షర్మిల కోర్టులోకే బంతి.. కాంగ్రెస్ పెట్టిన మెలిక ఇదేనా?
posted on Aug 14, 2023 @ 10:11AM
వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం ఏంటి? తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? షర్మిల తెలంగాణ నుండే రాజకీయాలలో ఉంటారా లేక ఆంధ్రాకి వెళ్ళిపోతారా? కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తే షర్మిల రాజ్యసభకి వెళ్తారా? లేక అసెంబ్లీకి పోటీ చేస్తారా? అసెంబ్లీకి పోటీ అయితే.. షర్మిల తెలంగాణ నుండి పోటీ చేస్తారా? లేక ఏపీ నుండి బరిలో దిగుతారా? ఏపీ పీసీసీ పగ్గాలు కాంగ్రెస్ షర్మిలకు అప్పగిస్తుందా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి చేపట్టేందుకు షర్మిల ఒకే చెప్తారా? అన్న వైఎస్ జగన్ మీద షర్మిల పొలిటికల్ వార్ ప్రకటిస్తారా? ఇదే ఈ మధ్య కాలం వరకూ తెలుగు రాష్ట్రాలలో షర్మిల చుట్టూ నడిచిన రాజకీయ చర్చ. షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య తీవ్ర ప్రచారం జరిగింది.
అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది ప్రచారంగానే ఉండిపోయింది. జులైలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడే వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. కానీ, షర్మిల బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో భేటీ కావడం, తాజాగా ఢిల్లీ వెళ్లడం నిజమే. అంటే ఈ విలీనం లేదా పొత్తు ప్రతిపాదన మాత్రం జరుగుతున్నదని స్పష్టంగా తేలిపోతుంది. అయితే, ఎన్నో ఆశలతో చర్చలు జరిపి, మంతనాలు చేసి.. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలనుకున్న షర్మిలకు హస్తం పార్టీ చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.
నిజానికి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి తెలంగాణలోని పాలేరు నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. అయితే తెలంగాణలో ఆమె పార్టీలో ఉండడాన్ని ఇక్కడి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ఆర్ తనయ షర్మిల పార్టీలోకి వస్తే తెలంగాణలో అది కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ అవుతుందని ఇక్కడి నాయకులు భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చెప్పేసినట్లు తెలుస్తుంది. దీంతో ఆమెను ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఏపీకి వెళ్తే ఆమెను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు ఆమె రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, లేదంటే ఏపీలో ఎక్కడ నుండి అసెంబ్లీకి పోటీ చేసినా పూర్తి బాధ్యత అధిష్టానమే తీసుకుంటుందని హామీ ఇచ్చారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అటు కర్ణాటక, ఇటు ఢిల్లీలో జరిగిన సమావేశాలలో ఈ విషయమే తేలడంతో ఇప్పుడు బంతి షర్మిల కోర్టుకి చేరింది.
ఆమె ఎంతగా తెలంగాణ కోడలినని చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు మాత్రం షర్మిలను అంగీకరించరని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. ఆమెని ఆంధ్రా బిడ్డగానే తెలంగాణ వాసులు చూస్తారంటున్నారు. ఆమె తండ్రి, దివంగత ముఖ్యమంత్రి పక్కా తెలంగాణ వ్యతిరేక వాదిగా ముద్రపడడమే అందుకు కారణం. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు కూడా అదే విషయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా చెబుతూ షర్మిల కాంగ్రెస్ లో చేరి తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఆమె ఏపీకి వెళ్లడమే ఉత్తమమని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా భావిస్తున్నది. అయితే ఏపీకి వెళ్తే తన అన్న జగన్మోహన్ రెడ్డిపై పోటీకి దిగాల్సి ఉంటుంది. దాని వల్ల వైసీపీకి నష్టం చేకూరుతుంది దీంతో షర్మిల ఇందుకు ఇష్టపడటం లేదని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు అన్నచెళ్లుల్ల మధ్య తత్సంబంధాలు లేకపోయినా కూడా షర్మిల ఏపీకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అయితే, ఇప్పుడు ఏం తేల్చుకోవాలన్నది షర్మిలకే వదిలేసిన కాంగ్రెస్ బంతిని షర్మిల కోర్టులోకి విసిరింది. ఇక ఏం చేయాలన్నది ఆమె ఇష్టం.. ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోయేది కూడా ఈ నిర్ణయమే!