కొడాలి నానికి కౌంట్ డౌన్ ?.. ఫలించిన చంద్రబాబు వ్యూహం!

ఉమ్మడి కృష్ణా జిల్లా జనం తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ  ఆ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. తెలుగుదేశం  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో తొలి నుండి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనాదరణ ఉంది. జిల్లా పార్టీకి కంచుకోటగా నిలిచింది.  అయితే  2019  ఎన్నికలలో  మాత్రం పార్టీ పట్టు కోల్పోయింది. జిల్లాలో  గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా దెబ్బతింది. అయితే ఈసారి ఎలాగైనా జిల్లాలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో  తెలుగుదేశం బేస్ తిరిగి పొందాలంటే ఇక్కడ ఇద్దరు నేతలను దెబ్బకొట్టాలి. తెలుగుదేశంకు పంటి కింద రాయిలా మారిన ఈ ఇద్దరు నేతల స్థానాలను దక్కించుకోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఆ రెంటిలో ఒకటి గన్నవరం కాగా రెండోది  గుడివాడ. వీటిలో ఒకటి మాజీ మంత్రి కొడాలి నానీ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం అయితే రెండోది  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్థానం. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గన్నవరంలో వల్లభనేనికి టార్గెట్ సెట్ చేసింది. అంగ బలం, ఆర్ధిక బలం ఉన్న యార్లగడ్డ వెంకట్రావును ఇక్కడ రంగంలోకి దిగడంతో  ఇప్పటికే వంశీ ఓటమి ఖాయమైనట్లేనని పరిశీలకులు అంటున్నారు.   ఇక కొడాలి నానీ విషయానికి వస్తే తాజాగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడలో టార్గెట్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. నిజానికి గత ఎన్నికలలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం కోల్పోయిన స్థానాలలో ఎక్కువ శాతం పార్టీలో అంతర్గత విభేదాలే కారణమని పార్టీ శ్రేణులే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా  చెబుతారు. కారణంగా చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు అభ్యర్ధిని మార్చడం, అలాగే టీడీపీ నేతల్లోనే కొందరు ప్రత్యర్ధులకు సాయంచేయటం వంటి కారణాలతో నే జిల్లాలో తెలుగుదేశం ఓటమి పాలైంది. అయితే, ఈసారి అలాంటి అవకాశాలు లేకుండా చంద్రబాబు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గుడివాడ విషయంలో కూడా చంద్రబాబు ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుడివాడ నుండి  తెలుగుదేశం టికెట్ కోసం ఇరువురు నేతల మధ్య పోటీ ఉంది.  వారిలో ఒకరు రావి వెంకటేశ్వరరావు కాగా మరొకరు ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రాము. రావి గత ఎన్నికలలో పరాజయం తరువాత నుంచీ నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని పని చేస్తున్నారు.  ఈ పరిస్థితులలో   వెనిగండ్ల తెలుగుదేశంలో చేరి  సేవా కార్యక్రమాలతో ప్రజలలోనూ, పార్టీలోనూ గుర్తింపు పొందారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందన్నవిషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  అలాగే  ఇరువురిలో ఒకరికి పార్టీ టికెట్ ఇస్తే మరొకరు అసంతృప్తి చెందడం కూడా ఖాయం. అది అంతిమంగా పార్టీకే నష్టం చేస్తుంది.  అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా చంద్రబాబు ఇరువురు నేతలనూ పిలిపించి మాట్లాడి ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేయాలని, టికెట్ దక్కని రెండో  వ్యక్తికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని, అలా ఇద్దరికీ న్యాయం చేస్తాననీ చెప్పి ఒప్పించారు. అయితే గుడివాడలో పార్టీ విజయం సాధిస్తేనే ఇరువురికీ  రాజకీయంగా అవకాశం ఉంటుందని నచ్చచెప్పడంతో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా  గుడివాడ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వెనిగండ్ల పోటీ దాదాపుగా ఖరారైనట్లేననీ, ఇందుకు రావి కూడా అంగీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. . వెనిగండ్ల గెలుపుకు  పూర్తి సహకారం అందిస్తాననీ కూడా రావి చెప్పారంటున్నారు. అలాగే తెలుగుదేశం అధికారంలోకి రాగానే రావికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటున్నారు.   వెనిగండ్ల రాము గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా ఏకాభిప్రాయంతో ఎంపిక కావడమే కొడాలి నానికి సగం పరాజయం ఖరారైపోయినట్లేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వెనిగండ్ల రాము ఆర్ధిక పుష్టి ఉన్న నేతే కాకుండా.. సామజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన రాము భార్య దళితురాలు కావడం కూడా తెలుగుదేశంకు కలిసి వచ్చే అవకాశం అంటున్నారు. మరోవైపు ఇక్కడ వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నానీ మధ్య అంతర్గత కుమ్ములాట వైసీపీకి మైనస్ అవుతుందంటున్నారు. అలాగే కొడాలి నాని వ్యవహారశైలి,  జగన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత తెలుగుదేశంకు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా రాజధాని  అమరావతి ఫ్యాక్టర్ కూడా కొడాలి నానికీ, విజయానికి మధ్య అడ్డుగోడగా నిలుస్తుందని అంటున్నారు.  మొత్తంగా కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందనే అంటున్నారు. 

అనుకూల సర్వే చూసుకుని గెలుపు భ్రమల్లో జగన్?!

ఏపీ అసంబ్లీ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. అన్ని పార్టీలూ ఎన్నికలలో విజయం కోసం వ్యూహ, ప్రణాళికా రచనలో మునిగిపోయాయి. ఎత్తులు, పొత్తులు, సీట్ల సర్దు బాటు వంటి విషయాలపై దృష్టి పెట్టాయి. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం వ్యూహాలు లేక, ప్రణాళికా రచన అన్నదే మరచిపోయి  అనుకూల సర్వేలనే నమ్ముకుంటోంది. ఒకటా రెండో అంతర్గత సర్వేలు, ఐ ప్యాక్ సర్వేలు, అనుకూల సంస్థలతో చేయించుకుని ప్రచారం చేసుకుంటున్న సర్వేలతో గెలుపు భ్రమల్లో విహారం చేస్తోంది.   తాజాగా  వెలువడిన టైమ్స్ నౌ నవజీవన్ ఈటీజీ ఓపినీయన్ పోల్   లోక్‌సభ ఎన్నికలలో  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  పాతిక లోక్‌సభ  స్థానాలకు గానూ  24 నుంచి 25 సీట్లలో అధికార వైసీపి విజయకేతనం ఎగురవేస్తుందంటూ పేర్కొంది. ప్రతిపక్షమైన తెలుగుదేశం మహా అయితే ఒక స్థానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది. నెలల కిందట ఇదే సంస్థ వెలువరించిన సర్వే కూడా మక్కీకి మక్కీ ఇలానే ఉంది. ఏ మార్పూ లేదు. ఇదే సర్వే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి మోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా అవుతారని కూడా చెప్పింది. అది పక్కన పెడితే ఏపీ విషయంలో మాత్రం  టైమ్స్ నౌ సర్వే ఏ మాత్రం విశ్వసించదగ్గదిగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా  జగన్ పాలన పట్ల, ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి ప్రత్యక్షంగా కనిపిస్తుంటే  ఎక్కడో కూర్చుని వండి వార్చిన సర్వేను వదలడం వెనుక  ప్రజలలో గందరగోళం సృష్టించాలన్న కుట్రే కనిపిస్తోందని అంటున్నారు. ఇది పూర్తిగా పెయిడ్ సర్వేగా అభివర్ణిస్తున్నారు. జారిపోతున్న నేతలను, క్యాడర్ ను కాపాడుకోవడం కోసం జగన్మాయలో భాగమే ఈ సర్వే అని అంటున్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో జనసేన, బీజేపీ, ఇతరులకు ఒక్కంటే ఒక్క  సీటు కూడా దక్కదని పేర్కొనడం చూస్తుంటే, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు, రాజకీయ, కుల సమీకరణాలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత మారిన పరిస్థితి, తెలంగాణ ఎన్నికల ప్రభావం,  లోకేష్ పాదయాత్ర పాదయాత్ర,  వంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా సర్వేను వండి వార్చేసిందని అంటున్నారు.  ఒక వైపు టైమ్స్ నౌ సర్వే వచ్చే లోక్ సభ ఎన్నికలలో వైసీపీ పాతికకు పాతిక ఎంపీ సీట్లూ గెలుచుకునే అవకాశం ఉందని చెబుతుంటో మరో వైపు ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడకుండానే జగన్ ఓటమిని అంగీకరించేసి, నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను మార్చేస్తూ తనలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా బయటపెట్టుకుంటున్నారు. తాను ఇంత కాలం బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ములు, సంక్షేమం పేరిట అమలు చేసిన పథకాలు ఏవీ కూడా ప్రజలను రంజింపలేదని గ్రహించిన జగన్, దింపుడు కళ్లెం ఆశగా నియోజకవర్గాలలో కొత్త ముఖాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రజెంట్ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మార్చిన 11 మందే కాకుండా రానున్న రోజుల్లో ఈ జాబితా కొండవీటి చాంతాడంత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ సర్కార్ పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో వెల్లువెత్తుతున్న అసంతృప్తినీ, రాజధాని అమరావతి, ఏపీ జీవనాడి పోలవరం, ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీ కరణ వంటి అంశాలలో జగన్ సర్కార్ నిర్వాకంపై ప్రజాగ్రహం, ఇక అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి, అందుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలపై ఉక్కుపాదం మోపి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉందనిపించేలా అమలు చేసిన ఆంక్షల పట్ల ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని టైమ్స్ నౌ సర్వే కనీసం పరిగణనలోనికి కూడా తీసుకున్నట్లు కనబడటం లేదు. అందుకే పరిశీలకులు టైమ్స్ నౌ సర్వేను ఓ పెయిడ్ సర్వేలా పరిగణిస్తూ పట్టించుకోవడం లేదు. ఎవరో కొత్తగా వచ్చి ఏపీలో వైసీపీ భవిష్యత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనీ, జగనే స్వయంగా తన ప్రభుత్వం మరో సారి అధికారంలోకి రావడంపై ఆశలు వదిలేసుకున్నారనీ, అందుకు నిదర్శనమే మంత్రులు సహా నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు కార్యక్రమమనీ విశ్లేషిస్తున్నారు. 

గజగజలాడుతున్న ఉత్తర భారతం

ఉత్తర భారతం చ లిపులి గుప్పెట్లో చిక్కుకుంది. రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలకు తోడు భారీగా మంచు కురుస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం తదితర రాష్ట్రాలలో  చలి తీవ్రత అధికమైంది. భారీగా మంచుకురుస్తుండటంతో తూర్పు సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆర్మీలోని త్రిశక్తి దళాలు వారిరి ప్రత్యేక ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పు సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులలో  చిన్నపిల్లలు, మహిళలు, వయోవృద్ధులూ కూడా ఉన్నట్లు ఆర్మీ తెలిపింది.  చలీ తీవ్రత తట్టుకోలేక వారిలో పలువురు స్ఫృహకోల్పోయారనీ పేర్కొంది. సురక్షిత ప్రాంతాలకు తరలించిన పర్యాటకులకు ఆహారం, వైద్యం అందిస్తున్నట్లు వివరించింది. 

రాజేంద్రనగర్ లో పేలిన సిలిండర్... ఆరుగురు పరిస్థితి విషమం 

హైదరాబాద్ రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది స్పాట్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం ఈ బేకరీని హైదరాబాద్‌కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. దాదాపు 100 మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూలానే ఉదయం బేకరీ ఫుడ్ తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్‌ పైప్‌ లీక్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు బేకరీ మొత్తం వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఏపీ అంతటా.. ఒకే మాట.. ఏపీ డొంట్ నీడ్ జగన్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో మరో సారి అధికార పీఠం ఎక్కాలని స్కెచ్ వేసుకుంటున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత అంతా తనపైనే ఉందని స్పష్టంగా తెలిసినా, తప్పు పార్టీ ఎమ్మెల్యేలపై నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. బటన్ నొక్కుతున్నందున జనం తన వెంటే ఉన్నారనీ, అయితే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నారనీ చెబుతూ వారిని మార్చేస్తే మళ్లీ అధికారం మనదే అంటూ పార్టీ కార్యకర్తలను నమ్మించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఏకంగా 90 మంది సిట్టింగులను నియోజకవర్గాలు మార్చేయడమో, లేదా  టికెట్ నిరాకరించి వారిని పోటీకి దూరంగా ఉంచడమో చేయాలని డిసైడ్ అయిపోయారు.     అయితే, రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారా?  వారి వ్యతిరేకత కేవలం ఎమ్మెల్యులు, మంత్రుల మీదా? అంటే కాదు అనే సమాధానమే వస్తోంది. జనాగ్రహం అంతా జగన్ మీదే అని వైసీపీ నేతలో గుసగుసలాడుకుంటున్నారు.   ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు తెలియడం లేదో అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఇక ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేసిన తరువాత కూడా జగన్ తాను తప్ప పార్టీలో మిగిలిన వారంతా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న భావనలోనే ఉంటే వైనాట్ 175 కాదు కదా పట్టుమని పాతిక స్థానాలలో కూడా పార్టీ గట్టెక్కడం అసాధ్యమని  వైసీపీలో సీనియర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే విషయం సీఎం ముందుకు తీసుకువెళ్లే ధైర్యం లేక ఆయన అన్నదానికల్లా అవుననీ, చెప్పిన దానికల్లా సై అంటూ తలలాడించేస్తున్నరారు. ఇక ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను సానుకూలంగా ముఖ్యమంత్రి ఆలోచన అంటూ పెద్ద సంఖ్యలో  సిట్టింగులను మార్చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో ఒక్క సారిగా పార్టీలో కట్ట తెగిన గోదారిలా అసమ్మతి భుగభగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి అత్యంత విధేయుడైన ఎమ్మెల్యేయే పార్టీకి రాజీనామా చేసి వైదొలిగారు. ఆయన బాటలో ఇంకింత మంది నడిచే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.   సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు   మళ్ళీ  తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని, జగన్  ఆశ పడుతున్నారు. అయితే., క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని   వైసీపీ నాయకులు వాపోతున్నారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ, సంతృప్తి చెందిన దాఖలాలు    లేవని  గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ప్రస్ఫుటంగా బయటపడిందని చెబుతున్నారు. అయినా  జగన్  ఈ నాలుగున్నరేళ్లలో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే కదా.. తన పాలన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఏదన్నది తెలియడానికి అని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. పరదాల మాటున పర్యటనలు సాగించేసి, హడావుడిగా బటన్ నొక్కేసి వెళ్లడం తప్ప ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నడూ జగన్ చేయలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే జగన్ మరో చాన్స్ అంటుంటే, జనం మాత్రం నో చాన్స్ అంటున్నారని వైసీపీ నాయకులే అంటున్నారు.      మాట తప్పను, మడమ తిప్పాను అంటే నిజమే అనుకుని, అయన వెంట నడిచిన జనాలే ఇప్పడు, జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని చెబుతున్నారు. రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రాని పరిస్థితికి కారణం జగన్ విశ్వసనీయత కోల్పోవడమేనని అంటున్నారు. ఒకసారి కాదు, రెండు మూడుసార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా, పత్రికల ఆఫీసుల నుంచి  అడ్వర్టైజ్మెంట్’ బిల్లులు వస్తున్నాయే, తప్ప టెండర్లు వేసేందుకు  కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇది  ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లు కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు  కొండలా  పేరుకుపోయాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక, కాంట్రాక్టర్లు ఆందోళనలు  చేయడమే కాదు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.  కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు  నామినేషన్ పనులు కేటాయించినా, క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక  చేసిన అప్పులు తీర్చడం అటుంచి వాటికి  వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకుని నష్టపోయిన పార్టీ కేడర్, నాయకులు  నామినేషన్ పనులంటేనే వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ముఖ్యమంత్రి మీద సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు విశ్వాసం లేదనడానికి ఇంతకు మించి నిదర్శనమేం కావాలని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.      వైసీపీ గ్రామా సర్పంచ్‌ లు  గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలై  మీరిఇచ్చిన పదవికో దండం, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.  అలాగే తాజాగా ప్రభుత్వ భూములు  ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాథుడే  కనిపించడం లేదు.  అది కూడా ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్, వైజాగ్ మహానగరంలోనే, ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’లో  సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది  లేక  దరఖాస్తు  గదువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఫలితం లేదు.నో రెస్పాన్స్.. ముఖ్యమత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా వుందని .. మురిసి పొతున్నారు.. ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండగా వుందో, అయన మీద ప్రజల విశ్వసం ఎ స్థాయిలో వుందో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’ ప్లాట్స్ కథే చేపుతోందని అంటున్నారు.  రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయలేదు.చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు.  నిజానికి,  రేపో మాపో రాజదాని అయ్యే నగరంలో స్థలం అంటే, ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకు పోతారు.. కానీ, వైజాగ్’లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా వుంది.. అంటే.. జగన్ రెడ్డి  మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు అందుకే జనం జగన్ ను నమ్మడం లేదని, వైసీపీ నాయకులు అప్పట్లోనే అన్నారు.  ఇలా జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా  ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. మరో చాన్స్ చచ్చినా ఇవ్వమని చెప్పేస్తున్నారు.  మీటలు నొక్కి నోట్లు  వేశాం.. ఓట్లేందుకు  వేయరు  అంటూ సీఎం తమ పేదరికాన్ని చులకన చేస్తున్నారని లబ్ధిదారులు భావిస్తున్నారు.  అందుకే జగన్ కి మరో అవకాశం ఇచ్చేది లేదని తమ ముఖం మీదే చెప్పేస్తున్నారని వైసీపీ క్యాడర్ చెబుతోంది. అందుకే సామాజిక సాధికార యాత్ర వంటి పార్టీ కార్యక్రమాలకు కూడా క్యాడర్ ముఖం చాటేస్తోంది. వైసీపీ క్యాడర్ ఇప్పటికే జగన్ పై ఆశలు వదిలేసుకుంది. పార్టీకి దూరంగా ఉండటమే మేలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ల మార్పు అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు పార్టీని మరింత బలహీనం చేయడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించే అవకాశాలు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రోజాకు నో టికెట్? నగరిలో వ్యతిరేకత నెపమా.. నిజమా?

