వాడుకొని వదిలేశారా?

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఇది అతికే పొత్తు కాదని రాజకీయ వర్గాలలో అప్పుడే చర్చ జరిగింది.  అయినా అప్పటికప్పుడు బీజేపీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు పడుతున్నట్లే కనిపించారు. ప్రచారంలో ఆయన పాల్గొన్న సభలలో ఆయన కదలిక ఒకింత ఇబ్బందికరంగానే కనిపించింది కూడా. సరే ఇక ఫలితాల విషయానికి వస్తే బీజేపీ కేవలం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా జనసేన అయితే అసలు ఖాతా కూడా తెరవలేదు. దీంతో ఈ పొత్తు వలన బీజేపీ, జనసేనలలో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్నదానిపై రకరకాల విశ్లేషణలు సాగాయి. నిజానికి బీజేపీ మొదట ఒంటరిగానే బరిలోకి దిగేందుకు ఆలోచన చేసింది. ఈ మేరకు ప్రకటనలు కూడా చేసింది. తీరా ఎన్నికల సమయానికి పార్టీ బలహీనంగా ఉందన్న విషయం తెలిసి వచ్చి కనీసం మూడవ ప్రత్యామ్నాయంగా అయినా కనిపించాలంటే జనసేన కూడా కలవాలని భావించింది. అందుకే జనసేనానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ పార్టీని పొత్తుకు ఒప్పించింది.  అయితే, తెలంగాణలో బలంగా వీచిన కాంగ్రెస్ గాలిలో రెండు పార్టీలు కొట్టుకుపోయాయి . అయితే, జనసేన కారణంగానే తమకు సీట్లు తగ్గాయని తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం నేతలు విమర్శలు ఆరంభించారు. జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వలనే బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైందని తెలంగాణ బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని భావించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన కూడా చేసేశారు. మ‌రో ప‌ది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని.. అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని, అలాగే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నాయ‌కులు ఒంట‌రిగానే సిద్ధం కావాలని కిషన్‌ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  దీన్ని బట్టి చూస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉండేందుకు, ఆయనను దూరంగా ఉంచేందుకు సిద్ధపడినట్లు అర్ధమవుతున్నది. .  అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మన అవసరం ఉందని మనతో బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకుందని, బీజేపీ నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీలో పార్టీ శ్రేణులకు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు బీజేపీ పవన్ కల్యాణ్ అవసరం లేదని భావిస్తున్నట్లే అర్ధం చేసుకోవాలి. మొత్తంగా తెలంగాణలో బీజేపీ, జనసేన బంధం ఎన్నికల నాలుగు రోజులకే కలిసి.. ఎన్నికల ఫలితాలొచ్చాక నాలుగు రోజులకే తెగిపోయింది. అయితే బీజేపీ తనకు తానే జనసేనను కలుపుకోవడం, ఇప్పుడు తనకు తానే రాంరాం చెప్పేయడం చూస్తే అప్పటికప్పుడు అవసరానికి వాడుకొని వదిలించుకున్నట్లే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనతో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రయోజనం పొందిందా లేదా అన్న విశ్లేషణలను పక్కన పెడితే..  ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు లేకుండానే పొత్తు బంధాన్ని బీజేపీ తెంచేసుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చర్చకు దారితీస్తున్నది.  తెలంగాణలో పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నెరవేర్చాలకున్న లక్ష్యం నెరవేరలేదని చెప్పుకోవాలి. తెలంగాణలో బీజేపీకి అధికారం కన్నా.. తన ఉనికిని చాటుకోవడంతో పాటు బీఆర్ఎస్ కు మళ్ళీ అధికారం దక్కేలా చేయడమే కర్తవ్యం. బీజేపీకి అధికారంలోకి వచ్చే స్థాయి లేదన్నది ఆ పార్టీ పెద్దలకు కూడా తెలిసిన నిజమే కనుక.. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచడమే. కాంగ్రెస్ ముక్త భారత్ ఆ పార్టీ లక్ష్యం, అంటే  కాంగ్రెస్ బీజేపీ  ప్రథమ రాజకీయ ప్రత్యర్థి. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ గెలిస్తే మంచిదని బీజేపీ భావించింది. అందుకు పవన్ కల్యాణ్ ను కూడా వాడుకుంది. కానీ, ఫలితం లేకపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలువరించలేకపోయిన బీజేపీ ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని మొదలు పెట్టింది. అంతే ఉన్నపళంగా   పవన్ కళ్యాణ్ కు బైబై చెప్పేసింది. అసెంబ్లీ ఎన్నికలలో   జనసేనను దగ్గర చేసుకున్న బీజేపీ..   ఇప్పుడు   అవసరం లేదని పక్కకి నెట్టేసింది. ఏపీలో ఇప్పటికీ జనసేన తమతో పొత్తులోనే ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

వైసీపీ అసంతృప్త నేతల రహస్య సమావేశం.. జగన్ పై తిరుగుబాటు?

ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు అధికార పార్టీలో  అలజడి రేపుతోంది. ఒకవైపు ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతూనే ఇష్టారీతిగా  అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు చేపట్టడాన్ని వైసీపీలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. సిట్టింగులు అసంతృప్తితో, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పనితీరు సరిగా లేదని, ప్రజలలో అసంతృప్తి ఉందని మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సహా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాదు, ధిక్కరించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్   45 మందితో ఇలా మార్చేయనున్న వారి రెండో జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం 90 మంది వరకూ అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ అగ్రనాయకత్వం చెబుతోంది. దీంతో ఎక్కడికక్కడ అభ్యర్థులలో అసంతృప్తి రగిలిపోతోంది. కనీసం సీనియర్లు, మంత్రులు అని కూడా చూడకుండా పక్కన పెట్టేయడం, పక్కకునెట్టేయడం, కొందరికైతే  అసలు పార్టీ టికెట్లే ఉండవన్న వార్తల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లు రహస్యంగా సమావేశమై జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, తీరు మార్చుకోకుంటే పార్టీ వీడడానికైనా వెనుకాడరాదనీ తీర్మానించినట్లు తెలుస్తోంది.    ఇప్పటికే కొందరు నేతలు ఇలా ఇష్టారీతిన నియోజకవర్గాలను మార్చేయడంపై అధిష్టానాన్ని నిలదీస్తున్నారని అంటున్నారు.   సాక్షాత్తు జగన్‌ తీసుకున్న నిర్ణయమని అధిష్టానం పెద్దలు చెబుతున్నా అయితే ఏంటీ వీ డోంట్‌కేర్‌ అంటున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటే తాము అంగీకరించేది లేదని ఇప్పటికే కొందరు నేతలు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తున్నది. కాగా ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కటై తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ వైసీపీ ఎంపీ బెంగళూరు గెస్ట్ హౌస్ ఈ అసంతృప్త నేతలకు శిబిరంగా మారినట్లు తెలుస్తున్నది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ ఎంపీ బెంగళూరు గెస్ట్ హౌస్ లో సమావేశమైన   వైసీపీ అసంతృప్త మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబావుటా ఎగరేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. జగన్ తన ఇష్టానుసారం సీట్ల మార్పిడి చేస్తా అంటే కుదరదని మంత్రులు, ఎమ్మెల్యేలు ఖరాఖండిగా నిర్ణయించుకున్నట్లు సన్నిహితుల నుండి సమాచారం బయటకి పొక్కింది. బెంగళూరులో జరిగిన ఈ సమావేశానికి 75 నుండి 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తుండగా.. అందరూ ఏకతాటిపై నిలబడి అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి నిధులు రాకపోయినా తాము సొంత ఖర్చులతో నియోజకవర్గాన్ని, కార్యకర్తలను   జారిపోకుండా చూసుకున్నామని, ఇప్పుడు హఠాత్తుగా నియోజకవర్గ మార్పిడి చేస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేంలో ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. ఒకవేళ తమకు స్థానచలనం తప్పదు అంటే పార్టీని వదలక తప్పదని మరికొందరు ఎమ్మెల్యేలు కరాకండీగా చెప్పేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఈ సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలు, పరిస్థితి చూసిన కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే పక్కచూపులు చూడటం మొదలెట్టేశారనీ, తెలుగుదేశంతో టచ్ లోకి వచ్చేశారనీ అంటున్నారు.  సీటు విషయంలో పట్టుబట్టబోమనీ, తెలుగుదేశంలో చేర్చుకుంటే చాలనీ కూడా వారు అంటున్నారని చెబుతున్నారు. సంక్రాంతి అనంతరం ఈ నేతల చేరికలు ఉండనున్నట్లు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బెంగళూరులో సమావేశం, పార్టీపై తిరుగుబాటుకు సంకేతంగా చెబుతున్నారు.  ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చేసిన జగన్.. ఇప్పుడు మరో 45 మందితో రెండో జాబితా సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఈ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ జాబితావిడుదల తరువాత  ఏపీ రాజకీయాలలో  కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇంకా చెప్పాలంటే జనవరి తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు మంత్రులే వైసీపీని వీడే అవకాశం మెండుగా ఉన్నాయనీ,  అలాగే మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీపై తిరుగుబాటు ప్రకటించి బహిరంగ విమర్శలకు దిగనున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలు   ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకెన్ని రహస్య సమావేశాలు నిర్వహించనున్నారన్నదానిపై కూడా రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది.

