బీఆర్ఎస్ లో తిరుగుబాటు?
posted on Dec 16, 2023 @ 12:23PM
ఎన్నికలలో ఓటమి, అలవాటు లేని ప్రతిపక్ష పోషించాల్సి రావడం. ఈ పరిస్థితికి ఇంకా బీఆర్ఎస్ అడ్జస్ట్ కాలేదు. అంతలోనే పార్టీలో ధిక్కార స్వరాలు వినిపించడం ఆ పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఏకంగా అధినేతనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం పార్టీలో తిరుగుబాటుకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం పార్టీ హైకమాండ్ ఏం చెబితే దానికి తలలూపిన నాయకులు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
అధినేత అయినంత మాత్రాన ఆయన ఇష్టారీతిన వ్యవహరిస్తానంటే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణం అధినేత తీరేనని ఎత్తి చూపుతున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి వంటి ఎమ్మెల్యేలు అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని బాహాటంగానే చెప్పేస్తే.. ఇక నాయకులు కూడా ఒక్కరొక్కరూ పార్టీ హైకమాండ్ పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.
ఉద్యమ నేతలను పక్కన పెట్టేసి, ఉద్యమ ద్రోహులకు పెద్ద పీట వేస్తే జనం తిరస్కరించకుండా ఎలా ఉంటారని నిలదీస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వారిని కాదనీ, ఇతర పార్టీల నుంచి కుప్పి గెంతులు వేసి వచ్చిన వారిని అందలం ఎక్కించిన ఫలితమే ఈ పరిస్థితి అని నిర్మొహమాటంగా చెబుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్ చార్జీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పార్టీపై, పార్టీ హైకమాండ్ పై మరీ ముఖ్యంగా అధినేత తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం, ప్రజలకు దూరం కావడం వల్లనే ఎన్నికలలో పరాజయం మూటగట్టుకోవలసి వచ్చిందని తక్కెళ్ల పళ్లి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణవాదం, ఉద్యమం తెలియనివారిని అందలం ఎక్కించడాన్ని ప్రజలు అమోదించలేదనడానికి ఈ ఎన్నికల ఫలితమే నిదర్శనమన్నారు. ఒక ఎమ్మెల్సీ ఏకంగా పార్టీ అధినేతపైనే విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ అధినేతకు పరాజయం తరువాత గతంలోలా పూర్తి పట్టులేదని తేటతెల్లమౌతోందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీలో చీలిక అనివార్యం అన్న దిశగా పరిశీలకుల విశ్లేషణలు సాగుతున్నాయి.