రుషికొండపై సెక్రటేరియట్ అంటూ ట్వీట్..అంతలోనే యూ టర్న్!
posted on Aug 14, 2023 @ 9:45AM
పులివెందుల పులి మా జగనన్న.. మాట తప్పడు.. మడమ తిప్పడు.. వెన్ను చూపని ధీరుడు అంటూ వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు తెగ ప్రచారం చేస్తుంటారు. అయితే, అది మాటల్లోనే కానీ చేతల్లో కాదని ఎప్పటి కప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపుతూ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో శాసన మండలి రద్దు నుంచి మొదలు పెడితే.. సీపీఎస్ వంటి ఎన్నో అంశాలలో యూటర్న్ తీసుకున్న జగన్.. ఇప్పుడు తానేం చేస్తున్నారో కూడా చెప్పుకోలేని స్థితిలో దొంగచాటుగా వ్యవహారం నడిపే స్థాయికి చేరారు. ఇదంతా విశాఖలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల గురించే. గత నాలుగేళ్ళలో విశాఖ నగరంలో వైసీపీ నేతల భూకబ్జాలు తారస్థాయికి చేరాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే కొండలు పిండి చేసి సొమ్ము చేసుకున్నారని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం రుషికొండనే.
అంతకు ముందు ఆకుపచ్చగా ఆకాశం నుండి చూసినా ఆకర్షించేలా ఉండే రుషికొండ ఇప్పుడు సగం తవ్వేసిన సమాధిలా కనిపిస్తుంది. దీన్ని కప్పి పుచ్చేందుకు వైసీపీ సర్కార్ కొండకి గ్రీన్ మ్యాట్ కూడా వేసింది. అయితే, ఇప్పుడు అదే రుషికొండని పూర్తిగా నాశనం చేసేలా అక్కడ రహస్యంగా నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాలు ఏంటన్న దానిపై గత కొన్ని రోజులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రుషికొండను చదును చేసి వైసీపీ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మిస్తుందని, కాదు కాదు సీఎం నివాసమే రుషికొండ మీద నిర్మిస్తున్నారని రాజకీయ వర్గాలలో తీవ్రంగా చర్చ సాగుతున్నది. అసలు రుషికొండ మీద నిర్మించే నిర్మాణాలు ఏంటో చెప్పాలని తులుగుదేశం, జనసేన నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరో అడుగు ముందుకేసి బారికేడ్లు దూకి మరీ అక్కడే జరిగే నిర్మాణాలను బయటపెట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ నేతలు అసలు విషయాన్ని బయటపెట్టారు.
ముందుగా ఈ విషయంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. రిషికొండపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. రిషికొండ నిర్మాణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మరో మంత్రి రోజా కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. మిగతా మరికొందరు వైసీపీ నేతలు కూడా రుషికొండపై నిర్మాణాలు నిజమేనని.. వాటిని ప్రభుత్వమే నిర్మిస్తున్నదని కూడా ఒప్పేసుకున్నారు. అయినా ప్రతిపక్షాలు ఈ నిర్మాణాలపై ఆరోపణలు ఆపలేదు. అసలు సీఎం జగన్ కు ఎన్ని నివాసాలు కావాలని.. కొండను తవ్వి మరో జగన్ మరో ఇల్లు కట్టుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో రుషికొండ పై జరిగే నిర్మాణాలు ఏపీ సెక్రటేరియట్ కి సంబంధించినవే అంటూ వైసీపీ అధికారికంగా ట్వీట్ చేసింది.
అక్కడ సెక్రటేరియట్ నిర్మిస్తుంటే దానిపై తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని, ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని రావడం ఆ పార్టీకి ఇష్టం లేదని వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో వెంటనే దాన్ని డిలీట్ చేసింది. మరో ట్వీట్ చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్ లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరని పేర్కొంది. వైసీపీ చేసిన ట్వీట్ డిలీట్ చేయడంతో టీడీపీ విమర్శలు చేసింది. ‘ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావ్ బుజ్జి కన్నా’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేసింది. దీనికి వైసీపీ సమాధానమిస్తూ.. ‘మానవ తప్పిదాలు సహజంగా జరుగుతూంటాయి. ఇదీ అలానే జరిగింది. దీనిపై ప్రజలకు వివరణ ఇచ్చాం. మీలా మేం ప్రజలను మభ్యపెట్టమమని రీట్వీట్ చేసింది.
నిజానికి రుషికొండపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరుగుతున్నట్టు రాష్ట్రప్రభుత్వం గతంలో హైకోర్టుకి తెలిపింది. అయితే అది నిజం కాదు సెక్రటేరియట్ అని ఇప్పుడు వైసీపీ చెప్పింది. అంటే హైకోర్టుకి వైసీపీ ప్రభుత్వం అబద్ధం చెప్పిందా, కోర్టుని తప్పుదోవ పట్టించిందా అంటూ మీడియా రచ్చ చేసింది. ఈ రచ్చతో వైపీసీ ట్వీట్ డిలీట్ చేసింది. పైగా ప్రశ్నించిన టీడీపీని మీలా మభ్యపెట్టమంటూ ఇంకా ఈ విషయంలో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. దీంతో సోషల్ మీడియా సీఎం జగన్ ను ఏకిపారేస్తున్నది. కనీసం చేసేది చెప్పుకోలేని పిరికిపంద ప్రభుత్వం ఇదంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిజాయతీగా అక్కడ జరుగుతున్నది ఏంటో చెప్పుకోలేక ఇలా ప్రజలతో పాటు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తుండడంతో జగన్ సర్కార్ ఇప్పుడు ఈ అంశంలో మరోసారి బొక్కా బోర్లా పడ్డట్లైంది.