అలుపెరుగని పోరాటానికి నాలుగేళ్లు.. ధర్మానిదే జయం

జగన్ నాలుగున్నరేళ్ల పాలన ఏపీని అస్తవ్యస్తం చేసేసింది. రాష్ట్రంలో సంతోషం, ధీమా, భరోసా అన్న పదాలకు అర్ధమే లేకపోయింది. రాష్ట్రం మొత్తం ఒక బందిఖానాగా మారిపోయింది. ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీసు లఠీలు బదులు చెప్పే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విధానాలను తప్పుపడితే సీఐడీ కేసులు వెంటాడుతాయి. హక్కుల కోసం గళమెత్తితే జైళ్లు నోళ్లు తెరుస్తాయి. శ్రీశ్రీ ఓ కవితలో చెప్పినట్లు రెండు రెళ్లు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా ఏపీ మారిపోయింది. రాష్ట్రంలో మినీ ఎమర్జెన్సీ అమలులో ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో రెవెన్యూలోటుతో, కనీసం రాజధాని కూడా లేకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కదా అని సంతృప్తి చెందడానికి కూడా లేకుండా ఆనాడు భవనాల కేటాయింపు దగ్గర నుంచీ, అక్కడ ఉన్న ఆంధ్రా ఉద్యోగులను గో బ్యాక్ అంటూ నిత్యం వేధింపులతో నిత్యనరకం అనుభవించారు. ఇక విభజన హామీలను అమలు చేయాల్సిన అప్పటి గవర్నర్ నరసింహన్.. దేవాలయాల సందర్శన తప్ప తన బాధ్యతలపై దృష్టి పెట్టింది లేదు.విడిపోయి కూడా అవమానాలు భరించడం అవసరమా? అని తలపోసి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, అపార రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత ముందు చూపుతో రాష్ట్ర రాజధాని అమరాతి నిర్మాణానికి సంకల్పించారు. కాకుండా పాలనను కూడా అక్కడ నుంచే ప్రారంభించారు.  అప్పటి వరకూ అవమానాలను భరించిన ఆంధ్రుల గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. నా రాజధాని నా రాష్ట్రం అన్న నినాదంతో ప్రతి ఆంధ్రుడూ అమరావతి కోసం తన వంతు సహకారం అందించారు. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. చంద్రబాబుపై విశ్వాసం, ఆయన అభివృద్ధి చేస్తారన్న విశ్వసనీయతే రైతులు రాష్ట్ర భవిష్యత్ కోసం భూములిచ్చేందుకు ముందుకు వచ్చేలా చేసింది. అనేక భావోద్వేగాలు, తాతల నాటి భూములతో వారికి ఉన్న అనుబంధం, ఏటా మూడు పంటలు పండే బంగారు భూములను రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక నాయకుడిని నమ్మి అప్పగించడం ఒక చరిత్ర. గతంలో ఎన్నడూ జరగలేదు. భవిష్యత్ లో మళ్ళీ జరుగుతుందని భావించలేం.  కేవలం చంద్రబాబు దార్శనికతపై ఉన్న విశ్వాసం, నమ్మకంతో వేల ఎకరాల భూమిని రైతులు ఒక్క రక్తం బొట్టు చిందకుండా, ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క వివాదం లేకుండా ప్రభుత్వానికి అప్పగించారు. అంతే అమరావతి నిర్మాణం జోరందుకుంది. పాలనా భవనాలు, హైకోర్టు భవనం, అసెంబ్లీ నిర్మాణాలు పూర్తయ్యాయి. దేశం నలుచెరగుల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పెట్టుబడి దారుల దారులన్నీ అమరావతివైపే అన్నట్లుగా సాగాయి. అమరావతి నిర్మాణం జోరందుకుంది. రైతు కూలీలు, చిన్న వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు ఆలా అందరికీ ఉపాధి లభించింది. అయినా అమరావతి నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.. సృష్టిస్తున్నారు. పచ్చి మోసపు మాటలను నమ్మబలికి.. వంచన చేస్తూ..మాయ చేసి, అభూత కల్పనలు.. అసత్య ప్రచారాలు చేసి అమరావతి ప్రాంతాన్ని పాడు పెట్టేసారు. అంతే, నిత్యం కళకళలాడే రాజధాని కళావిహీనం అయిపోయింది. భూములిచ్చిన రైతుల్ని రోజుకోరకంగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకు గురి చేశారు. మూడురాజధానులంటూ ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పారు. రైతులు భగ్గుమన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటే దాష్ఢీకం.. దౌర్జన్యం. అణచివేత..నిరంకుశం. బ్రిటీష్ ఇండియా దురాగతాల్ని మించి పోలీసు దమనకాండ సాగింది. వృద్దులు, మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా రక్తం కళ్ళ చూసారు. బయట ప్రపంచానికి కనిపించేలా వినిపించేలా మహాపాదయాత్ర చేసారు. యధావిధిగా రాజ్యం కాలడ్డం పెడితే న్యాయం అనుమతి ఇచ్చింది.   పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్ర పెద్దలు, రాష్ట్ర బాధ్యులు దుర్మార్గాన్ని అదుపు చేయక్కపోగా మాకు అధికారమిస్తే అప్పుడు న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తు కోసం భూములను త్యాగించిన రైతన్నలు ఈసారి తెగించి ఢిల్లీని చుట్డు ముట్టారు. రైతుల్ని చూసి అరివీర భయంకరులు, అపర చాణుక్యులు అన్న వారే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే, నాలుగేళ్ళుగా చేస్తున్న ఉద్యమం ఒక లెక్క, ఇప్పుడు ఇకనుండి తిరిగి ఇచ్చేది మరొక లెక్క.  నాలుగేళ్లుగా జగన్ చెప్పిన మూడు రాజధానుల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ విషయంలో జగన్ దారుణంగా ఓడిపోయారు. అధికారం ఉందని, తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో జగన్ ఈ నాలుగేళ్ళ పాలనే స్పష్టం చేస్తుంది. రైతులు నిరంతరాయంగా పోరాడుతున్నా వారిపై జగన్ పోలీసులు ఎంత రాజ్యహింసకు పాల్పడినా వారు తగ్గలేదు. కేసుల విస్ఫోటం వారిపై పడినా వారు వెనక్కు తగ్గక పోరాడుతున్నారు. రాజీలేని, అలుపెరుగని పోరాటాల తర్వాతే అద్భతాలు జరిగాయనే   సిద్ధాంతం మాదిరి అమరావతి రైతుల పోరాటం తర్వాతే ఇప్పుడు అద్భుతాలు జరిగే సమయం వచ్చింది. మరో మూడు నాలుగు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇటు చూస్తే అమరావతిని ఖూనీ చేయడం.. మూడు రాజధానులను ఇంచి కూడా కదిలించలేకపోవడంతో అమరావతి రైతుల అసమాన పోరాటం ఫలించే  సమయం ఆసన్నమైంది. ఈ అద్భుతానికి డిసెంబర్ 17 (ఆదివారం)సభ నాంది కానుంది.  రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివాకం (డిసెంబర్ 17) భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఈ భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ఒక్క వైసీపీ నేతలు మినహా అన్ని పార్టీల నేతలూ హాజరవుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సభ జరగడం, అందుకు అన్ని పార్టీల మద్దతు ఇస్తుండడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలక మలుపు కానుంది. ఇంకా చెప్పాలంటే ఇకపై అమరావతి రైతులు వేసే ప్రతి అడుగు జగన్ మోహన్ రెడ్డి పాలనను  చరమగీతానికి చేరువ చేయనుంది. ఇన్నాళ్లూ ఉక్కు పాదం మోపి రాజధాని రైతులను జగన్ అణగతొక్కేందుకు ప్రయత్నిస్తే.. ఇప్పుడు అదే రైతులు జగన్ మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేసేలా   సమర శంఖం పూరిస్తున్నారు. అసలే ప్రజలలో పీకల వరకూ అసంతృప్తిని నింపిన జగన్ రెడ్డికి అమరావతి రూపేణా రైతులు భారీ కుదుపును సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తున్నదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మేడిగడ్డ రిపేర్ ఖర్చు ప్రభుత్వానిదే.. స్పష్టం చేసిన ఎల్అండ్ టి

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఈ మేరకు కాలేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ కు లేఖ రాసింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు కుంగిన సంగతి తెలిసిందే. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటన తీవ్ర నష్టం చేకూర్చింది. దానిని కవర్ చేసుకునేందుకు అప్పట్లో బీఆర్ఎస్ నేతలు బేరేజి మరమ్మతులకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ భరిస్తుందని చెప్పారు. ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా ఇదే విషయం చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ గడువు ఇంకా ఉందనీ, అందువల్ల మరమ్మతుల వ్యయం మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఇప్పడు కాళేశ్వరం నిర్మాణ సంస్థ అందుకు భిన్నంగా స్పందించింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతంలో మరమ్మతుల బాధ్యత తమది కాదని పేర్కొంటూ ప్రాజెక్టో ఇంజీనీర్ ఇన్ చీఫ్ కు లేఖ రాసింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లైంది. అసలే ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో  నిర్మాణ సంస్థ చేతులెత్తేయడంతో అసలు కాంట్రాక్టు విషయంలో లొసుగులు ఏమున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   బ్యారేజీ కుంగిన ప్రాంతంలో   పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం  కాఫర్ డ్యాం నిర్మించాలి. కాఫర్ డ్యాం నిర్మాణానికి 55 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయం అవుతుందన్న అంచనా. ఈ మొత్తానికి ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుంటేనే తాము ముందుకు వస్తామని ఎల్ అండ్ టీ కాళేశ్వరం ఈఎన్సీకి లేఖ రాయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. ఇది కాక మరమ్మతులకు రూ. 500 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఆ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేయడంతో మేడిగడ్డ అంశం మరో సారి హాట్ టాపిక్ గా తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసింది.  

బీఆర్ఎస్ లో తిరుగుబాటు?

ఎన్నికలలో ఓటమి, అలవాటు లేని ప్రతిపక్ష  పోషించాల్సి రావడం. ఈ పరిస్థితికి ఇంకా బీఆర్ఎస్ అడ్జస్ట్ కాలేదు. అంతలోనే పార్టీలో ధిక్కార స్వరాలు వినిపించడం ఆ పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఏకంగా అధినేతనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం పార్టీలో తిరుగుబాటుకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం పార్టీ హైకమాండ్ ఏం చెబితే దానికి తలలూపిన నాయకులు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.  అధినేత అయినంత మాత్రాన ఆయన ఇష్టారీతిన వ్యవహరిస్తానంటే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణం అధినేత తీరేనని ఎత్తి చూపుతున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి వంటి ఎమ్మెల్యేలు అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని బాహాటంగానే చెప్పేస్తే.. ఇక నాయకులు కూడా ఒక్కరొక్కరూ పార్టీ హైకమాండ్ పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.  ఉద్యమ నేతలను పక్కన పెట్టేసి, ఉద్యమ ద్రోహులకు పెద్ద పీట వేస్తే జనం తిరస్కరించకుండా ఎలా ఉంటారని నిలదీస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వారిని కాదనీ, ఇతర పార్టీల నుంచి కుప్పి గెంతులు వేసి వచ్చిన వారిని అందలం ఎక్కించిన ఫలితమే ఈ పరిస్థితి అని నిర్మొహమాటంగా చెబుతున్నారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్ చార్జీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు  పార్టీపై, పార్టీ హైకమాండ్ పై మరీ ముఖ్యంగా అధినేత తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం, ప్రజలకు దూరం కావడం వల్లనే ఎన్నికలలో పరాజయం మూటగట్టుకోవలసి వచ్చిందని తక్కెళ్ల పళ్లి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ అధినేత  కేసీఆర్ తెలంగాణవాదం, ఉద్యమం తెలియనివారిని అందలం ఎక్కించడాన్ని ప్రజలు అమోదించలేదనడానికి ఈ ఎన్నికల ఫలితమే నిదర్శనమన్నారు.  ఒక ఎమ్మెల్సీ ఏకంగా పార్టీ అధినేతపైనే విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ అధినేతకు పరాజయం తరువాత గతంలోలా పూర్తి పట్టులేదని తేటతెల్లమౌతోందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీలో చీలిక అనివార్యం అన్న దిశగా పరిశీలకుల విశ్లేషణలు సాగుతున్నాయి.  

కేటీఆర్ సీఎం ఆశలు గల్లంతు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా తెలంగాణలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) యేతర ప్రభుత్వం కొలువుదీరింది. ఇవన్నీ తెలిసిన విషయాలే  ఈ చర్విత చరణం ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆయన తన వారసుడిగా కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. అప్పటి నుంచీ కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా మీడియా ముందుకు వచ్చారు. గతంలో ఏ మంత్రీ చేయని విధంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా కేటీఆరే ప్రకటిస్తూ వచ్చారు.    నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ ను సీఎంగా పట్టాభిషిక్తుడు కావడం తథ్యమనే వార్తలు వచ్చాయి. అందుకు అప్పట్లో  ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. దీనిని కేసీఆర్, కానీ కేటీఆర్ కానీ ఖండించలేదు కూడా. దాంతో కేసీఆర్ స్థానంలో కేటీఆర్ పగ్గాలు అందుకుని సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమనే అంతా అనుకున్నారు.  అయితే అప్పట్లో వినిపించినట్లుగా   కుటుంబ కలహాలో మరో కారణమో కానీ, కేటీఆర్ సీఎం పదవీ పట్టాభిషేక కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.  అయితే అప్పట్లోనే పార్టీలో చీలిక భయమో, వ్యతిరేకత వెల్లువెత్తుతుందన్న అనుమానమో.. కేటీఆర్ స్వయంగా తాను  సీఎంరేసులో లేనని ప్రకటించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు, కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు.  ముందుగానే కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తూ పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లుతుందనీ, కనుక తొలుత సీఎం ప్రమాణ స్వీకారం చేసి ఆ తరువాత పగ్గాలు కేటీఆర్ కు అప్పగించి ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారనీ పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి.  కానీ తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచిందన్నట్లు  ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. దీంతో కేటీఆర్ సీఎం ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. బీఆర్ఎస్ పుంజుకుని భవిష్యత్ లో మళ్లీ అధికారంలోకి వస్తుంది అనుకున్నా.. కేసీఆర్ కు, కేటీఆర్ కు అప్పటి వరకూ పార్టీలో ఇప్పుడున్నంత ఆమోదం, ఆధిపత్యం ఉంటాయా అన్నది అనుమానమే అని అంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా కేటీఆర్ ను పార్టీ ఎమ్మెల్యేలలో అత్యధికులు వ్యతిరేకించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.  మొత్తం మీద కేటీఆర్ ను సీఎంగా  చేయాలన్న కేసీఆర్ ఆశ, సీఎంగా పాలన సాగించాలన్న కేటీఆర్ ఆకాంక్ష నీరుగారిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన డిఎస్పి నళిని ఏమయ్యారు? 

ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ ( ప్రస్తుతం బిఆర్ఎస్) ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టారు. ఉద్యమ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.  ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ ఈ ఎన్నికలలో ప్రజలు ఉద్యమ పార్టీకి చీ కొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పట్టం కట్టారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఉద్యమ సమయంలో త్యాగాలు చేసిన వారిని గుర్తుపెట్టుకుని వారి సేవలను తిరిగి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ డిఎస్పి నళినికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్దమయ్యారు.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె ఏమయ్యారు? నళిని గురించి ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. 2014లో ఉద్యమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ పేరుతో ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు. వీరిలో ఎంతో మంది అనర్హులు కూడా ఉన్నారు. ఆ మాటకొస్తే.. తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసినవాళ్లు కూడా అధికారాన్ని, రాజభోగాలను అనుభవించారు. మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన నళినికి న్యాయం ఎందుకు జరగలేదు? కాలం గిర్రున తిరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో మళ్లీ నళిని పేరు వార్తల్లోకి వచ్చింది. ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. కొంత మంది జర్నలిస్టులు నళినిని సంప్రదించే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. అది విని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నళినిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు.నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. తనను ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నా ఉద్యోగానికి న్యాయం చేయలేననని తెలిపారు. 12 ఏళ్లు గ్యాప్ రావడం వల్ల సర్వీస్ రూల్స్ ఒప్పుకోవని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోయిందని వెల్లడించారు. ఒకవేళ కాదు, కూడదని ఉద్యోగంలోకి తీసుకున్నా.. కోర్టులో చిక్కులు ఎదురవుతాయని వివరించారు. ‘న్యాయం చేయలేను..’ అంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు.

సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు తరచుగా రాకపోకలు సాగించే వారు. దీంతో సీఎం కాన్వాయ్ కోసం తరచుగా ట్రాఫిక్ ను నిలిపివేసే వారు. ఆయన సెక్రటేరియెట్ కు వెళ్ల లేదు కనుక సరిపోయింది కానీ, సెక్రటేరియెట్ కు కూడా వెళ్లి ఉంటే హైదరాబాద్ నగరవాసులకు నిత్య నరకం అనుభవం లోకి వచ్చి ఉండేది. అసలు విషయానికి వస్తే సీఎంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగించే సమయంలో ఆ దారిలో  ట్రాఫిక్ ను నిలిపివేయడంతో జనం నానా ఇబ్బందులూ పడేవారు. ముఖ్యంగా ప్రగతి భవన్ నుంచి ఆయన బయలుదేరడానికి ముందే ట్రాఫిక్ ను నిలిపివేయడంతో.. పంజాగుట్ట సర్కిల్ నుంచి ప్యాట్నీ సెంటర్ వరకూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది. అక్కడ నుంచి మళ్లీ అల్వాల్ రైతు బజార్ వరకూ కూడా ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపివేసి సీఎం కాన్వాయ్ కు దారిచ్చే వారు. సీఎంగా కేసీఆర్ ఉన్న తొమ్మిదేళ్లలోనూ ఇది చాలా తరచుగా జరిగేది. ఆయన ఫామ్ హౌస్ రాకపోకలు కూడా  ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే జరిగేవి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.  దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.   పాలనకు సంబంధించిన అంశాలపై తన ముద్ర ఉండేలా ముందుకు కదులుతున్నారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలు తీసివేయించడం నుంచీ, ప్రజా వాణి అంటూ ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ వరకూ ఆయన జనం సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు రోడ్లపై తన కాన్వాయ్ వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తాను ఇంటి నుంచి బయలుదేరడానికి చాలాసేపు ముందే వాహనాలను పోలీసులు నిలిపివేయడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అలా చేయెద్దని ఆదేశించారు. తన రాకపోకల వల్ల జనం ఇబ్బందులు పడే పరిస్థితి రావద్దని విస్ఫష్టంగా చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  అదే విధంగా తన కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రొటోకాల్ వెహికిల్ వద్దని స్పష్టం చేశారు. అలా చేసిన వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. ఈ మేరకు రేవంత్ డీజీపీకి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  నగర వాసుల ట్రాఫిక్ కష్టాలపై రేవంత్ దృష్టి పెట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. అధికారం అంటే బాధ్యత అని రేవంత్ తన చర్యల ద్వారా చాటుతున్నారని ప్రశంసిస్తున్నారు.  

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం... ఇద్దరి మృతి

కరీంనగర్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మృతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లికి చెందిన ఆకాశ్ (22), ఏంపేడుకు చెందిన శ్రావణ్ (32)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. హుజురాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న ఓ కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారి పైన, బతుకమ్మ ఘాట్ మూల వద్ద  కరీంనగర్ వైపు నుండి హుజురాబాద్ వైపు వెళుతున్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారులోనే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

వ్యతిరేకత సిట్టింగుల మార్పునకు కొలమానం అయితే.. మరి జగన్ స్థానంలో ఎవరు?

ఈసారి  షెడ్యూల్ కంటే ముందే సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు చెబుతున్నారు.  అంటే ఏపీలో కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే మార్చి మొదటి వారం లేదా ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. శుక్రవారం(డిసెంబర్ 15) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో  సీఎం జగన్  కూడా ఇదే విషయం చెప్పారు.  మరోసారి అధికారం దక్కించుకోవాలని జగన్ పలు విధాలుగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రంగా అసంతృప్తి కనిపిస్తున్నది. ఈ విషయం వైసీపీ పెద్దలకు కూడా బోధపడింది. దీంతో గెలుపు మార్గాల కోసం వెతుకులాడుతున్న సీఎం జగన్  ఎమ్మెల్యేల స్థానాల మార్పు అనే కొత్త ఆటకు తెరతీశారు. ఎక్కడికక్కడ ఇన్ చార్జీలను మార్చేసి ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. పనితీరు సరిగా లేదని, ప్రజలలో అసంతృత్తి ఉందని మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సహా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్ మరో 45 మందితో ఇలా మార్చేయనున్న వారి రెండో జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఇక సీఎం జగన్  షెడ్యూల్ కంటే ఓ పది పదిహేను రోజులు ముందుగానే ఎన్నికలకు జరిగితే బాగుండునని భావిస్తున్నారు.  మార్చి , ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు ఉంటాయనీ, దాని వల్ల తన పనితనంపై కోపంతో ప్రజలు తనను సాగనంపడానికి బటన్ నోక్కుతారనీ భయపడుతున్నారు. ఆ భయాన్ని ఆయన ఏ మాత్రం దాచుకోవడం లేదు. అందుకే కేబినెట్ సమావేశంలో పదిహేను రోజులు ఏపీలో ముందుగా ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు.   షెడ్యూల్ ప్రకారం మార్చి పదో తేదీలోపు .. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2019లో అదే చేశారు. ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించి ఎప్పుడో జూన్ లో ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఏపీ తెలంగాణలకు సంబంధించినంత వరకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే షెడ్యూల్ ప్రకటించిన రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్.. ఆ తర్వాత నెల రోజుల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎలా చూసినా.. ఫిబ్రవరిలో షెడ్యూల్ ప్రకటించినా.. ఏప్రిల్ వరకూ పోలింగ్ ఉంటుంది. కానీ అంత కంటే ముందే పోలింగ్ జరగాలని  జగన్ రెడ్డి కోరుకుంటున్నారు. అందుకే ముందుగానే టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అంత కన్నా ముందుగానే ఎన్నికలు పెట్టాలన్నట్లుగా వైసీపీ నేతలు .. ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చి ఉంటారని కూడా భావిస్తున్నారు. జగన్ రెడ్డికి అంత కంగారు ఉంటే.. తెంలగాణ ఎన్నికలతో వెళ్లిపోయినా బాగుండేదని వైసీపీలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.   తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, అప్పుడు ఏపీలో తన విజయానికి తెలంగాణ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న  గట్టి నమ్మకంతో  జగన్ అప్పట్లో ముందస్తుకు వెనకడుగు వేశారనీ, ఇప్పుడు తెలంగాణలో తన అంచనాలు తప్పు కావడంతో కంగారు పడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాగర్ నీరు అంటూ తెలంగాణ ఎన్నికలకు గంటల ముందు ఆ రాష్ట్ర  ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి కేసీఆర్ కు మేలు చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం అవ్వడమే కాకుండా, ఏపీ ఎన్నికలలో తనకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో  జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారనీ, షెడ్యూల్ కంటే కనీసం ఓ పది పదిహేను రోజుల ముందు ఏపీలో ఎన్నికలు జరిగితే.. ప్రజల విద్యుదాగ్రహం ప్రభావం పెద్దగా ఉండదనీ ఆశపడుతున్నారు. మొత్తం మీద నిండా మునిగిపోయిన జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటేనే గజగజలాడుతున్నారు.  ఇక ఎమ్మెల్యేలను మార్చేస్తే గట్టెక్కేస్తానని ఆశపడుతున్న జగన్ కు అది కూడా కొడిగట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజంగా ప్రజా వ్యతిరేకత కొలమానంగా సిట్టింగులను మార్చాలని జగన్ భావిస్తుంటే ముందుగా జగన్ తన స్థానాన్ని ఎక్కడకు మార్చోవాలో నిర్ణయించుకోవాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ వర్గాలు కూడా అదే అంటున్నాయి.  

