కేటీఆర్ సీఎం ఆశలు గల్లంతు!
posted on Dec 16, 2023 @ 11:56AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తరువాత తొలి సారిగా తెలంగాణలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) యేతర ప్రభుత్వం కొలువుదీరింది. ఇవన్నీ తెలిసిన విషయాలే ఈ చర్విత చరణం ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆయన తన వారసుడిగా కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. అప్పటి నుంచీ కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా మీడియా ముందుకు వచ్చారు. గతంలో ఏ మంత్రీ చేయని విధంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా కేటీఆరే ప్రకటిస్తూ వచ్చారు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ ను సీఎంగా పట్టాభిషిక్తుడు కావడం తథ్యమనే వార్తలు వచ్చాయి.
అందుకు అప్పట్లో ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. దీనిని కేసీఆర్, కానీ కేటీఆర్ కానీ ఖండించలేదు కూడా. దాంతో కేసీఆర్ స్థానంలో కేటీఆర్ పగ్గాలు అందుకుని సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమనే అంతా అనుకున్నారు. అయితే అప్పట్లో వినిపించినట్లుగా కుటుంబ కలహాలో మరో కారణమో కానీ, కేటీఆర్ సీఎం పదవీ పట్టాభిషేక కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. అయితే అప్పట్లోనే పార్టీలో చీలిక భయమో, వ్యతిరేకత వెల్లువెత్తుతుందన్న అనుమానమో.. కేటీఆర్ స్వయంగా తాను సీఎంరేసులో లేనని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు, కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. ముందుగానే కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తూ పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లుతుందనీ, కనుక తొలుత సీఎం ప్రమాణ స్వీకారం చేసి ఆ తరువాత పగ్గాలు కేటీఆర్ కు అప్పగించి ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారనీ పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి.
కానీ తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచిందన్నట్లు ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. దీంతో కేటీఆర్ సీఎం ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. బీఆర్ఎస్ పుంజుకుని భవిష్యత్ లో మళ్లీ అధికారంలోకి వస్తుంది అనుకున్నా.. కేసీఆర్ కు, కేటీఆర్ కు అప్పటి వరకూ పార్టీలో ఇప్పుడున్నంత ఆమోదం, ఆధిపత్యం ఉంటాయా అన్నది అనుమానమే అని అంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా కేటీఆర్ ను పార్టీ ఎమ్మెల్యేలలో అత్యధికులు వ్యతిరేకించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తం మీద కేటీఆర్ ను సీఎంగా చేయాలన్న కేసీఆర్ ఆశ, సీఎంగా పాలన సాగించాలన్న కేటీఆర్ ఆకాంక్ష నీరుగారిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.