అంబటి బ్రో.. వ్యూహం కనిపించడం లేదా?
posted on Aug 16, 2023 9:29AM
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన గతం వైభవమే కానీ ఇప్పుడు ఆయన సినిమాల కంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ రేటుకు అమ్ముడుపోతున్నాయి. అప్పుడప్పుడు పోర్న్ స్టార్స్ ను తీసుకోచ్చి బూతు బొమ్మలు తీసినా ఆయన మొహం చూసేందుకు కూడా ప్రేక్షకులు ఇష్టపడం లేదు. అయితే ఆయన ఒకప్పటి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు మీడియా చానెళ్లు తరచూ ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంటాయి. ఆ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే చొప్పదండు కబుర్లు వ్యూస్ ను తెచ్చిపెడుతుంటాయంతే. అంతకు మించి సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉనికి కానీ ప్రమేయం కానీ అంతంత మాత్రమే.
అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయనకి ఓ సినీ బేరం తగిలింది. అదే ‘వ్యూహం’. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీ కోసం రెండు సినిమాలు చేసి పెట్టిన వర్మ ఈసారి కూడా అదే ప్రణాళికలో ‘వ్యూహం’ అనే సినిమా తీసిపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ఇప్పుడు ఇదే ‘వ్యూహం’ నుండి రెండో టీజర్ కూడా విడుదల అయ్యింది. ఇందులో కూడా అంతే. జగన్ కు అనుకూలంగానే ఈ టీజర్ కూడా కట్ చేశారు. మొదటి టీజర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం నుండి మొదలు పెడితే.. రెండో టీజర్ లో ప్రజారాజ్యం విలీనం, రాష్ట్ర విభజన అంశాలను చూపించారు.
ఇందులో కూడా చంద్రబాబు పాత్రను నెగటివ్ గానే చూపించగా.. సోనియా గాంధీ పాత్రను, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా చూపించారు. రాష్ట్రాన్ని సోనియా గాంధీ చపాతీని రెండు ముక్కలు చేసినట్లు విడదీసినట్లు చూపించగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరి పాత్రలను చూపించారు. ఈ టీజర్ లో సోనియా గాంధీ, రోశయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ బ్లేమ్ చేసి.. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉత్తముడు అన్నట్లు చూపించనున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్ కి పొలిటికల్ మైలేజ్ కోసమే, మిగతా అందరినీ తప్పుడు వ్యక్తులుగా చూపించేందుకు ‘వ్యూహం’ తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించడానికి ముందే వర్మ తాడేపల్లి వెళ్లి మరీ సీఎం జగన్ ను కలవగా.. ఈ సినిమా షూటింగ్ కోసమే ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొన్నీమధ్య ఒక రోజు విజయవాడ బ్యారేజీపై ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని గంటలపాటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఏది ఏమైతేనేం సినిమా అయితే జగన్ కోసమే తెరకెక్కిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసిందే. ఇక, ఈ సినిమా విడుదల అవుతుందా? విడుదలైతే ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.
ఇక పోతే ఈ రెండో టీజర్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తున్నది. వర్మ ఈ స్థాయికి దిగజారి అమ్ముడుపోతాడని ఊహించలేదని ఆయన అభిమానులే కామెంట్లు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలైతే చెప్పాల్సిన పనిలేదు. పే టీమ్ కూలీలూ.. వర్మ రెండూ ఒక్కటేనని విమర్శలతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో లో మంత్రి అంబటి రాంబాబును పేరడీ చేశారని తెగ గగ్గోలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ అంశాన్ని అంబటి వదలడం లేదు. ప్రజా సమస్యలను కూడా గాలికి వదిలేసిన అంబటి బ్రో సినిమాపై గంటలు తరబడి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడో ఆయన సంక్రాంతి సంబరాల్లో చేసిన డాన్స్ మాదిరి సినిమాలో పృథ్వీ వేసాడని గగ్గోలు పెడుతున్న అంబటికి ఇప్పుడు వ్యూహం సినిమా టీజర్లు కనబడడం లేదా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. నీదో కాదో తెలియని డాన్సుకు అన్ని రోజులు మాట్లాడిన అంబటికి ఇంత నీచంగా పాత్రలు, కల్పిత కథతో కించపరిచే విధంగా తెరకెక్కిన సినిమాలు కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఉన్నా మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు మీడియాను పిలిచి వ్యూహం టీజర్ పై మాట్లాడాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.