ప్రశ్నిస్తే దేశద్రోహమేనా?

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి   పాలనలో అరాచకాలకు అంతూ పొంతూ లేదన్న విషయం తెలిసిందే.   అడుగడుగునా పాలకులు ప్రజల గొంతు నొక్కి తమ పాలనపై వేలెత్తి చూపే వాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, సాహసించి ప్రశ్నిస్తే పోలీసు కేసులు, సీఐడీ విచారణలతో వారిని వేధించి  దేశద్రోహం కేసులు బనాయించేందుకు కూడా వెనకాడకుండా పాలన సాగిస్తున్నారని మేధావులు, పరిశీలకులు   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి జగన్ సర్కార్ వేధింపులను భరించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు  జీవచ్ఛవాలుగా బ్రతుకీడిస్తున్నారు. నాడు కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ నుండి.. రోడ్లు సరిగాలేవని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విద్యార్థుల వరకూ.. ప్రజల సమస్యలపై స్పందించిన ఎందరినో  ఏపీ ప్రభుత్వం వేధించి హింసించి నరకం చూపించింది.  గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయి అణిచివేత చూడలేదు. కానీ, జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి ప్రశ్నించే వారి  ఆచూకీ లేకుండా చేయడమే పనిగా పెట్టుకుంది.  అలాంటి వారిలో ఒకరే గుంటూరు రంగనాయకమ్మ. శంకర్ విలాస్ యజమానురాలిగా, సామాజిక కార్యకర్తగా పూంతోట రంగనాయకి గుంటూరులో అందరికీ సుపరిచితమే. అప్పట్లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ విషవాయువుల వలన 15 మంది చనిపోయినట్లు అధికారికంగా గుర్తించగా.. ఎందరో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. లీకైన విషవాయువులు 3 కిలోమీటర్ల వరకూ వ్యాపించగా.. ప్రజల చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస ఇబ్బందులతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోగా పశువులు, ఇతర మూగజీవాలు   పిట్టల్లా రాలిపోయాయి. ఈ దుర్ఘటనపై రంగనాయకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 20 పాయింట్లతో ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. ప్రభుత్వం ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ పోలీసులు ఆమెపై డజనుకుపైగా కేసులు బనాయించి వేధించి చిత్రహింసలకు గురి చేశారు.  కనీసం వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా దూషణలకు దిగారు. వైసీపీ సోషల్ మీడియా అయితే ఆమెపై దేశద్రోహి ముద్ర వేసి పోస్టులు పెట్టారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ.. ఎంపీల నుండి సలహారుల వరకూ అందరూ ఆమెను సోషల్ మీడియాలో వేధించి   ప్రత్యక్ష నరకం చూపించారు. ఇండియాలోని రకరకాల ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుండి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆమెకి బెదిరింపు కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. తన కుటుంబంపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టి చివరికి ఆమె ఇంటి నుండి బయటకి వెళ్లేందుకు కూడా భయపడేలా చేశారు. దీంతో ఆమె జీవితం నరకప్రాయమైంది. చివరికి దశాబ్దాల చరిత్రగల వారి శంకర్ విలాస్ హోటల్ ను కూడా నడిపించలేక వేరేవారికి లీజుకిచ్చేయాల్సి వచ్చింది. అద్దెకి ఇవ్వడంపై కూడా స్థానిక వైసీపీ నేతలు ఆమె కుటుంబంపై ఎన్నో రకాల ఒత్తిళ్లు తెచ్చారు. చివరికి ఆమె గుంటూరు వదిలి బ్రతుకు జీవుడా అనుకుంటూ హైదరాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై  ప్రశ్నించిన పాపానికి ఒక వృద్ధురాలిని జగన్ సర్కార్ ఏ స్థాయిలో రాచిరంపాన పెట్టిందో, ఆమె వివరించారు. చివరికి సమాజంలో తనను ఒక మనిషిగా కూడా లెక్కలో లేకుండా చేశారని, చుట్టుపక్కల ప్రజలు తమతో మాట్లాడేందుకు కూడా భయపడేలా చేశారనీ, తమకి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే మీరు మాకు తెలియదని చెప్పమంటూ దూరం పెట్టారని కొండంత బాధను దిగమింగుతూ ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో   వైరల్ అవుతోందిజ. ఆమె మాటలు, ఆమె మాటల వెనక బాధను చూసిన నెటిజన్లు జగన్ ప్రభుత్వపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో ఈమెకి జరిగిన అన్యాయమే తేటతెల్లం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు మార్గాలేవీ?.. జగన్ వెతుకులాట!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు టీడీపీ-జనసేనలు పొత్తుకు సిద్దమై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల మధ్యకు వెడుతూ గెలుపు ధీమాతో ఉంటే అధికార వైసీపీ మాత్రం ఓటమి భయంతో బిక్కుబిక్కుమంటోంది.   ఇప్పటికే వెలువడిన సర్వేల ఫలితాలు, ప్రజల అసంతృప్తి, వ్యతిరేకత గమనించి ఓటమిని తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటోంది.   ఈ క్రమంలోనే సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో మరింత గందరగోళానికి తెరలేపుతున్నాయి. అంతో ఇంతో  ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని మరింత పతనం దిశగా నడిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయంతో పార్టీలో ఓ విధమైన గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే  ముగ్గురు మంత్రులు సహా  11 మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగించిన జగన్  ఇప్పుడు ఆ దిశగా రెండో అడుగు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గాలను మార్చేసే ఎమ్మెల్యేల రెండో జాబితా కూడా రెడీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోండొ జాబితాలో కూడా మంత్రులు సహా 45 మంది ఎమ్మెల్యేలు ఉణ్నారని చెబుతున్నారు. ఇది కాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని అంటున్నారు. మొత్తంమీద 90 మందికి పైగా సిట్టింగులను మార్చేయాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.  జగన్ రెడీ చేసిన  రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది.   పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ రెండో జాబితాలో  ఆరుగురు మంత్రులు ఉన్నారంటున్నారు.   అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను యలమంచిలికి, అలాగే  కొవ్వూరు (ఎస్సీ) ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం (ఎస్సీ)కి పంపించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  అమలాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపె విశ్వరూప్ కు ఈసారి  దక్కే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. అమలాపురం నుండి ఎంపీ చింతా అనూరాధను బరిలోకి దించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్, సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబులను కూడా నియోజకవర్గాలు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే,   మంత్రి గుమ్మనూరి జయరాంను లోక్‌సభ అభ్యర్థిగా దించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని కూడా లోక్ సభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ (ఎస్టీ), యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పి.ఉమాశంకర్‌ గణేశ్‌, పత్తిపాడు శాసన సభ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గోపాలపురం నుంచి తలారి వెంకటరావు (ఎస్సీ), తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి (ఎస్సీ), అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు, విజయవాడ సెంట్రల్‌  శాసన సభ్యుడు మల్లాది విష్ణు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, గూడూరు ఎమ్మెల్యే వి.వరప్రసాదరావులకు కూడా స్థాన చలనం ఉంటుందంటున్నారు. అదే విధంగా  నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, మంత్రాలయం శాసన సభ్యుడు వై.బాలనాగిరెడ్డి, గుంతకల్‌  ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, సత్యవేడు శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పలమనేరు వెంకటగౌడలను కూడా మార్చే అవకాలున్నాయని ప్రచారం జరుగుతోంది.  ఇక, కాకినాడ ఎంపీ వంగా గీతను ఎమ్మెల్యే పి.దొరబాబు స్థానం పిఠాపురం నుండి పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది.  అంతేకాదు, చింతలపూడి, పోలవరం, ఉంగటూరు, అవనిగడ్డ, పెడన, నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, ప్రత్తిపాడు, జగ్గంపేట, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం, రాజమండ్రి సిటీ,  తాడేపల్లిగూడెం, ఉండి, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం, నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు, గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, జమ్మలమడుగు, కమలాపురం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి, సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, గాజువాక, విశాఖ సౌత్, పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, పాడేరులో కూడా అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తుంది.

రోడ్డు ప్రమాదంలో ఎంఎల్ సి షేక్ సబ్జీ దుర్మరణం 

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంఎల్ సి షేక్ సబ్జీ దుర్మరణం చెందారు.ఈ ప్రమాదంలో ఆయన గన్ మెన్, కారు డ్రైవర్ తీవ్ర గాయాలకు గురై ఆందోళనకర పరిస్థితులో ఉన్నారు. షేక్ సబ్జీ టీచర్స్ పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి పిడిఎఫ్ ఎంల్ సిగా నియామకమయ్యారు. అంగన్ వాడి కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం  ఎంఎల్ సి కారును ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో ఎంఎల్ సి అక్కడికక్కడే మృతి చెందారు. .ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సాబ్జీ మరణ వార్తను తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.సాబ్జీ కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చివరి ఘడియల్లో కూడా సాబ్జీ ప్రజాసేవలోనే కొనియాడారని చెప్పారు. షేక్ సాబ్జీ మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేశ్ తెలిపారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు సాబ్జీకి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా స్పందించారు.

ప్రజావాణికి భారీ స్పందన

తెలంగాణలో  కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఏర్పడింది.గతంలో ప్రజాదర్బార్‌గా ఉన్న పేరును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్ల నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరగనున్నా.. 10 గంటల వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌కు చేరుకున్నారు.గతంలో ప్రగతి భవన్‌గా ఉన్న పేరును జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్‌గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వారానికి  రెండు రోజులు ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తెల్లవారుజాము వరకే ప్రజా భవన్‌కు చేరుకున్నారు. దీంతో ప్రజా భవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

కుటుంబంతో సహా కలెక్టర్  గన్ మెన్ ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్  నరేష్  ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. భార్య, ముగ్గురు  పిల్లల్ని  హత్య చేసి తాను గన్ తో కాల్చుకుని  ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు హాజరు కాకపోవడంతో తోటి ఉద్యోగులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గన్ మెన్ తో బాటు భార్య పిల్లలు ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. చిన్నకోడూరు మండలం రాముని పట్లలో ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామ నివాసి ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే విధులు పూర్తి చేసుకుని... ఇంటికి వచ్చే సమయంలో 9ఎంఎం పిస్టల్ తెచ్చుకున్నాడు.  అదే పిస్టల్ తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్,ఇద్దరు చిన్న పిల్లలను కాల్చి హత్య చేశాడు. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణం తెలియాల్సి ఉంది.   

కెసీఆర్ కు జడ్ ప్లస్ భధ్రత కుదింపు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు  

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రతను కుదించింది. ఇప్పటి వరకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. వై కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4 ప్లస్ 4 గన్ మెన్లతో పాటు, ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు.  మాజీ మంత్రులుగా పని చేసి, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల ఛైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగో ప్రముఖుల సెక్యూరిటీపై కూడా సమీక్ష జరిగింది. మాజీలలో ఎవరికైనా భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి గన్ మెన్లను ఇచ్చే అవకాశం పరిశీలనలో ఉంది. అయితే, వీరికి సంబంధించి పూర్తిగా రివ్యూ చేసిన తర్వాతే గన్ మెన్లను ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్‌మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దృష్టి సారించింది. 

