సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశం
posted on Dec 16, 2023 @ 9:41AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు తరచుగా రాకపోకలు సాగించే వారు. దీంతో సీఎం కాన్వాయ్ కోసం తరచుగా ట్రాఫిక్ ను నిలిపివేసే వారు. ఆయన సెక్రటేరియెట్ కు వెళ్ల లేదు కనుక సరిపోయింది కానీ, సెక్రటేరియెట్ కు కూడా వెళ్లి ఉంటే హైదరాబాద్ నగరవాసులకు నిత్య నరకం అనుభవం లోకి వచ్చి ఉండేది. అసలు విషయానికి వస్తే సీఎంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగించే సమయంలో ఆ దారిలో ట్రాఫిక్ ను నిలిపివేయడంతో జనం నానా ఇబ్బందులూ పడేవారు. ముఖ్యంగా ప్రగతి భవన్ నుంచి ఆయన బయలుదేరడానికి ముందే ట్రాఫిక్ ను నిలిపివేయడంతో.. పంజాగుట్ట సర్కిల్ నుంచి ప్యాట్నీ సెంటర్ వరకూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది. అక్కడ నుంచి మళ్లీ అల్వాల్ రైతు బజార్ వరకూ కూడా ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపివేసి సీఎం కాన్వాయ్ కు దారిచ్చే వారు. సీఎంగా కేసీఆర్ ఉన్న తొమ్మిదేళ్లలోనూ ఇది చాలా తరచుగా జరిగేది. ఆయన ఫామ్ హౌస్ రాకపోకలు కూడా ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే జరిగేవి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనకు సంబంధించిన అంశాలపై తన ముద్ర ఉండేలా ముందుకు కదులుతున్నారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలు తీసివేయించడం నుంచీ, ప్రజా వాణి అంటూ ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ వరకూ ఆయన జనం సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు రోడ్లపై తన కాన్వాయ్ వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తాను ఇంటి నుంచి బయలుదేరడానికి చాలాసేపు ముందే వాహనాలను పోలీసులు నిలిపివేయడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అలా చేయెద్దని ఆదేశించారు. తన రాకపోకల వల్ల జనం ఇబ్బందులు పడే పరిస్థితి రావద్దని విస్ఫష్టంగా చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అదే విధంగా తన కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రొటోకాల్ వెహికిల్ వద్దని స్పష్టం చేశారు. అలా చేసిన వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. ఈ మేరకు రేవంత్ డీజీపీకి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగర వాసుల ట్రాఫిక్ కష్టాలపై రేవంత్ దృష్టి పెట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. అధికారం అంటే బాధ్యత అని రేవంత్ తన చర్యల ద్వారా చాటుతున్నారని ప్రశంసిస్తున్నారు.