మేడిగడ్డ రిపేర్ ఖర్చు ప్రభుత్వానిదే.. స్పష్టం చేసిన ఎల్అండ్ టి
posted on Dec 16, 2023 @ 1:16PM
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఈ మేరకు కాలేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ కు లేఖ రాసింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు కుంగిన సంగతి తెలిసిందే. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటన తీవ్ర నష్టం చేకూర్చింది.
దానిని కవర్ చేసుకునేందుకు అప్పట్లో బీఆర్ఎస్ నేతలు బేరేజి మరమ్మతులకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ భరిస్తుందని చెప్పారు. ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా ఇదే విషయం చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ గడువు ఇంకా ఉందనీ, అందువల్ల మరమ్మతుల వ్యయం మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఇప్పడు కాళేశ్వరం నిర్మాణ సంస్థ అందుకు భిన్నంగా స్పందించింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతంలో మరమ్మతుల బాధ్యత తమది కాదని పేర్కొంటూ ప్రాజెక్టో ఇంజీనీర్ ఇన్ చీఫ్ కు లేఖ రాసింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లైంది. అసలే ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల విషయంలో నిర్మాణ సంస్థ చేతులెత్తేయడంతో అసలు కాంట్రాక్టు విషయంలో లొసుగులు ఏమున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్యారేజీ కుంగిన ప్రాంతంలో పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం కాఫర్ డ్యాం నిర్మించాలి. కాఫర్ డ్యాం నిర్మాణానికి 55 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయం అవుతుందన్న అంచనా.
ఈ మొత్తానికి ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుంటేనే తాము ముందుకు వస్తామని ఎల్ అండ్ టీ కాళేశ్వరం ఈఎన్సీకి లేఖ రాయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. ఇది కాక మరమ్మతులకు రూ. 500 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఆ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేయడంతో మేడిగడ్డ అంశం మరో సారి హాట్ టాపిక్ గా తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసింది.