పిండైపోతున్న రుషికొండ.. ముప్పు ముంగిట విశాఖ?
posted on Aug 15, 2023 7:35AM
అందమైన బీచ్.. సముద్ర అలల చప్పుడుకు తోడు నీటిపై నుండి వీచే చల్లని గాలి. బీచ్ ను ఆనుకొనే ఆకుపచ్చని రంగులో ఆహ్లాదాన్ని విరజిమ్మే రుషికొండ. అటు రుషికొండ.. ఇటు బీచ్ కలిసి ప్రకృతి ప్రేమికులను, కాస్త సేదదీరాలని ఆరాటపడే విశాఖ నగర వాసులను రా రమ్మని పిలుస్తుంటాయి. పర్యాటకుల తాకిడికి తగ్గట్లే ఇక్కడ రెస్టారెంట్లు, రిసార్టులు వెలిశాయి. ఇంకాస్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే విశాఖ నగరానికి మరింత ఆదాయం తెచ్చి పెట్టే బంగారు అవుతుంది. అయితే, అభివృద్ధి ఏమో కానీ ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు ఏపీ సీఎం జగన్. నాలుగేళ్ల వైసీపీ హయాంలో రుషికొండను పిండి చేశారు. ఇప్పటికే సగం బోడి గుండు చేసిన ఈ కొండను ఇప్పుడు నిర్మాణాల పేరుతో పూర్తిగా తవ్వేస్తున్నారు.
రుషికొండ అంటే రాతితో కూడిన ఎర్రమట్టి దిబ్బ. గత నాలుగేళ్లలో ఈ కొండను అక్రమార్కులు తవ్వేశారు. భారీ పరదాలు కట్టి లోలోపల ఈ మట్టి తవ్వకాలు జరిపించేశారు. సగం కొండ కరిగిపోయే వరకూ ఈ అంశం వెలుగులోకి రాకుండా మేనేజ్ చేశారు. అంతకు ముందు పచ్చగా కనిపించే కొండ సగం ఎర్రగా మారిపోవడంతో ఈ మట్టి తవ్వకాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. ఇక, అంతకు ముందు ఈ కొండలపై చెట్లు చేమలు ఉండడంతో ఎంతటి వర్షాలు పడినా ఈ ఎర్రమట్టి కరిగేది కాదు. కానీ, అక్రమ తవ్వకాలతో ఇప్పుడు వర్షాలకు మట్టి కరిగి కారిపోతున్నది. వర్షం పడితే చాలు కొండపై నుండి ఎర్రమట్టి వర్షపు నీటితో కలిసి బీచ్ రోడ్డుపై పేరుకుపోతున్నది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ కొండపై నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర సచివాలయమే ఇక్కడ కడుతున్నారని వైసీపీ అధికారికంగా ప్రకటించి మళ్ళీ తూచ్ ఇక్కడ కట్టేది పర్యాటక భవనాలు అంటూ కవర్ చేసుకుంది.
అనధికారికంగా అయినా విశాఖ నుండి పాలన సాగించాలని ఆరాటపడుతున్న సీఎం జగన్ కోసమే రుషికొండను తవ్వేసి భవనాలు కడుతున్నారని అందరికీ స్పష్టంగా అర్ధమౌతోంది. వైసీపీ ప్రభుత్వం చెప్పుకోలేకపోయినా రుషికొండ ఇప్పుడు వైసీపీ నేతల కొండగా మారిపోయింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇక రుషికొండ కాలగర్భంలో కలిసిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. మరి అదే జరిగితే విశాఖ నగరాన్ని కాపాడేదెవరు అన్నదే ఇప్పుడు పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికుల ప్రశ్న. ఇప్పటి వరకూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఈ రుషికొండనే వైజాగ్ నగరాన్ని కాపాడుతూ వచ్చింది. గతంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో రుషికొండ లేకపోతే వైజాగ్ నగరాన్ని మర్చిపోవాల్సి వచ్చేదని అప్పట్లో పర్యావరణ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెప్పారు. సముద్ర ఆక్రోశం నగరాన్ని తాకకుండా రుషికొండ అడ్డుగా నిలిచింది. అప్పటికే ఆ తుఫాన్ సమయంలో పెను గాలులకు విశాఖ చిగురుటాకులా వణికింది. అదే రుషికొండ లేకపోతే ఏం జరిగేదో ఊహిస్తేనే వణుకు పుడుతుంది.
సముద్రంలో ఏర్పడే ఉపద్రవాల నుండి విశాఖ నగరాన్ని కాపాడేందుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందే రుషికొండ. అందుకే ఈ ప్రాంతాన్ని తీర ప్రాంత నిబంధనలు సీఆర్‌జెడ్ ప్రాంత పరిధిలోకి తీసుకొచ్చారు. తీరాన్ని కాపడటానికి, భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే ప్రమాదాల్ని కాపాడుకోవడానికి రుషికొండ లాంటి ప్రకృతి సిద్ధ నిర్మాణాలు ఉండాలని, వాటికి ఇబ్బంది కలగకూడదనే సీఆర్‌జెడ్ నిబంధనలు తెచ్చారు. కానీ, నిబంధనలను తుంగలోతొక్కి ఇప్పుడు మొత్తం నాశనం చేశారు. దీంతో భవిష్యత్తులో విశాఖ నగరాన్ని కాపాడే వారెవరన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వ్యక్తి పంతం భవిష్యత్తులో ఎందరిని బలి తీసుకుంటుందోనని విశాఖ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తన పంతమే నెగ్గాలనుకున్నా నగరంలో ఇన్ని అవకాశాలు ఉండగా వారి చూపు రుషికొండపై పడడం విశాఖ వాసుల దౌర్భాగ్యంగా భావించాలి. తాను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆశపడుతున్న సీఎం జగన్.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొండపై కొలువుదీరాలనుకోవడం ఏ విధంగా చూసినా సమంజసం కాదని అంటున్నారు.