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు ముసలం మొదలైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఈసారి ఎన్నికలలో భారీగా సిట్టింగులను మార్చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ సర్కార్ ప్రజలలో భారీ అసంతృప్తిని మూటగట్టుకోగా.. ఇప్పుడు సిట్టింగుల మార్పుతో ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానంపై రివర్స్ అవుతున్నారు. కానీ, ఇవేమీ లెక్కచేయకుండా జగన్ మాత్రం నియోజకవర్గాల ఇంచార్జిలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది నియోజవర్గాల ఇన్ చార్జిలను మార్చేయగా.. ఈ  మార్పు పరంపర ఇక్కడితో ఆగదనీ కొనసాగుతుందనీ  వైసీపీ వర్గాలే బహిరంగంగా చెప్తున్నాయి. ఇంకా చాల మంది ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలను మార్చే ఉద్దేశంలో జగన్ ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ సంఖ్య 90 వరకూ వెళ్తుందని కూడా  అంటున్నారు. దీనికి తోడు కొందరికి అసలు సీట్లు కేటాయించే పరిస్థితి కూడా లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ టికెట్లు దక్కని జాబితాలో సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఉన్నారని  అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి వ్యూహాలను అందించే ఐ ప్యాక్ సంస్థతో పాటు వైసీపీ సొంత సర్వేల ఫలితాల ఆధారంగా.. పనితీరు సరిగాలేని వారిని జగన్ పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న ప్రాంతాలలో క్యాండిడేట్లను మార్చేస్తుండగా.. అసలు క్యాండిడేట్లపైనే అసంతృప్తి ఉంటే వాళ్ళని నిర్ధాక్షణ్యంగా పక్కన పెట్టేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొందరు మంత్రులకు, మాజీ మంత్రులకు ఈసారి టికెట్ లేనట్లే అనే ప్రచారం సాగుతున్నది. ఇందులో  ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, మంత్రి రోజా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రోజాపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి స్థానిక రాజకీయ పరిస్థితులు, సొంత పార్టీలో కుమ్ములాటలు తోడై  ఈసారి టికెట్ దక్కే అవకాశాలు లేనట్లేనని వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మంగళగిరి ఆర్కే లాంటి ఇష్టుడైన నేతను కూడా వదులుకున్న జగన్.. రోజాను పక్కన పెట్టేయడం పెద్ద వింతేమీ కాదని.. దీనికి తోడు వైసీపీలో రెండో స్థానంలో కొనసాగుతున్న పెద్దిరెడ్డితో వైరం కూడా రోజాకు టికెట్ లేకుండా చేసిందని పేర్కొంటున్నారు. నిజానికి ఏపీ రాజకీయాలలో రాష్ట్రం మొత్తం ఒక లెక్క.. ఉమ్మడి చిత్తూరు జిల్లాది మరో లెక్కగా చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాతో పాటు వైసీపీలో పెద్దిరెడ్డి లాంటి నేతది అదే జిల్లా కావడంతో ఇక్కడ రాజకీయాలెప్పుడూ  హాట్ హాట్ గా  హీటెక్కి ఉంటాయి. అందునా  వైసీపీలో పెద్దిరెడ్డికి తెలియకుండా ఈ జిల్లాలో ఏదీ జరగదు. అందుకే పెద్దిరెడ్డి ఆశీస్సులు లేకపోతే ఇక్కడ ఎవరికైనా సీట్ లేనట్లే.  అలాంటిది రోజాకు పెద్దిరెడ్డికి మధ్య మనస్పర్థలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మనస్పర్థల కారణంగానే రోజా సొంత నియోజకవర్గం నగరిలో కూడా చాలా కాలంగా రాజకీయంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే నగరి వైసీపీలో ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా మరో వర్గం కూడా తయారైంది. స్వపక్షంలోనే ప్రత్యర్థులు రోజాపై కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్లు నిత్యం రోజాపై విమర్శల దండయాత్ర చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికలలో రోజా నగరి నుండి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం అన్న అభిప్రాయం పార్టీ అధినేతలో కలిగింది.   అందుకే ఇప్పుడు రోజాను నగరి నుండి బయటకి పంపేయాలని  ఆయనో  నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. పోనీ జిల్లాలో మిగతా స్థానాల్లో అవకాశం ఉంటుందా అంటే జిల్లా వ్యాప్తంగా రోజాపై వ్యతిరేకతే కాకుండా.. మంత్రి పెద్దిరెడ్డి కూడా వ్యతిరేకించడంతో ఆ చాన్స్ కూడా లేకుండా పోయిందంటున్నారు.  రోజాను పూర్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాను వీడి నెల్లూరు పంపాలని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి వైసీపీలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి వంటి వారు తెలుగేదేశంలో చేరిపోవడంతో.. ఇప్పుడు నెల్లూరు వైసీపీలో  నాయకత్వ సూన్యత కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే రోజాను నెల్లూరు పంపించాలని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో భావిస్తున్నట్లు ప్రచారం ఉంది. అయితే  నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి వారు రోజా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతకు తోడు రోజాపై వ్యతిరేకత కూడా కలిసి తమ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని నెల్లూరు జిల్లా నేతలు భయపడుతున్నారని అంటున్నారు.  దీంతో రోజాను నెల్లూరుకు బదలాయించవద్దని జగన్ కు మొరపెట్టుకున్నారని కూడా చెబుతున్నారు.  దీంతో   రోజాకు ఈసారి ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కడం కష్టమేనని, ఈ విషయాన్ని ఆమెకు పార్టీ హైమాండ్ తెలియజేసి , పార్టీలో  గౌరవప్రదమైన పదవి ఇస్తామనీ ప్రతిపాదించినట్లు కూడా చెబుతున్నారు. 

మంత్రి సీతక్క చాంబర్ లో స్మితా సభర్వాల్ ప్రత్యక్షం

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ గురించి తెలియని వారు వుండరు ..ప్రభుత్వం మారిన తరువాత కొత్త సీఎంను ఇప్పటి వరకూ కనీసం కలవని ఆమె గురువారం (డిసెంబర్ 14) హఠాత్తుగా మంత్రి సీతక్క చాంబర్ లో ప్రత్యక్షమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత   సంప్రదాయాన్ని పాటించి  కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపాల్సిన బాధ్యతను కూడా విస్మరించిన స్మితా సభర్వాల్ డెప్యుటేషన్ పే కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ గా తాను రాష్ట్రంలోనే ఉంటానని స్మితా సభర్వాల్ స్పష్టత ఇచ్చారు.  కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత స్మితా సభర్వాల్ రేవంత్ ను కలవకపోవడమే కాదు, ఆయన ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షకు కూడా డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. దీంతోనే ఆమె కేంద్ర సర్వీసులకు వెడుతున్నారన్న వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన స్మితా సభర్వాల్  సీతక్క మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె ఛాంబర్ కు వచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టని సీతక్కను అభినందించారు. పోనీ సీతక్క ఇరిగేషన్ మంత్రి కనుక స్మతి ఆ కార్యక్రమానికి హాజరయ్యారనుకునేందుకు లేదు. ఎందుకంటే సీతక్క మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి.  దీంతో సీఎంను కలవకుండా ముఖం చాటేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసి అభినందనలు తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.

విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆసుపత్రి రెండో అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ మార్గం గుండా పలువురు రోగులను బయటకు తీసుకొచ్చారు.ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో మొదట మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆస్పత్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆస్పత్రి భవనంలో ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో మొత్తం 52మంది రోగులు ఉన్నట్లు గుర్తించారు.ఆపరేషన్ థియేటర్లలో ఉన్న నైట్రస్ ఆక్సైడ్‌ పేలుళ్లు జరగడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఐసీయూలలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఫైర్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్ సిబ్బంది వేగంగా స్పందించడంతో భవనంలో ఉన్న వారిని కాపాడారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్నవారిని కూడా ఫైర్ సిబ్బంది తరలించారు. రెండో అంతస్తులో మంటలు అదుపు రాలేదని, మొదటి, మూడో అంతస్తులో ఉన్న రోగులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి  గృహ ప్రవేశం 

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో కూడా పూజలు చేశారు.కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.  ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వేద పండితుల మంత్రాల మధ్యలో తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తన కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైళ్లను అందజేశారు కార్యదర్శులు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో భట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

హోదా ఏదీ?.. ఢిల్లీలో మళ్లీ గళమెత్తిన చలసాని!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రత్యేక హోదా సాధన విద్యార్థి, యువజన రాష్ట్ర ఐకాస నాయకులు మరోసారి ఢిల్లీలో గళం వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో దిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, విద్యార్థి యువజన జేఏసీ నేత కన్వీనర్ షేక్ జిలాని పలువురు పాల్గొన్నారు. ఢిల్లీలో ధర్నాతో పాటు అంతకు ముందే చలసాని నేతృత్వలో  సిపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువురు జాతీయ నేతలను కూడా కలిశారు.   ధర్నాలో పాల్గొన్న ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భావితరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా విభజన హామీలన్నీ అమలు కావాలని, దాని అమలు కోసం ఉద్యమించని వాళ్ళు ఆంధ్ర ద్రోహులేనన్నారు. విభజన హామీల అమలు కోసం ఎక్కడా గడువులు పెట్టలేదని గుర్తు చేశారు.  అలాగే 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. భావితరాలకు అవసరమైన విషయాలను విస్మరించి ప్రతిపక్షనేతలపై కక్షసాధింపుపై దృష్టి పెట్టడం అన్యాయం, రాష్ట్రానికి నష్టం అని విమర్శించారు. ప్రధాని మోడీ ఏపీ ప్రధాన రాజకీయ నాయకులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తోలు బొమ్మలాటలు ఆడిస్తున్నారని, అది మంచిది కాదని చలసాని అన్నారు. 2019 ముందే కాదు తరువాత కూడా ఏ రోజూ తమ ఉద్యమం ఆపలేదని చలసాని గుర్తు చేశారు. నిజానికి ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే కాదు.. విభజన అనంతరం ఏపీకి దక్కాల్సిన హామీల అమలుపై చలసాని ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నారు. విజయవాడ, విశాఖ లాంటి ఏపీలోని ప్రధాన నగరాలతో పాటు ఢిల్లీలో కూడా పలుమార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హోదా కావాలంటూ పదే పదే ఢిల్లీలో వచ్చి కేంద్రాన్ని అడుక్కోలేమని.. కావాలంటే ప్రధాని మోడీ ఏపీ ప్రజల రక్తాన్ని తీసుకొని హోదా ఇవ్వాలని గతంలో సంచలన ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేక హోదా అనేది తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని, కేంద్ర పెద్దలు ఆ ఆత్మగౌరవంపై ప్రతిసారి దెబ్బకొడుతున్నారంటూ పలుమార్లు ఢిల్లీలో గళం వినిపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రత్యేక నిధులు ఇలా విభజన హామీలపై చలసాని శ్రీనివాస్ గత పదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.  రాజధాని అమరావతిపై కూడా చలసాని పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించి.. హామీని మరవడంపై చలసాని తొలి నుండి గళమెత్తుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు  ఢిల్లీలో మరోసారి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణ చేపట్టారు. అటు జాతీయ స్థాయి నేతలతో పాటు తెలంగాణ నేతల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే క్రమంలో గత నాలుగేళ్లుగా జగన్ సర్కార్ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టడంపై కూడా సమయం వచ్చిన ప్రతిసారి విమర్శిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తున్న చలసానిపై పలుమార్లు పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టారు. చలసాని నిరసనలకు అనుమతిచ్చేది లేదంటూ ఆంక్షలు విధించారు. కానీ, ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదంటూ చలసాని తమ పోరాటాలను సాగిస్తున్నారు. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి ఉద్యమ బాట పట్టారు. మరి కేంద్రం ఈ పోరాటం, ప్రత్యేక హోదాపై ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇక చలసాని అయితే ఓ పైవు ఏపీ భవిష్యత్ క్రాంతి, కాంతి అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే మరో వైపు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.  విజయవాడ నగరంలో  నిరంతరాయంగా 24 గంటలు చల్లటి మినరల్ వాటర్ అందించడంతో పాటు  విజయ బ్రాండ్ మజ్జిగ పంపిణీ,  ప్రతి శనివారం, ఇతర ముఖ్యదినాల్లో అన్నదానం కార్యక్రమాలను తన  కుమార్తె శిరీష్మా జ్ఞాపకార్థం సొంత వ్యయంతో  నిర్వహిస్తున్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తూనే, పేదల కోసం సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న చలసానిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

రాయదుర్గం- శంషాబాద్ మెట్రోపనుల నిలిపివేత

మెట్రో విస్తరణ పనులు, అలైన్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయదుర్గం-ఎయిర్‌‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను సీఎం ఆరా తీశారు.  ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్నందున రాయదుర్గం - శంషాబాద్ విమానాశ్రయం పనుల టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. చాంద్రాయాణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం రూట్‌తో పాటూ చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం మార్గాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకు ఏది ఖర్చు తక్కువైతే దానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఈ రూట్లతో తూర్పు, మధ్య, పాతబస్తీ వాసులకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఔటర్ రింగ్‌ రోడ్‌ వెంట గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంపై సీఎం సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. కొత్తమంది రియల్టర్లకు మేలు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-శంషాబాద్‌ ప్లాన్‌కు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి బదులుగా ఓల్డ్‌ సిటీని అనుసంధానిస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జెబిఎస్ -ఫలక్‌నుమా కారిడార్‌ పూర్తి చేసి పహాడీ షరీఫ్‌ మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లక్డీకపూల్‌, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మరో లైన్‌ నిర్మించే అవకాశాలున్నాయి. ఈ ప్లాన్‌లో ఓల్డ్‌ సిటీలోని మెజార్టీ ప్రాంతాలతో పాటు టెక్‌ కారిడార్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.హైదరాబాద్‌ అభివృద్ధిపై వారితో చర్చించారు. ఐటీ కారిడార్‌, శంషాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు, వారి బంధువులకు ఎక్కువగా ఏ రూట్‌ ఉపయోగపడుతుందో చూడాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్‌ రోడ్‌ వెంట గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంపై సీఎం సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. కొత్తమంది రియల్టర్లకు మేలు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ విధానంలో నిర్మించేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.7 వేల కోట్లు ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా.. ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్టును దక్కించుకుంది.

వైసీపీలో రివోల్ట్.. జగన్ పట్టు జారిందా?

అహంకారం, అహంభావం, మితిమీరిన పెత్తనం వైసీపీలో ఎవరికీ ఊపిరాడకుండా చేస్తోందా. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా? ఇంకెంత మాత్రం అహంకారాన్నీ, అహంభావాన్ని, పెత్తనాన్నీ భరించేది లేదంటూ వైసీపీ నేతలు తిరుగుబాటుకు రెడీ అయిపోతున్నారా? అంటే జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే పార్టీకీ, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఇప్పుడు జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన మోపిదేవి వెంకటరమణ కూడా ఆత్మీయ సమ్మేళనాలు, వెంకన్న దర్శనాల తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారంటూ వస్తున్న వార్తలు కూడా వైసీపీలో ఇక ఎంత మాత్రం జగన్ ఆధిపత్యాన్ని అంగీకరించి, ఆమోదించి ఆయన అడుగులకు మడుగులొత్తే పరిస్థితి లేదని తేల్చేస్తున్నాయని అంటున్నారు.  జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి సిట్టింగులను మార్చేస్తే సరిపోతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలకు ఇప్పుడు తిరుగుబాటు భయం పట్టుకుంది. అసలు ప్రజా వ్యతిరేకత ఉన్నది జగన్ పైనేననీ, ప్రజలంతా జగన్ ను వ్యతిరేకిస్తుంటే.. ఆయన మాత్రం తమ రాజకీయ భవిష్యత్ ను ఫణంగా పెట్టి సేఫ్ అవుదామని చూస్తున్నారనీ పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో విస్పష్టంగా చెబుతున్నారు. దాదాపు 90 నియోజకవర్గాలలో సిట్టింగులను మార్చాలన్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పార్టీలో  పెద్ద కుదుపునకు దారి తీసింది. ఇంత కాలం అవమానాలను మౌనంగా భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇక తమ వల్ల కాదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సరిగ్గా ఇదే రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మొత్తం మార్చేసే పరిస్థితికి దారి తీసింది. సొంత ఆలోచన అంటూ లేని జగన్ తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ప్రజా వ్యతిరేకత అంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే అన్న నిర్ణయానికి వచ్చేసి, వారిని మార్చేస్తే మనం సేఫే అన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. అందుకే దాదాపు 90 నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తే సరిపోతుందని భావించి ఆ దిశగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అయితే జగన్ నిర్ణయం మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. పార్టీలో ఒక్క సారిగా అసమ్మతి భగ్గుమంటున్నది. నిన్న మొన్నటి దాకా జగన్ మీద ఈగ వాలితే సహించలేమన్నట్లుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు వారే జగన్ ను ధిక్కరిస్తున్నారు? పార్టీని వదిలేయడానికి కూడా వెనుకాడటం లేదు.   జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, ఇప్పుడు మోపిదేవి అసమ్మతి రాగం ఆలపించడం, అలాగే సమీప బంధువు బాలినేని తనకు తానే ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించేసుకోవడం ఇవన్నీ జగన్ కు పార్టీపై పట్టు సడలిందన్నడానికి నిదర్శనాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పనిలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తమ్ముడిని మంత్రిని చేస్తానని, స్వయంగా జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబుపై కేసులు వేయించడంలో ఆళ్లను ప్రోత్సహించారు. అటువంటి ఆళ్లకు దక్కిన మర్యాద  పార్టీలోని ఇతరులను కూడా ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు.     తెలంగాణ ఎన్నికల ఫలితాలు దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికలకు ముందు దాదాపు 90 మంది సిట్టింగులను మార్చాలని నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై  పార్టీలో బహిరంగంగానే  అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా  ఇన్చార్జిలను మార్చిన చోట్ల ఇప్పటికే అసమ్మతి అగ్గి రాజుకుంది.  మొత్తంగా వైసీపీలో ఇక అసమ్మతి, అసంతృప్తి దాపరికం లేకుండా బహిర్గతమయ్యాయి. ముందు ముందు ఇవి మరింత ఎక్కువగా పార్టీని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

జగన్ లో ఓటమి భయం.. సిట్టింగులను మార్చేస్తే పోతుందా?!

ఏపీలో అధికార పార్టీ ఇప్పుడు ఓటమి భయంతో వణికిపోతోంది. అంతో ఇంతో అభివృద్ధి, సంక్షేమం అమలు చేసిన మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వగా.. అసలు అభివృద్ధి అన్నది బూతద్దం పెట్టి వెతికినా కనిపించని ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్ప మరో మార్గమే లేదని  రాజకీయ పరిశీలకులు ఎప్పుడో తేల్చేశారు. వ్యూహకర్తలుగా ఉన్న ఐ ప్యాక్ లాంటి సంస్థ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ఇక ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదనీ తేల్చేసినట్లు కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలనే ఉద్దేశమో లేక దింపుడు కళ్ళం ఆశల భ్రమలో కానీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే రానున్న ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసే పని మొదలు పెట్టింది. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో ఈ జంబ్లింగ్ ఆట మొదలు పెట్టిన వైసీపీ.. మొత్తంగా 90కి పైగా స్థానాలలో ఈ స్దాన భ్రంశం స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఉరుములు లేకుండానే  పిడుగులు పడ్డట్లు ఉన్నపళంగా తాజాగా వైసీపీ 11మంది అసెంబ్లీ అభ్యర్థులను మార్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఇష్టుడైన నాయకుడిని కూడా జగన్ నిర్ధాక్షణ్యంగా వదులుకున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలే టార్గెట్ గా తమ తమ నియోజకవర్గాలలో పని మొదలు పెట్టిన నేతలను కూడా మార్చేశారు. అయితే ఇది శాంపిల్ మాత్రమేననీ,  త్వరలోనే ఇది పూర్తిస్థాయి కార్యాచరణ కాబోతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 90కి పైగా సీట్లలో సిట్టింగులను మార్చనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ 90 మందిలో మాజీ మంత్రులు, మంత్రులు, మహా మహా సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కడికక్కడ అసంతృప్తి ఎక్కువగా ఉన్న స్థానాలలో ప్రజలకు ఫ్రెష్ పేస్ కనిపించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకూ.. చిత్తూరు నుండి కృష్ణ జిల్లా వరకూ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పుపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, జిల్లాల వారీగా వైసీపీలో మారనున్న స్థానాలివేనంటూ ఓ జాబితా  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జాబితా ప్రకారం చూస్తే.. ఏలూరు జిల్లా పరిధిలో చింతలపూడి, పోలవరం, ఉంగటూరు.. మచిలీపట్నం జిల్లాలో అవనిగడ్డ, పెడన.. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేటలో అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్.. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరిపేట.. బాపట్ల జిల్లాలో రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు స్థానాలలో మార్పు తప్పదని చెప్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అమలాపురం జిల్లాలో అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం, రాజమండ్రి సిటీ, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తాడేపల్లిగూడెం, ఉండి స్థానాల అభ్యర్థులను మార్చనున్నారని తెలుస్తోంది.   ప్రకాశం జిల్లాకు వస్తే దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం.. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు సీట్లలో మార్పులు ఖాయమని తేలుతోంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు.. రాజంపేట జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట.. కడప జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం.. కర్నూలు జిల్లాలో కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ.. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు.. సత్యసాయి జిల్లాలో హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి.. అనంతపురం జిల్లా సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థుల మార్పు ఖాయమని చెబుతున్నారు.  ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల.. విజయనగరంలో రాజాం, బొబ్బిలి.. విశాఖ జిల్లాలో గాజువాక, విశాఖ సౌత్.. అనకాపల్లి జిల్లాలో పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అరకు జిల్లాలో అరకు, పాడేరులో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా మరో పాతికకు పైగా స్థానాల మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయట. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు కూడా పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనీ, ఆమెకు పార్టీలో ఏదో ఒక గౌరవ ప్రదమైన హోదా కల్పించేందుకు ఆమెకు హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద జగన్ ఓటమి భయం నుంచి బయటపడేందుకు సిట్టింగుల మార్పుతో  నేలవిడిచి సాము చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ?

తెలంగాణ శాసనసభా స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌  నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌కు కావాల్సిన బలం ఉన్నందున స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక లాంఛనం కానుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉన్నందున స్పీకర్‌ పదవిని గడ్డం ప్రసాద్‌ సమర్ధవంతంగా నిర్వహిస్తారని  కాంగ్రెస్‌ భావిస్తోంది.అధికార కాంగ్రెస్‌ పార్టీకి 64మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది, సాధారణ మెజారిటీ కావడంతో సభా నిర్వహణ అత్యంత కీలకం కాబోతోంది. గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యాక స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. స్పీకర్‌ ఎన్నికకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో గడ్డం ప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, ఎల్లుండి ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. డిసెంబర్ 16న గవర్నర్‌ ప్రసంగానికి  తెలంగాణ శాసనసభ ధన్యవాదాలు తెలపనుంది. కాగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్ సి వర్గానికి చెందిన వారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ పదవిని అధిరోహించిన ప్రతిభా భారతి ఎస్ సి వర్గానికి చెందిన వారే. తాజాగా గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఎస్ సి వర్గానికే చెందిన వారు కావడం గమనార్హం.

మల్లు భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్‌

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ… ప్రగతి భవన్ ను గడీగా పోల్చింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించింది. అయితే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.  ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చేసింది. ఇది ప్రజా భవన్‌గా మారిన తర్వాత చాలాకాలంగా ఇక్కడ ఉన్న ఇనుప కంచెను తొలగించారు. సామాన్య ప్రజలు వచ్చేలా ప్రజా దర్భార్ కేంద్రంగా మార్చారు. మొదటి రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఇక తర్వాత… ప్రతిరోజూ ఒక మంత్రి స్వయంగా… ప్రజాదర్భార్ లో పాల్గొని… ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఇక గత ప్రభుత్వంలో… ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది.మరోవైపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఇక్కడ్నుంచి కార్యకలాపాలను నిర్వహించే ఆలోచనలో లేరని తెలుస్తోంది.సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే… డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ ను కేటాయించటంతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వినియోగించటం దాదాపు ఖాయమని తెలుస్తోంది.ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతాపరంగా అనుకూలంగా ఉంది. వాహనాల పార్కింగ్‌కూ అనుకూలంగా ఉంది. దీంతో ఇక్కడే ఉండాలని చాలామంది సీఎం రేవంత్ రెడ్డికి సూచించారని చెబుతున్నారు.

మల్లారెడ్డికి ఊహించని షాక్

తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేసిన మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్‌పేట్ తహశీల్దార్ పై సైతం కేసు నమోదు అయ్యినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలోనూ మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితులు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్‌లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి మీద ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు  చేశారు. మల్లారెడ్డి స్టేజి ఎక్కితే జోకర్ స్టేజి దిగగానే బ్రోకర్ గా మారిపోతారన్నారు. మల్లారెడ్డి కూడా రేవంత్ ని అంతే తీవ్రతతో విమర్శించారు. ఈ ఎన్నికలలో అధికార మార్పిడి జరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. గత ప్రభుత్వంలో కూడా మల్లారెడ్డిపై భూ కబ్జా ఫిర్యాదులు వచ్చినప్పటికీ మాజీ మంత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసి తన మార్కును నిరూపించుకుంది. 

జగన్మాయ.. రెడ్లకే రెడ్ కార్పెట్!

ఏపీలో కూడా ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రతిసారి ఎన్నికల సమయానికి కొత్త వారు, రాజకీయ వారసులు ప్రత్యేక్ష రాజకీయాలలోకి రావడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇలాగే ఏపీ అధికార పార్టీ వైసీపీలో కూడా ఇప్పుడు కొందరు సీనియర్ నేతల వారసులు కూడా రానున్న ఎన్నికల సీట్లు ఆశిస్తున్నారు. అయితే, వారిలో కొందరికి  ఔను కొందరికే.. అదీ సీఎం సామాజిక వర్గానికి చెందని వారికే నిరాశే మిగులుతున్నది. అలా నిరాశ చెందిన వారిలో  ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు మోపిదేవి రాజీవ్, పేర్ని కృష్ణమూర్తి. పేర్లు చదవగానే వారెవరో అర్ధమైపోతుంది. ఔను సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్, మాజీ మంత్రి పేర్ని నానీ కుమారుడు కృష్ణమూర్తి. ఈ ఇద్దరూ వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. ఈ వారసుల కన్నా వారి తండ్రులే ఎక్కువగా వారసులను రంగంలోకి దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే, ఈసారి ఈ ఇద్దరికీ సీట్లు కేటాయించడం కష్టమేనని తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఇటు మోపిదేవి, పేర్ని నానీ అసంతృప్తిలో ఉన్నట్లు వైసీపీలో చర్చ జరుగుతుంది. మోపిదేవి అయితే బహిరంగంగానే అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. గత ఎన్నికలలో గుంటూరు జిల్లా రేపల్లె నుండి పోటీ చేసిన మోపిదేవి ఓడిపోయారు. అయితే, వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చి మంత్రిని చేసింది. ఆ తర్వాత శాసన మండలి రద్దు అంటూ సీఎం జగన్ హడావుడి చేసి అనంతరం వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే, మండలి రద్దు సమయంలో మోపిదేవిని రాజీనామా చేయించి రాజ్య‌స‌భ‌కు పంపించారు. కాగా, రాబోయే ఎన్నికలలో మోపిదేవి పక్కకి తప్పుకొని రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న కుమారుడిని రంగంలోకి దింపేందుకు చ‌ర్య‌లు ప్రారంభించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కి వంటి పార్టీ కార్య‌క్ర‌మాలలో మోపిదేవి కుమారుడు రాజీవ్ జోరుగా పాల్గొంటూ కనిపించాడు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు రాజీవ్ పనిచేస్తున్న రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో మోపిదేవి ఇప్పుడు అలకపాన్లు ఎక్కినట్లు తెలుస్తుంది. పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించాలని ప్రయత్నించినా ఆయ‌న ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.   ఈవూరు గణేష్ నియామకాన్ని వ్య‌తిరేకిస్తున్న మోపిదేవి వర్గం రేపల్లెలో ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. పలువురు వైసీపీ కౌన్సిలర్ల రాజీనామాకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తాడేపల్లిలోని ఓ హోటల్ వద్ద ప్రభుత్వ  ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసిన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య  ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును తిరిగి ఇంచార్జిగా ప్రకటించాలని కోరారు. మోపిదేవిని స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తామని సజ్జల వివరించబోయినా.. ముందు మోపిదేవిని ఇంచార్జిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి, కాపు నేత పేర్ని నానీది కూడా ఇలాంటి పరిస్థితే. బందరు నియోజకవర్గం నుండి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కృష్ణమూర్తి రెండు మూడేళ్లుగా జనాల్లో తిరుగుతున్నాడు. నానీ ఇక్కడ నుండి ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించగా.. కుమారుడు కోసం బందరు సీటుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఇక్కడ నుండి బీసీ అభ్యర్థికి ఈసారి టికెట్ ఇవ్వాలని పరిశీలిస్తుంది. దీంతో నానీకి, ఆయన కుమారుడు రాజీవ్ కి ఈసారి టికెట్ లేనట్లేనని ఖరారైంది.  అయితే, ఇప్పుడు ఇలాంటి సీనియర్ నేతల వారసులను పరిగణలోకి తీసుకొని జగన్.. తమ సొంత సామాజికవర్గ నేతల వారసులకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతుంది. ఉదాహరణకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే.. తిరుపతి తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. చంద్రగిరికి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా కూడా మోహిత్ రెడ్డినే ఉండగా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమైంది. అలాగే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నుండి పోటీ చేయడం ఖరారైంది. మరోవైపు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా అధికారులంతా సొంత సామజిక వర్గమే కాగా.. సొంత సామజిక వర్గ నేతలకే పదవులు దక్కుతున్నాయి. ఇప్పుడు వారసులు కూడా సిద్ధమయ్యారు. కానీ, మిగతా సామజిక వర్గాల వారసులకు మాత్రం ఈ అవకాశం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్మోక్ బాంబులతో లోక్ సభలో అగంతకుల దాడి.. కొత్త పార్లమెంటులో భద్రత డొల్లేనా?

దేశ అత్యున్నత చట్ట సభ అయిన లోక్ సభకు భద్రత డొల్లేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ఆధునిక సాంకేకిత పరిజ్ణానంతో, పటిష్ఠ భద్రతతో నిర్మించామనీ, వచ్చే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా  నిర్మించామని చెప్పుకుంటున్న పార్లమెంటు భవనంలో  అగంతకులు స్మోక్ బాంబులతో చెలరేగిపోయారు. శీతాకాల సమావేశాలలో భాగంగా బుధవారం (డిసెంబర్ 13) లోక్ సభలో  జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఓ ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీలోనుంచి నేరుగా సభలోకి దూకారు. తరవాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. కలర్ స్మోక్ ప్రయోగించడంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు సభలోనే ఉన్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంపీలకు చాలా సమయం పట్టింది. ఓ దండగుడు లోక్ సభపైనే దాడి చేసినట్లుగా గుర్తించారు.  సరిగ్గా 22 ఏళ్ల కిందట   ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. ఆ దాడి జరిగిన డిసెంబర్ 13నే  ప్రస్తుతం సభలో టియర్ గ్యాస్ దాడి జరగడం యాథృచ్ఛికమా? లేక రెంటికీ ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నాడు ఉగ్రవాదులు మారణాయుధాలతో దాడి చేస్తే ఇప్పుడు ఇద్దరు ప్రాణాహాని కలిగించే ఆయుధాలను ఉపయోగించలేదు. కేవలం సంచలనం సృష్టించడమే లక్ష్యం అన్నట్లుగా ఈ దాడి ఉంది. అన్నిటికీ మించి   దాడికి పాల్పడిన నీలం కౌర్, షిండే అనే  ఈ ఇద్దరు  తానా షాహీ బంద్ కరో..  జై భీమా.. భారత్ మాతాకీ జై అంటూ  నినాదాలు చేశారు. వీరిరువురూ కూడా  మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప సింహ పాసులతో విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు. ఈ ఇద్దరూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. మొత్తం మీద మోడీ తన మానస పుత్రికగా పేర్కొని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివర్ణించిన సెంట్రల్ విస్టాలో భద్రతా వైఫల్యం ఈ సంఘటనతో ప్రస్ఫుటంగా బయటపడింది.