఉండగానే ఈ ఏడాది కాలంలో రెండు భాగాలు పూర్తయి మరో భాగమే మిగిలి ఉంది. ఆగస్టు కూడా పూర్తవుతుండగా.. ఇక ఏడాదిలో మిగిలింది మరో నాలుగు నెలలే. ఈ నాలుగు నెలలు దాటితే ఏ క్షణమైనా ఏపీలో ఎన్నికల నగారా మోగడం ఖాయం. ఏడాది మారిందంటే ఎన్నికల కౌండ్ డౌన్ మొదలైనట్లే భావించాలి. అందుకే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. ఇప్పటికే వచ్చిన రెండు విడతల ఫలితాల ఆధారంగా కొందరికి క్లాసులు కూడా పీకిన జగన్.. త్వరలో రాబోతున్న తుది ఫలితాల ఆధారంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం దూకుడుగా కనిపిస్తున్నది.
ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా లభిస్తున్న ప్రజాదరణ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు జనం పెద్ద సంఖ్యలో హాజరౌతుండటం, వారి ప్రసంగాలకు విశేష స్పందన లభిస్తుండటం తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు, విజయం సాధించే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది. తాజాగా తొలి విడత సర్వే నివేదికలు చంద్రబాబు చేతికి అందాయి. ఆ సర్వే ఫలితాల ఆధారంగా మొదటి విడత జాబితా సిద్ధం అవుతున్నది.
ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వారి పని తీరుపై సర్వేల ఫలితాల ఆధారంగా ఈ జాబితా ఉంటుందంటున్నారు. ఇక సిట్టింగులలో కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న నేతలకు క్లాస్ పీకనున్న చంద్రబాబు, రెండో జాబితా సమయానికి కూడా మార్పు లేకపోతే టికెట్లు కష్టమేనని వారికి తెగేసి చెప్పనున్నారని అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొత్తం 50 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. అది కూడా దసరా నాటికే ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ముందుగా తొలి జాబితా ప్రకటించి వైసీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తున్నది.
అయితే, టీడీపీ అభ్యర్థుల జాబితా అనగానే ముందుగా గుర్తొచ్చేది పొత్తుల పరిస్థితి ఏంటి అన్నదే. అన్నీ కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే, రెండు వైపుల నుండి పొత్తుల వ్యవహారంపై సస్పెన్సే కొనసాగుతోంది. అయితే ఎన్నికల సమయానికి పొత్తులు పొడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు పొత్తులు ఖరారు కాకుండానే తాను తప్పక పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తు అంటే కొన్ని స్థానాలను తెలుగుదేశం వదులుకోవాలి. ఇప్పటికే జనసేన కొన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా.. మరికొన్నింటికిపై ఖర్చీఫ్ వేసి ఉంది. ఈ క్రమంలో ఇవి కాకుండా సేఫ్ సైడ్ ఉన్న స్థానాలను ప్రకటించి.. ఇటు వైసీపీ, అటు జనసేనలపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని కూడా తెలుగుదేశం పరిశీలిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తొలి జాబితాలో ఉండే పేర్లేవి, పొత్తుల పరిస్థితి ఏమిటి? అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. చూడాలి మరి తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన తరువాతైనా పొత్తులపై క్లారిటీ వస్తుందేమో.