తెలుగుదేశంలోకి బొత్స కుటుంబం?.. వైసీపీకి భారీ షాక్
posted on Aug 14, 2023 @ 9:33AM
ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో.. ఎవరు ఎప్పుడు గోడ దూకేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే కాస్త ముందో వెనకో ఊహాగానాలు మాత్రం బయటపడతాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీపై అసంతృప్తి ఎక్కువగా ఉంటే ఈ వలసలు భారీ స్థాయిలో ఉంటాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీది కూడా అదే పరిస్థితి. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగా ఇప్పటి నుండే వైసీపీ నుండి మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటున్నారు.
సమయం సందర్భం చూసుకొని ఒక్కొక్కరు తెలుగుదేశం దారి పడుతున్నారు. అటు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు.. ఉత్తర కోస్తా నుండి దక్షణ కోస్తా వరకూ అన్ని జిల్లాలో ఈ వలసల పరంపర మొదలయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. వైసీపీ నుండి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు మొత్తం 40 నుండి 50 మంది పక్క చూపులు చూస్తున్నారని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యేలు నలుగురూ ఇప్పటికే టీడీపీ గూటికి చేరుతారన్నది ఖరారైపోగా, మరో ఆరుగురు వైసీపీ నేతలు ఈ నెలలోనే గోడ దూకేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఏదో సీదా ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గాలను దాటి రాష్ట్ర ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఎమ్మెల్యేలే కాకుండా, రాష్ట్రస్థాయి నేతలు, మాజీ మంత్రులు, సీనియర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వినిపిస్తున్నది. ఉత్తరాంధ్ర నుండి చూస్తే ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో ఎక్కడా బయటకి రావడం లేదు. అవంతికి సన్నిహితుడైన పంచకర్ల రమేష్ విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అన్న ఆసక్తి మొదలైంది. రమేష్ ఒక్కరే కాదు అవంతి కూడా పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
విశాఖకు పరిపాలన రాజధాని తీసుకొస్తామని మూడేళ్లుగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తీవ్ర ప్రచారం చేశారు. రాజధాని సంగతేమో కానీ.. విశాఖలో రౌడీయిజం పెరిగి శాంతి భద్రతలు దెబ్బతిన్నట్లు అక్కడి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఈసారి వైసీపీకి ఎదురుగాలి తప్పదని ప్రచారం జరుగుతున్నది. అందుకే ఇక్కడి నేతలు ప్రజల మూడ్ ని బట్టి వైసీపీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాగా ఉత్తరాంధ్రలో వైసీపీ అతి పెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం. బొత్స సొంత కుటుంబంతో పాటు ఆయన సామాజిక వర్గం తూర్పు కాపు నేతలకు ఇక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేతలలో చాలా మంది బొత్స కుటుంబానికి బంధువులు, సన్నిహితులు. అందుకే బొత్స కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేసినా మళ్ళీ తనని వైసీపీలో చేర్చుకొని సముచిత స్థానం కల్పించారు. అయితే ఇప్పుడు ఈ బొత్స అండ్ కో తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ సహా వైసీపీకి చెందిన యాభై మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఒక బాంబు పేల్చారు. దీంతో సహజంగానే బోండా వ్యాఖ్యలలో వాస్తవాలు ఎంత అని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బొత్స ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నారు. మరో బంధువు, బడికొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్ల నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే, అదే నెల్లిమర్లలో బొత్స తమ్ముడు లక్ష్మణరావు కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఎస్ కోటలో ఉన్న బొత్స సన్నిహిత బంధువు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీగా ఉన్న బొత్స మరో బంధువు బెల్లాన చంద్రశేఖర్ ఇలా బొత్సకు బంధువులే అరడజను మంది ఉండగా తన సన్నిహితుల జాబితా కూడా మరో అరడజను ఉంది. బెల్లాన చంద్రశేఖర్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆరాటపడుతుండగా వైసీపీ నుండి ఇంకా హామీ దొరకలేదు. బడికొండ అప్పలనాయుడు, బొత్స తమ్ముడు లక్ష్మణరావులలో ఒకరికే వైసీపీ నుండి టికెట్ దక్కుతుందని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిందంటున్నారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు టీడీపీతో టచ్ లో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇక మజ్జీ శ్రీనుకు టికెట్ ఇస్తారా? ఎస్ కోట శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్నది కూడా అనుమానమే. ఇవన్నీ లెక్కలేసుకొనే టీడీపీ నేతలు బొత్స కుటుంబాన్ని ఆకర్షించే పని పెట్టుకున్నారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగి వీరంతా టీడీపీలోకి మారితే ఇటు బొత్సకు, అటు వైసీపీకి భారీ నష్టం తప్పదు.