ముందు నుయ్యి, వెనుక గొయ్యి.. అయోమయంలో జగన్!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నిండా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి అది వేరే విషయం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమాయత్తమౌతున్న తీరు చూస్తే ఆయనలో విజయం పట్ల ఏ మాత్రం విశ్వాసం లేదని అవగతమౌతున్నది. ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన జగన్.. అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే పార్టీ అధినేతగా గానీ, ప్రభుత్వాధినేతగా కానీ ఏ విషయంలోనూ జగన్ ఇప్పటి దాకా బాధ్యత తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసిన అధికారులకు కోర్టుల్లో అక్షింతలు, మందలింపులు, శిక్షలే ఇందుకు నిదర్శనం. ఇక ముందు జగన్ తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తారన్న నమ్మకం కూడా ఎవరిలోనూ, ఆఖరికి పార్టీ శ్రేణుల్లో కూడా లేదు.  అందుకు తగ్గట్టుగానే పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యేలపై నెట్టేందుకు జగన్ నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పు నిర్ణయమే నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఆ ఓటమికి తాను కాదు, ఎమ్మెల్యేల పనితీరే కారణమని ప్రజలను నమ్మించడానికి నానా కష్టాలూ పడుతున్నారు. ఇంత కాలం తనకు అత్యంత విధేయులుగా ఉన్న వారిని కూడా బలిపశువులు చేసి రానున్న ఓటమి నెపం వారి మీదకు నెట్టేయడానికి  ఇసుమంతైనా వెనుకాడటం లేదు.   గతం నుంచీ కూడా ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం పార్టీనీ, క్యాడర్ నూ జనంలో తన పట్ల సదభిప్రాయమే ఉంది, కానీ ఎమ్మెల్యేల పనితీరు వల్లనే పార్టీ నష్టపోతోందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి వారిని పని చేయనీకుండా చేసింది కూడా జగన్ విధానాలే. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఎటువంటి పనీ లేకుండా చేసి మొత్తం తాను నమ్ముకున్న వాలంటీర్లకే పెత్తనం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ప్రభుత్వం పేరు చెప్పుకుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకోవడానికే పరిమితమయ్యారన్న విమర్శలు ఎదురయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వారి ప్రమేయం ఏమాత్రం లేకపోవడంతో వారు జనాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యేలతో పనేముంది.. బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నాను కనుక తన ముఖం చూసే జనం ఓటేస్తారన్న భ్రమల్లో ఉన్న జగన్ పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తత్వం బోధపడి.. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రారంభించిన ఈ చర్యలను కూడా ఆయన తనను బ్లేమ్ నుంచి తప్పించుకుంటే చాలు, పార్టీ ఏమైపోయినా ఫరవాలేదన్నట్లుగానే చేపట్టారు.  తెలంగాణలో ప్రజా వ్యతిరేకత సిట్టింగుల మీద ఉందన్న సంగతి తెలిసీ కేసీఆర్ వారిని మార్చకుండా అతి విశ్వాసంతో ముందుకు వెళ్లి భంగపడితే.. ఇక్కడ జగన్  ఎలాగూ భంగపాటు తప్పదన్ననిర్ణయానికి వచ్చేసి.. తాను ఇంత కాలం ఉత్సవ విగ్రహాల స్థాయికి పరిమితం చేసిన ఎమ్మెల్యేలపై నెపం నెట్టేసి చేతులు దులిపేసుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే తాము కూరలో కరివేపాకులమని అర్ధమైపోయిన తరువాత ఎమ్మెల్యేలు ఇక జగన్ కు విధేయత చూపే అవకాశం ఉండదని ఆయన గ్రహించలేకపోయారు. అందుకే ఇప్పుడు వైసీపీలో అసమ్మతి నివురు తొలగిపోయి అగ్ని బయటపడుతోందని పరిశీలకుకు అంటున్నారు. ఇది ఒక్క అళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఆగే పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు. ఒక సారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత తిరుగుబాటు రూపంలో బయటకు వస్తుందని చెబుతున్నారు.   పొరుగు రాష్ట్రం పరిణామాలతో తమకు సంబంధం లేదని, రాష్ట్రంలోని 175 సీట్లను గెలుచుకునే లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా తీసుకుంటున్న చర్యలలో భాగమే ఇది అని ఆ పార్టీ పెద్దలు ఎంతగా సమర్ధించుకోవడానికి చూసినా, జగన్ నిర్ణయాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న తీరు పార్టీలో ముసలం అనివార్యమన్న విషయాన్నే చాటుతున్నాయని చెబుతున్నారు.   పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు 90 స్థానాలలో సిట్టింగులను మార్చాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది కచ్చితంగా పార్టీ పునాదులను కదిపేస్తుందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. గతంలో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు పార్టీలో భగ్గుమన్న అసంతృప్తిని గుర్తిస్తున్నారు. అప్పడు అసంతృప్తి చల్లారడానికి జగన్ సర్కార్ మరో  రెండేళ్లు అధికారంలో ఉంటుంది. ఇప్పుడే బయటకు వచ్చి ఇబ్బందులు పడటం ఎందుకని అసంతృప్త ఎమ్మెల్యేలు భావించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక అధికారంలోకి వచ్చే ఆశ లేదు కనుక.. జగన్ ను ధిక్కరిస్తే.. తమపై జనాగ్రహం ఒకింతైనా తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారని అంటున్నారు.   ఇప్పటికే  వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి. ఈ కూటమితో బీజేపీ కలిసినా, కలవకపోయినా పెద్దగా ఫరక్ పడదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ఫలితం తరువాత సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పెద్దగా స్థానాల సంఖ్యపై పట్టుబట్టే పరిస్థితి లేదని, ఆ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాలలో జనసేనాని చెప్పేశారనీ అంటున్నారు.  తెలుగుదేశం, జనసేన పొత్తు కనీసం పదేళ్ల పాటు కొనసాగాలని, అప్పుడే  జగన్‌ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి వీలౌతుందని పవన్ కల్యాణ్ చెప్పారు.  బీజేపీ కలిసి, వచ్చినా రాకపోయినా   తాను సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశంకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూస్తానని చెప్పారు. చెప్పడమే కాకుండా పార్టీని, క్యాడర్ ను అందుకు సన్నద్ధం చేస్తున్నారు. దీంతో అధికారికంగా బీజేపీ పొత్తులో ఉన్నా లేకున్నా మూడు పార్టీలూ కూటమిగానే జగన్ ను ఎదుర్కొంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఒక వేళ పోటీలో ఉన్నా అది నామమాత్రమేననీ, రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఒక శాతం ఓట్లతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం నామమాత్రమేనని అంటున్నారు. మరో వైపు తెలంగాణ ఫలితంతో ఏపీలో కాంగ్రెస్ ఏదో మేరకు పుంజుకున్నా, ఆ మేరకు నష్టం వైసీపీకేనని విశ్లేషిస్తున్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా తెలుగుదేశం నెత్తిన పాలు పోస్తాయని అంటున్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తే జగన్ పార్టీ ఖాళీ అయిపోతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  మొత్తం మీద ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికలలో జగన్ కు ఓటమి తథ్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు.