కేసీఆర్ సలహాదారులు ఇలా చేశారేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేసీఆర్ అన్నీ నేనే.. అంతా నేనే అన్నట్లుగా వ్యవహరించారు. ఏ విషయంలోనైనా సరే తనంతటి వాడు లేడన్న భావనే వ్యక్త పరిచారు. అందుకు ఆయన పార్టీ బీఆర్ఎస్ నేతలు వంత పాడేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తీసుకున్నా, మరే విషయం తీసుకున్నా కేసీఆర్ తీరు, ధోరణీ ఇలాగే ఉండేది. ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్ల కంటే తానకే ఎక్కువ తెలుసునని కసీఆర్ భావించే వారు. సామాజిక ఇంజనీర్ ను తానేననే వారు.  అలా చెప్పుకున్న ఆయన తన హయాంలో 12 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నారు. అధికారంలో ఉండగా అలా సలహాదారులుగా ఎవరినైనా నియమించుకునే అధికారం, వెసులుబాటు ఆయనకు ఉంది. దానిని ఎవరూ కాదనలేదు. కానీ అలా నియమితులైన సలహాదారులు ప్రభుత్వం మారగానే హుందాగా రాజీనామా చేసి తప్పుకోవడం విధాయకం. ఆనవాయితీ. పైగా కేసీఆర్ నియమించిన లేదా నియమించుకున్న సలహాదారులు అలాంటి ఇలాంటి వారు కాదు. వారు కేసీఆర్ కు మామూలు ఫ్యాన్స్ కాదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్. సోమేష్ కుమార్ విషయమే తీసుకుంటే.. ఆయన ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తి అయినా చివరి వరకూ తాను కేసీఆర్ వద్దే పని చేస్తానని కోర్టుల వరకూ కూడా వెళ్లారు. చివరికి ఏపీకి రాక తప్పలేదు అది వేరే విషయం. కోర్టు తీర్పు మేరకు ఏపీలో రిపోర్ట్ చేసినా అక్కడ ఆయన పని చేసింది లేదు. సరే అది పక్కన పెడితే.. ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలిగాకా సోమేష్ కుమార్ ను సీఎం సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన ఒక్కరే కాదు తనకు నమ్మకమైన, తనకు సహకరించిన పెద్దలను ప్రభుత్వ సలహాదారులుగా  కేసీఆర్ నియమించుకున్నారు. ఇక్కడ ప్రశ్న ఆయన సలహాదారులుగా నియమించుకున్న వారు ఆ హోదాలో, ఆ పదవిలో చేసినదేమిటన్నదే. వాళ్లు ఏం చేశారన్నది ఒకటైతే.. ఒక ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు, ఆ ప్రభుత్వం మారగానే ఆ పదవి నుంచి వారంతట వారు వైదొలగడం ఒక సంప్రదాయంగా వస్తున్నది. కానీ కేసీఆర్ నియమించుకున్న సలహాదారుల రూటే సెపరేటు. వారిని కొత్త ప్రభుత్వం తొలగించే వరకూ ఆ పదవులనే పట్టుకు వేళాడారు. కేసీఆర్ నియమించుకున్న ప్రభుత్వ సలహాదారులలో ఏడుగురిని ఆ పదవుల నుంచ తొలగిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడుగురూ ఎవరంటే..   వారు రాజీవ్‌ శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు). అనురాగ్‌ శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఎకే ఖాన్‌ (మైనారిటీ సంక్షేమం), జీఆర్‌ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్‌. శోభ (అటవీ సలహాదారు), సోమేష్‌ కుమార్‌   (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు).  మిగిలిన వారి సంగతి పక్కన పెడితే..  వీరంతా దాదాపుగా ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసుకున్న వెంటనే ప్రభుత్వ సలహాదారులుగా నియమింతులైన వారే. వారి సేవలను వినియోగించుకోవడం కంటే అధికారులుగా ఉండగా సహకరించినందుకు కేసీఆర్ వారికి రిటర్న్ గిఫ్ట్ గా సలహాదారు పోస్టులు కట్టబెట్టారనే భావించాల్సి ఉంటుంది. అటువంటి వారు ప్రభుత్వం మారిన తరువాత కూడా కొత్త ప్రభుత్వం తొలగించే వరకూ ఆ పదవులను అంటిపెట్టుకు కూర్చోవడమే కొసమెరుపు. 

మాజీ సీఎంకు సీఎం పరామర్శ.. కేసీఆర్ కు రేవంత్ కు ఇదే తేడా!

శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం రేవంత్ పరామర్శించారు. మామూలుగా అయితే ఇదేమంత చెప్పుకోవలసిన.. కాదు కాదు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం కాదు. కానీ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాజకీయాలలో ఇటువంటి వాతావరణంలేదు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరం, యుద్ధం అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. విపక్షాల నిర్వీర్యమే లక్ష్యంగా పని చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి గంపగుత్తగా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోని వలస వచ్చేలా చేశారు. అలా రాని వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎంగా ఉన్న సమయంలో పలు అవమానాలకు గురి చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను ట్రాప్ చేసి మరీ జైలుకు పంపారు.   రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ నేతలను, వారి పార్టీని, అధిష్టానాన్ని, చివరికి దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి కూడా కేసీఆర్ ఇష్టారీతిన విమర్శలు గుప్పించారు.   రేవంత్‌ రెడ్డిని అసెంబ్లీకి రానీయకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయనను సభ నుంచి బహిష్కరింపజేసేవారు. సుదీర్ఘ  రాజకీయ అనుభవం  ఉన్న కేసీఆర్‌ ఇలా వ్యవహరిస్తే..  ఆయన ఎంతగా అవమానించినా, రాజకీయంగా   దెబ్బ తీసినా, గెలిచిన తరువాత   ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్‌ రెడ్డి వ్యవహరించిన తీరు రాజకీయ పరిణితిని నిదర్శనంగా నిలుస్తోంది. గెలిచిన తరువాత ఆయన కేసీఆర్ పై కానీ, బీఆర్ఎస్ పై కానీ ఒక్క రాజకీయ విమర్శ చేయలేదు. అధికారంలో ఉండగా కేసీఆర్ చేసిన విధంగా రేవంత్ ఎక్కడా కేసీఆర్ ను ఎద్దేవా చేయలేదు. పరుషంగా మాట్లాడలేదు.    యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను స్వయంగా పరామర్శిచారు. సహచర మంత్రులు సీతక్క, జూపల్లిలతో కలిసి ఆయన యశోదా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అవసరమైనా అందిస్తామన్నారు. కేసీఆర్ బాత్ రూంలో జారి పడిన రోజున ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిన తర్వాత ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిని ఆస్పత్రికి పంపి ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పరామర్శించారు. రేవంత్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలలో హుందాగా ఉండటం ఎలాగో కేసీఆర్ కు ఇప్పుడు అవగతమై ఉంటుందని పరిశీలకులు సైతం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ ను, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కనీసం అభినందించి, శుభాకాంక్షలు కూడా తెలియజేయని కేసీఆర్ ను  రేవంత్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి  మరీ  పరామర్శించడం ద్వారా వ్యక్తిత్వం విషయంలో ఇరువురి మధ్యా ఉన్న తేడా ఏమిటన్నది ప్రజలను స్పష్టంగా తెలిసిందని పరిశీలకులు చెబుతున్నారు. 

చండూరులో వెయ్యేళ్లనాటి శిల్పాల్ని కాపాడుకోవాలి: పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి

మానోపాడు మండల కేంద్రానికి 15 కి.మీ., జాతీయ రహదారిపై జల్లాపురం అడ్డరోడ్డు నుంచి 7 కి.మీ. దూరంలో ఉన్న చండూరులోని వెయ్యేళ్ల నాటి శిల్పాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్టు సమన్వయకర్త, సురవరం గిరిధర్ రెడ్డి ఆహ్వానంపై చండూరుకి వచ్చిన ఆయన స్థానిక కళ్యాణ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనున్న క్రీ.శ. 8-9 శతాబ్దాల నాటి  నాగదేవత శిల్పాలు, క్రీ.శ. 11-12 శతాబ్దాల నాటి వీరగల్లులు, క్రీ.శ. 13 వ శతాబ్దం నాటి భైరవ, సూర్య శిల్పాలు, క్రీ.శ. 16వ శతాబ్దం నాటి చెన్నకేశవ శిల్పం, క్రీ.శా.18 వ శతాబ్దం నాటి దంపతుల శిల్పాలు ఇంకా ఆలయంలోని చాళుక్య కాలపు గణపతి, శివలింగం, నంది విగ్రహాలు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకొన్నాయని ఆయన అన్నారు. అక్కడే ఉన్న క్రీ.శ.15వ శతాబ్దం నాటి విష్ణు ద్వారా పాలకులైన జయ, విజయుల శిల్పాలు గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయని, బాదామీ చాళుక్యుల నుంచి విజయనగర అనంతర కాలం వరకు చెందిన ఈ శిల్పాల గురించి స్థానికులకు ఆయన వివరించారు. ఈ శిల్పాలను పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో పేరు ఫలకాలను ఏర్పాటు చేస్తే రాగలతరాలకు మన వారసత్వని తెలియజేయడమే కాకుండా, పరిరక్షించిన వాళ్ళమవుతామని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సురవరం విజయభాస్కర్ రెడ్డి, బొమ్మారెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాగార్జునకొండ సందర్శించిన అమెరికా బౌద్ధ పరిశోధకులు

ఆర్కలాజికల్ ఐలాండ్ మ్యూజియం అయిన నాగార్జున కొండను అమెరికాలో స్థిరపడి బౌద్ధం పై పరిశోధనలు చేస్తున్న ప్రవసి భారతీయులు భాస్కర్, తలాటం శ్రీ నగేష్ లు బౌద్ధ కేంద్రాల సందర్శనలో భాగంగా ఆదివారం నాడు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వీరికి నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమలహాసన్ స్వాగతం పలికిన అనంతరం మ్యూజియంలోని బౌద్ధ శిల్పాలు, శాసనాలు ,పురావస్తు వస్తువుల గురించి, ఇక్ష్వాకుల కాలంలో శ్రీ పర్వత -విజయపురిగా పిలువబడిన నాగార్జున కొండ చారిత్రక విశేషాలను వివరించారు. అనంతరం నాగార్జున కొండపై పునర్నిర్మించిన క్రీస్తు శకము 3 వ శతాబ్దం నాటి అశ్వమేధ యాగశాల, సింహల విహారము, మహాస్థూపము, చైత్యము, మద్యయుగపు జైన దేవాలయాలు, ఇనుప యుగపు సమాధి, రెడ్డి రాజులు నిర్మించిన కోట అవశేషాలను శివనాగిరెడ్డి వీరికి వివరించారు. నాగార్జున కొండకు సంబంధించిన బౌద్ధ శిల్పాలు న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శనలో ఉన్నాయని వాటిని తాము చూసిన తర్వాత నాగార్జున కోండని చూడాలనిపించి ఇక్కడకు వచ్చినట్లుగా మహాయాన బౌద్ధ పరిశోధకుడు భాస్కర్, జై న, బౌద్ధ పరిశోధకుడు తలాటం శ్రీ నగేష్ తెలిపారని శివనాగిరెడ్డి తెలిపారు.  

ఆపత్సమయంలోనూ అబద్ధాలేనా సీఎం జగన్?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడితో ఒకింత తగ్గినట్టుగా కనిపించిన ఏపీ పొలిటికల్ హీట్ మళ్ళీ పెరుగుతున్నది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందు రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒక దశలో వైసీపీకి గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాటలతోనే ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల దండయాత్రతో అధికార పార్టీకి ఏం చేయాలో కూడా అర్ధంకాని పరిస్థితికి చేరింది. అలాంటి సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి సీఎం జగన్ తమ కక్షసాధించుకున్నారు. అయితే, అది జగన్ కు మరింత నష్టమే తెచ్చిందనుకోండి అది వేరే విషయం. మొత్తంగా చంద్రబాబుకు బెయిల్ దక్కడంతో మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి అండగా నిలబడడం మొదలు పెట్టారు. ఏపీని నాలుగు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ అల్లల్లాడించి పోయిన సంగతి తెలిసిందే. తుఫాన్ సమయంలో జగన్ ప్రభుత్వం ఏమీ చేయలే దన్నది నిజం. తుఫాన్ వెళ్ళిపోయాక తీరిగ్గా వైసీపీ నేతలు ప్రజలు మధ్యకి వచ్చారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. తుఫాన్ తీరం దాటాక కూడా రెండు మూడు రోజుల వరకూ పరిస్థితులు చక్కబడలేదు. తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు, అసలు తుఫాన్ ప్రభావాన్ని తెలుసుకొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల మధ్యకే వెళ్లారు. దాదాపు మూడు నెలల తరువాత ఆయన జనం మధ్యకు వచ్చారు. అదీ ఆపత్సమయంలో   ప్రజలకు భరోసా ఇచ్చేందుకు. దీంతో  కంగారుపడిన సీఎం  జగన్ కూడా అదే రోజున తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే, చంద్రబాబు పంట పొలాల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాడల వరకూ వెడితే.. ముఖ్యమంత్రి జనగ్  మాత్రం ఈ కార్యక్రమాన్ని కూడా ఒక  పార్టీ సభలా  మార్చేసుకున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం అటుంచి..  బాధల్లో ఉన్న జనాలనే తన దగ్గరకు రప్పించుకున్నారు.  ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బలవంతపు  జనసమీకరణ చేశారు.  సరే అలాగైనా తుపాను బాధితులకు ఏమైనా స్పష్టమైన సహాయం ప్రకటించారా? ధీమా ఇచ్చారా? భరోసా కల్పించారా అంటే అదేం లేదు.  ఒక ఎన్నికల ప్రచార సభలా సీఎం సభ  జరిగింది. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని, చంద్రబాబు పాలన అంతా కరువు కాటకాలేనంటూ విమర్శలకు దిగారు. తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ వారి వద్దకు వెళ్లకుండా సభ పెట్టారు. ఆ సభను కూడా  తన బటన్ నొక్కుడు సభగా మార్చేశారు.  ప్రతిపక్షాలను విమర్శించి చేతులు దులిపేసుకున్నారు. బాధితులందరికీ సాయం అందుతుందని.. ఎక్కడికక్కడ సచివాలయాలు బాధితులకు అండగా ఉంటాయని.. వారే ఇంటింటికీ వచ్చి సాయం  అందిస్తారనీ జగన్ చెప్పుకొచ్చారు.   అయితే క్షేత్ర స్థాయిలో  పరిస్థితులు తెలిసిన వారికి  సీఎం చెప్పిన ఒక్క మాట కూడా నెరవేరే  అవకాశం లేదని తెలిసిపోయింది.   తుఫాన్ బాధితుల సభలో మాట్లాడిన సీఎం.. గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థతో ప్రతీ ఇంటికీ నేరుగా వచ్చి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పుకున్నారు.  మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఎవరో ఏదో చెబితే నమ్మవద్దు.. అసలు ఆ టీడీపీ అనుకూల పత్రికలు చదవవద్దని చెప్పారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. మీకు సాయం అందకపోతే నేరుగా 1902 నంబర్ కే ఫోన్ చేయండి.. అది నేరుగా సీఎం ఆఫీస్ కే వస్తుందని కూడా జగన్ చెప్పారు. ఏపీలో తమ ప్రభుత్వం ఎంతో మంచి చేస్తూంటే చూసి ఓర్వలేని వారు బురద జల్లుతున్నారని జగన్ ఆవేదన చెందారు. మండిపడ్డారు. అయితే, జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తుఫాన్ బాధితుల పరామర్శ కోసం వెళ్లిన సీఎం బాధితులకు భరోసా ఇవ్వాలి. కానీ తనదేం లేదు అన్నీ సచివాలయాలు చూసుకుంటాయని చెప్పారు. తుఫాన్ సమయంలో ఆ సచివాలయ ఉద్యోగులే కార్యాలయాలకు రాలేదు. ఆ తర్వాత కూడా సహాయక చర్యలకు తగిన కార్యాచరణ  రూపొందించలేదు. ప్రజల గురించి పట్టించుకోలేదు. ఇక సాయం అందించేందుకు ఎక్కడా తగిన సమాచారం కూడా సేకరించలేదు. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. కానీ జగన్ వాళ్ళని నమ్మవద్దంటూ తనకు అలవాటైన విమర్శలు చేసేశారు.   ఆపద సమయంలో అధికారంలో ఉండి తుపాను బాధితులను ఆదుకునేందుకు తామేం చేశాం, ఏం చేయబోతున్నాం అన్నది  చెప్పాల్సిన చోట జగన్ గత ప్రభుత్వాన్ని విమర్శించి చేతులు దులిపేసుకున్నారు.  ఇక 1902 నంబర్ కి కాల్ చేస్తే సీఎంఓకి వస్తుందని.. మీ సమస్యలు తీరతాయని జగన్ నిస్సంకోచంగా పచ్చి అబద్దం చేప్పేశారు. వాస్తవంగా ఆ నంబర్ కి కాల్ చేసే ఫిర్యాదులు తీసుకుని సంబంధిత  శాఖకి పంపిస్తారు. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం తమ దగ్గర సమస్య పరిష్కరించేందుకు తగిన సౌకర్యాలు లేవని చెప్తున్నారు. ఉదాహరణకి ఏపీలో అనధికారిక విద్యుత్ కోతలపై 1902కి కాల్ చేస్తే ఫిర్యాదు తీసుకొని సంబంధిత అధికారికి కలుపుతారు. అధికారి మాత్రం ఎందుకు విద్యుత్ కోతలు విధిస్తున్నారో తమకి కూడా సమాచారం లేదని చెప్తున్నారు. సాధారణ రోజుల్లోనే  పరిస్థితి ఇలా ఉంటే..  ఇక తుఫాన్ లాంటి  ఆపత్సమయాల్లో  పరిస్థితి ఎలా ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అందుకే జగన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపత్సమయంలోనే పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమేమిటంటూ  నిలదీస్తున్నారు. 

ప్రొటెం స్పీకర్ గాఅక్బరుద్దీన్ కు అవకాశం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు  ప్రారంభమయ్యాయి. కొత్తగా రేవంత్ రెడ్డి  అధికార పగ్గాలు అందుకున్న తరువాత జరుగుతున్న తొలి సమావఏశాలివి. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. శనివారం (డిసెంబర్ 9)అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అంతా దాదాపుగా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోనే సరిపోవచ్చు. ఆ తరువాత బీఏసీ సమావేశాలలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? అజెండా ఏమిటి అన్నది నిర్ణయిస్తారు. సరే అదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే. అసలు ఎలాంటి వివాదాలూ, విమర్శలకూ తావు లేకుండా జరగాల్సిన ప్రొటెం స్పీకర్ వ్యవహారం ఎందుకు వివాదాస్పదంగా మారింది. ఒక రోజు భాగ్యానికి బీజేపీ అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎందుకు వ్యతిరేకించింది. అలాగే  ప్రభుత్వం కూడా సాంప్రదాయాన్ని అనుసరించి సభలో సీనియర్ మోస్ట్ లలో ఎవరో ఒకరిని కాకుండా అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎందుకు నిర్ణయించింది? అలా నిర్ణయించడం ద్వారా బీజేపీకి తొలి రోజు సమావేశాలను బహిష్కరించే అవకాశం ఇచ్చినట్లైంది కదా? సభలో అక్బరుద్దీన్ కంటే సీనియర్ హరీష్ రావు ఉన్నారు. లేకపోతే.. అక్బరుద్దీన్ తో సమానమైన సీనియారిటీ ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇద్దరున్నారు. కేసీఆర్ కాకుండా  విపక్షం నుంచి సీనియర్ ఎమ్మెల్యే అయిన మాజీ స్పీకర్ పోచారం ఉన్నారు. వీరందరినీ కాదనీ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు ఎందుకు అవకాశం దక్కింది. సాధారణంగా ప్రధాన విపక్షం నుంచే సీనియర్ ఒకరికి ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇస్తారు. కానీ కాంగ్రెస్ ఒకింత భిన్నంగా వ్యవహరించింది.   కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే ప్రొటెం స్పీకర్ పని. కాకపోతే సీనియారిటీని సంప్రదాయం మేరకు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ చేత రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  ఆ తరువాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో ప్రొటెం స్పీకర్ పని ముగుస్తుంది. స్పీకర్ ఎన్నికకు నోటిషికేషన్ వెలువడుతుంది. సభ్యులు కొత్త స్పీకర్ ను ఎన్నుకుంటారు. అయితే ప్రొటెం స్పీకర్ గా హరీష్ రావుకు కానీ, బీఆర్ఎస్ లో సీనియర్లకు కానీ అవకాశం ఇవ్వకపోవడమే ఇప్పుడు చర్చకు, వివాదానికీ తావిచ్చింది.  ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువుగా చీలేందుకు అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో  బీఆర్ఎస్ మనో స్థైర్యాన్ని మరింత తగ్గించే వ్యూహంతోనే అక్బరుద్దీన్ కు ప్రొటెం స్పీకర్ అవకాశం ఇచ్చి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇక బీజేపీ సమావేశాల తొలి రోజు బహిష్కరణ పెద్ద విషయం కాదని పరిశీలకులు అంటున్నారు.  

మంత్రులకు శాఖల కేటాయింపులో రేవంత్ ముద్ర!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ప్రతి అడుగులోనూ తనదైన ముద్ర చూపుతున్న రేవంత్ రెడ్డి మంత్రికవర్గ సహచరులకు శాఖల కేటాయింపులో కూడా తనదైన ముద్ర ప్రస్ఫుటంగా కనిపించేలా నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం నుంచి, తొలి కేబినెట్ భేటీ ముగిసే వరకూ కూడా మంత్రులకు శాఖలకు సంబంధించి అనేక ఊహాగాన సభలు జరిగాయి. హై కమాండ్ ఇప్పటికే ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న విషయంలో రేవంత్ కు విస్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందనీ, ఆ మేరకు ఆయా శాఖలు కేటాయించడమే రేవంత్ పని అని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాకుండా ఎవరికి ఏ శాఖ అన్నది కూడా రెండు రోజుల కిందటి నుంచే మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే శనివారం(డిసెంబర్ 9) ఉదయం రేవంత్ తన కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను చూస్తే నిన్నటి వరకూ జరిగిందంతా ప్రచారం మాత్రమేనని తేటతెల్లమైపోయింది. ఈ మేరకు శనివారం ఉదయం అధికార ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన మునిసిపల్, అర్బన్ డెవలప్ మెంట్, హోం శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. వీటికి అదనంగా  ముఖ్యమంత్రి నిర్వహణలోనే  జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంది.   ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తొలి నుంచీ రెవెన్యూ శాఖ కోసం పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. ఆర్థిక శాఖ ఇవ్వజూపినా ఆయన నిరాకరించారనీ, రెవెన్యూ కోసమే పట్టుబట్టారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కోరినట్లుగానే రేవంత్ ఆయనకు రెవెన్యూ శాఖను అప్పగించినట్లు మీడియా పేర్కొంది కూడా. తీరా శాఖల కేటాయింపు వద్దకు వచ్చేసరికి భట్టికి ఆయన కోరుకున్నట్లుగా రెవెన్యూ శాఖ కాకుండా, తొలుత రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఆర్థిక శాఖే దక్కింది. ఆర్థిక శాఖకు అదనంగా భట్టికి  ప్లానింగ్, విద్యుత్ శాఖ, ఇంధన శాఖలు కూడా కేటాయించారు.  ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే ఆయన తొలి నుంచీ కూడా ఆర్థిక శాఖ కోసం పట్టుబట్టినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి భిన్నంగా  ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి    పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖలు కేటాయించారు. అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ, సీతక్కకు పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ,  పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మాచార శాఖ, రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖలు కేటాయించారు. అలాగే దామోదర రాజనర్సింహకు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయిం చారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించగా  పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖలు దక్కాయి.   కొండ సురేఖకు అటవీ, దేవాదాయ శాఖలు, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, టెక్స్ టైల్ శాఖలూ కేటాయిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  ఇక జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ కేటాయించారు.  

కేసీఆర్ విద్యుత్ మాయ.. ట్రాన్స్ కో జెన్ కోల దుస్థితికి కారణం అదే!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావుకు  రాజకీయ లబ్ధిపై దృష్టే తప్ప దార్శనికత అంటే దూర దృష్టి లేదని.. ఆయన అధికారం నుంచి దూరమైన  రెండో రోజే లోకానికి వెళ్లడైంది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అంటూ ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఊదరగొట్టేశారు. అయితే ఆ పేరుతో విద్యుత్ రంగాన్ని ఎంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తేటతెల్లమైపోయింది. తెలంగాణ నిర్మాణం అంటూ ఆయన చేసిన ప్రసంగాలన్నీ ఓట్లు దండుకునే రాజకీయ విన్యాసాలే వినా.. రాష్ట్రం నిజమైన ప్రగతి కోసం ఆయన చేసిందేమీ లేదనడానికి ఆయన అనుసరించిన విద్యుత్ విధానమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసలు ఒక్క విద్యుత్ రంగం అనే కాదు దాదాపుగా రాష్ట్రంలోని అన్ని సంస్థలు, రంగాల పరిస్థితీ అదేనని పరిశీలకులు చెబుతున్నారు.   ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో దాదాపు రెండు గంటలు కరెంట్‌ పోయింది.  అందుకు కారణాలేమిటని చూడకుండానే బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ రాగానే కరెంట్ కోతలు షూరూ అంటూ ప్రచారం ఆరంభించేశారు.   ఇప్పుడు కూడా ఆ కారణాల సంగతి కొంచం సేపు పక్కన పెట్టి విద్యుత్ విషయంలో కేసీఆర్ హ్రస్వదృష్టి ఏమిటన్నది చూద్దాం. విద్యుత్తు విషయంలో కుట్ర జరుగుతున్నదని  టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌ రెడ్డి పలు సందర్భాలలో  అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే.   ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టారు. సీఎంగా ఆయన నిర్వహించిన తొలి సమీక్ష కూడా విద్యుత్ పైనే. ఆ సందర్భంగా అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ లో  కేసీఆర్ విద్యుత్ మాయ బట్టబయలైంది. విద్యుదుత్పాదనపై కాకుండా కేసీఆర్ విద్యుత్ కొనుగోలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఎక్కువ వ్యయం కూడా చేశారు. అందుకే విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.  ట్రాన్స్ కో , జెన్ కోలకు కలిపి 81వేల516 కోట్ల రూపాయల అప్పు ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఈ అప్పులు 22 వేల 422 కోట్లు. దీనిని బట్టి చూస్తేనే కేసీఆర్ హయాంలో విద్యుత్ అప్పులు ఏ స్థాయిలో పెరిగాయో అవగతమౌతుంది. సరే అప్పులు చేశారు, మరి ఆదాయం మాటేమిటంటే.. దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.  3వేల పై చిలుకు కోట్లు, అది కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా కలుపుకుంటే. దీనిని బట్టే కేసీఆర్ తీరు ఏమిటన్నది అవగతమౌతుంది.  తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ రంగ నిపుణులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత విద్యుత్ రంగంలో తీసుకోవలసిన చర్యలపై కూడా వారు అప్పట్లో ప్రస్తావించేవారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత.. రాష్ట్ర సాధకుడిగా క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్.. ఉద్యమ సమయంలో తన వెంట నడిచిన వారందరినీ పక్కకు నెట్టేశారు. అలా నెట్టేసిన వారిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. అలాగే విద్యుత్ రంగ నిపుణులు కూడా. దీంతోనే తెలంగాణ కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. నిజమైన ప్రగతి కంటే ఓట్లు తెచ్చిపెట్టేలా  జనాలను ఆకర్షించడంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. వ్యవస్థలు కుప్ప కూలే పరిస్థితి ఉన్నా దాచి.. ఇది సాధించాం, ఇంత సాధించేశాం అని ప్రసంగాలు ఇచ్చే వారు. ఆయన అధికార పాఠం నుంచి దూరమైన తరువాత ఒక్కొక్కటిగా ఆయన ఏరకంగా రంగాలను, సంస్థలను నిర్వీర్యం చేసేశారో బయటపడుతోంది. తొలుత విద్యుత్ రంగం ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోయిందో బయటకు వచ్చింది.  ప్రజలకు ఫ్రీబీస్ ఇచ్చేస్తే చాలు ఇక వారు తన మాట జవదాటరు అన్న కేసీఆర్ అహంకార పూరిత వైఖరే  ప్రస్తుత పరిస్థితికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క విద్యుత్ రంగం అనే కాదు.. ఒకదాని తరువాత ఒకటిగా అన్ని రంగాలదీ ఇదే పరిస్థితి అంటున్నారు.  

పని మొదలెట్టేశారు!.. అధికారులు ఆ వేగం అందుకోగలరా?

పని చేసే ప్రభుత్వం వేగం ఎలా ఉంటుందో.. ప్రజలకు, రాష్ట్రానికీ సేవ చేయాలన్న సంకల్పం ఉండే సీఎం తీరు ఎలా ఉంటుందో.. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతలలో చూపిస్తున్నారు. ఒకే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, అవకతవకలపై సీరియస్ గా చర్యలకు ఆదేశిస్తూనే, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చర్యలూ తీసుకుంటున్నారు. అదే సమయంలో మంత్రివర్గం కొలువుదీరిన ఒక రోజు వ్యవధిలోనే కేబినెట్ భేటీ నిర్వహించి గత తొమ్మిదేళ్లలో గత ప్రభుత్వ ఖర్చులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన వివరాలను రెడీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ వేగం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఆ వేగం అందుకోగలమా అంటూ కంగారు పడుతున్నారు. ఇక తొలి క్యాబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చిచడమే కాకుండా. రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు.  ఆ రెండు గ్యారంటీలనూ కూడా తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా   అంటే శనివారం (డిసెంబర్ 9) నుంచి అమలు చేయడానికి నిర్ణయించేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,   రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకూ పేదలకు వైద్యం హామీల అమలు శనివారం (డిసెంబర్ 9) నుంచి మొదలైపోయాయి. ఇక మిగిలిన ఆరు గ్యారంటీలనూ కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కేబినెట్ తొలి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.   

కేసీఆర్ కు ఆపరేషన్.. రేవంత్ స్పందన పట్ల సర్వత్రా హర్షం

రాజకీయ నాయకుడికీ, నాయకుడికీ తేడా ఏమిటో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చేతలలో చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరుకూ, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే  రేవంత్ వ్యవహరిస్తున్న తీరుకూ తేడాను జనం గుర్తించారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలూ సహజం. అయితే అవి అంశాల వారీగా ఆయా పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలూ, ప్రతి విమర్శలూ ఉండాలి. ఆ పరిధి దాటి వ్యక్తిగత స్థాయికి విమర్శలు దిగజారితే.. అది ఎంత మాత్రం విజ్ణత అనిపించుకోదు. అలా విమర్శలు చేసే వారు ప్రజలలో చులకన అవుతారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. విపక్షాలపై చేసే విమర్శలు ఎన్నడూ విధాన పరిధి దాటిన సందర్భం కనిపించదు. వర్తమాన రాజకీయాలలో నాయకులలో హుందాతనం ఎలా ఉండాలన్నదానికి రోల్ మోడల్ గా బాబు నిలుస్తారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ఆ కోవలోకి వచ్చే నేతగా ఆయన వ్యవహార శైలి ఉంది.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, రేవంత్ పోటాపోటీగా ఒకరి మీద విమర్శలు చేసుకున్నారు.   ఎన్నికలు ముగిశాయి. ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు ఉండటంతో  రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్  పార్టీ విపక్షానికి పరిమితం అయ్యింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని అంగీకరిస్తూ హుందాగా ప్రజల ముందుకో, మీడియా ముందుకో వచ్చి నూతన ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వ సారథిని అభినందించలేదు. కేసీఆర్ అనేమిటి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరూ కూడా, (హరీష్ రావు మినహాయించి) కొత్త ప్రభుత్వాన్ని అభినందించి శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు.   అయితే రేవంత్ మాత్రం.. ఎన్నికలు పూర్తి అయిన తరువాత రాజకీయ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాలనా వ్యవహారాలలో మునిగిపోయారు. కేసీఆర్ కు గాయం అయ్యిందనీ, ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారనీ తెలియగానే.. రేవంత్ వేగంగా స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. ఆయన చికిత్స పొందుతున్ ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని   X వేదికగా ఆకాంక్షించారు. రేవంత్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఓటమిని అంగీకరిస్తూ, కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ కనీసం ప్రకటన కూడా చేయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రేవంత్ కు ఉన్న తేడాను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహారశైలిని రేవంత్ తీరుతో పోల్చి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.  ఏపీలో స్కిల్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు పట్ల, ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన కుటుంబం పట్ల కూడా ముఖ్యమంత్రి జగన్,  వైసీపీ నాయకులు చేసిన చవకబారు వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. రాజకీయాలలో అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జగన్ , రేవంత్ రెడ్డి హుందాతనాన్ని చూసి నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని అంటున్నారు.   

తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనలో వేగం చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. తొలిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చారు. రాష్ట్రంలో మహిళలు శనివారం (డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద తెలంగాణలో శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ ను అమలు ప్రారంభిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఆర్డనరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణమే. తెలంగాణ దాటి బయటకు వెళ్లాలనుకునేవారు మాత్రం బోర్డర్ వరకూ  ఉచితంగా ప్రయాణించి,  బోర్డర్ దాటిన తరువాత నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్సులను ఉచిత కేటగరిలో చేర్చకపోవడంతో డబ్బులు కట్టి వెళ్లాలనుకునే వారు ఆ బస్సుల్లో ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు మామూలుగా తక్కువగా ఉంటాయి. అవి కిక్కిరిసిపోయే అవకాశం ఉంటుందన్న భావనతో వాటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.  

ఆ కేసుల సత్వర విచారణ.. ఏపీ హైకోర్టు నిర్ణయం

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైకోర్టు పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వారిపై నమోదైన కేసుల సత్వర విచారణకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయంతో   కళంకిత ప్రజాప్రతినిధులలో ఆందోళన మొదలైంది. వారిపై ఉన్న కేసులలో  ఏ ఒ  కేసులో  దోషిగా తేలినా ఎన్నికలలో పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉండంతో పలువురు  ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఇతర ప్రజాప్రతినిధులపై గతంలో నమోదైన కేసుల విచారణ నత్తనడక నడుస్తోందన్న ఫిర్యాదులపై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. వీటి వ్యవహారం వెంటనే తేల్చాలని దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర క్రిమినల్ కేసుల్లోనూ విచారణల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకోవడంపై హైకోర్టులకు సుప్రీం అక్షింతలు వేసిన సంగతి విదితమే. హైకోర్టులో ఈ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు స్పందించింది.  రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరిపైనా నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసే దిశగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కేసుల సత్వర విచారణపై ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా సుమోటోగా ప్రజాప్రయోజన వాజ్యం నమోదు చేసింది.  దీనిపై హైకోర్టు విచారణ జరిపి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు తగిన ఆదేశాలు ఇవ్వనుంది. ఈ పిల్ లో ప్రతివాదులుగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుతో పాటు సీఎస్, డీజీపీ, హైకోర్టు పీపీని కూడా చేర్చింది. రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణను వేగవంతం చేసి తీర్పులు ఇవ్వడం మొదలుపెడితే ఆ ప్రభావం కచ్చితంగా ఇప్పటికే కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై పడుతుంది. ఆ కేసులలో దోషిగా తేలిన ప్రజాప్రతినిథులు పోటీకి అనర్హఉలయ్యే అవకాశాలు ఉండటంతో హైకోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. 

ఆ ఫైళ్లలో ఏముంది?

పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని  మాజీ ఎస్డీవో హల్ చల్ చేశారు. కార్యాలయంలోని ఫైళ్ల తరలింపునకు, ధ్వంసానికి ప్రయత్నించారు. ప్రభుత్వం మారిన తరువాత ఆయన ఫైళ్ల తరలింపు, ధ్వంసానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. అభ్యంతరాలను లెక్క చేయకుండా కార్యాలయంలోనికి ప్రవేశించిన మాజీ ఎస్టీవో కల్యాణ్ ఫైళ్లను ధ్వంసం చేసి, సంచీలలో మూటగట్టి బయటకు తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు రోజుల కిందట ఓ వైపు కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే మంత్రి శ్రీనివాస గౌడ్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలింపునకు ప్రయత్నాలు జరగడం, అలాగే  పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి కూడా ఫర్నీచర్ తరలింపునకు ప్రయత్నాలు జరగడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఫైళ్ల ధ్వంసం, తరలింపునకు యత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి,ఫిషరీస్ శాఖల మంత్రి అయిన  తలసానికి ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్ ఆయా శాఖల ఫైళ్ల తరలింపునకు ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. ఓఎస్డీగా తన పదవీ కాలం ముగిసిన నాలుగు రోజుల తరువాత, అదీ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి ఫైల్స్ తీసుకెళ్లొద్దని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసినా, కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో దస్త్రాల తరలింపునకు ప్రయత్నించడంతో ఆ శాఖలో భారీ అక్రమాలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే బీరువాల్లో ఫైల్స్ ఎలుకలు కొట్టేస్తున్నాయనీ, అయినా అవేమీ అంత ముఖ్యమైనవి కావనీ కల్యాణ్ తన చర్యను సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ప్రారంభమైన ప్రజా దర్బార్.. భారీగా తరలి వచ్చిన ప్రజలు 

పదేళ్ల కెసీఆర్ పాలనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే సంస్కృతి లేదు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  రేవంత్ రెడ్డి మరుసటి రోజే చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతిభవన్)లో ప్రారంభమయింది. ప్రభుత్వానికి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి ముఖ్యమంత్రి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని, క్యూలైన్లలో లోపలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జడ్పిటిసి స్థాయి నుంచి సీఎం స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రజల నాడీ బాగా తెలుసు. సమస్యలకు పరిష్కారాలు వెతకడం ఆయనకు పెద్ద టాస్క్ కాదు. ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించాలని పరిశీలకులు అంటున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామి  ఎన్నికల ప్రచారంలోనే తాను గెలిస్తే ప్రజా దర్బార్ నిర్వహిస్తానని హామి ఇచ్చారు. ఆయన బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు ప్రజా  దర్బార్ నిర్వహించాలని ఆశిద్దాం.   

ఎన్పీడీసీఎల్ సీఎండి అన్నమనేని గోపాల్‌రావు రాజీనామా

ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ రాజీనామా చేసిన తర్వాత కార్పోరేషన్ చైర్మన్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చేరారు. ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. అనంతరం గోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పదవి తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి రాజీనామా చేశారు. తాజాగా, గోపాల్‌రావు కూడా తప్పుకున్నారు.

ప్రొటెం స్పీకర్ ఎవరు?

తెలంగాణలో తొలి సారి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా పాలన ప్రారంభించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని శనివారం నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య బీమాకూడా తక్షణమే అమలుకు నిర్ణయం తీసేసుకున్నారు. వరుస సమీక్షలకు కూడా రెడీ అయిపోయారు. ఇక శనివారమే అసెంబ్లీ సమావేశంలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్ ఎవరన్ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ స్పీకర్ ను ఎన్నుకునేంత వరకూ ప్రొటెం స్పీకరే స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తారు. అటువంటి కీలకమైన ప్రొటెం స్పీకర్ ఎవరు అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఈ ఆసక్తి ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీకి ఎక్కువ సార్లు ఎన్నికైన సీనియర్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు. కొత్త అసెంబ్లీలో అందరి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే. అయితే కేసీఆర్ అసలు అసెంబ్లీకి హాజరౌతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకూ కొత్త ముఖ్యమంత్రిని అభినందించి శుభాకాంక్షలు చెప్పింది లేదు. కనీసం హుందాగా ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. ఇహ ఇప్పుడు ఆయన హాజరుపై ఎటువంటి అనుమానాలూ లేవు. ఎందుకంటే ఆయన గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కనుక ఆయన అసెంబ్లీ తొలి సమావేశాలకు హాజరయ్యే ప్రశ్నే లేదని తేలిపోయింది. ఇక మిగిలిన వారిలో సీనియర్లు అంటే అధికార కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వారిరువురూ కూడా రేవంత్ కేబినెట్ లో మంత్రులు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్ ఉన్నారు. వీరు కాకుండా ఎంఐఎం నుంచి అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. దీంతో ప్రొటెం స్పీకర్ గా ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వారు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. పార్టీ శాసనసభా పక్ష నేత ఎంపిక విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం లేదని బీఆర్ఎస్ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ నుంచి సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వలసలు ఉంటాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. దీంతో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరంచే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మాజీలు.. కార్యాలయాల ఖాళీ నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ తరలింపునకు యత్నాలు!?

ఒక వైపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే.. ఇదే సందుగా మాజీ మంత్రులు తమ కార్యాలయాల నుంచి ప్రభుత్వ ఫర్నీచర్ ను తరలించుకుపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అది గమనించి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడటంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కార్యాలయాలలో ఫర్నీచర్ ప్రభుత్వ సొత్తు. అధికారం ఉన్నంత వరకూ అనుభవించడం మాత్రమే మంత్రుల పని. అధికారం నుంచి తప్పుకోగానే ఆ కార్యాలయాన్ని వీడాలే తప్ప ఫర్నిచర్ ను కూడా తరలించేయడం సరికాదు. అయితే కొందరు బీఆర్ఎస్ మాజీలు అదే చేస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రవీంద్ర భారతి సమీపంలో ఉన్న ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేసే క్రమంలో ఫర్నీచర్, కంపూటర్లను కూడా ట్రాలీలోకి ఎక్కించేస్తుండగా గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వ సొత్తును తరలించడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది.  ఇక పలువురు ఎమ్మెల్యులు కూడా తమ తమ క్యాపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ఫర్నీచర్ కు కూడా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలనూ సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలలోని ఫర్నిచర్, ఇతర వస్తువుల పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్న రోడ్లు  భవనాల శాఖ స్పందించి.. పరాజయం పాలైన కొందరు ఎమ్మెల్యేలు కార్యాలయంలో ఫర్నీచర్ తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరికాదని పేర్కొంది.    బోధన్‌లో మాజీ షకీల్ అమీర్  తన క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తలరించడానికి చేసిన ప్రయత్నం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది.  అసలు విషయమేమిటంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర  ఒక్కో నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయాలను కోటి రూపాయల చొప్పున నిధులతో నిర్మించింది. వాటి విద్యుత్ బిల్లులు, పన్నులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది.   ఇప్పుడు ప్రభుత్వం మారింది. పరాజయం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ ను కూడా తరలించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరాజయం పాలైన  ఎమ్మెల్యేలు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసిన తరువాత వాటికి అవసరమైన మరమ్మతులు చేసి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆర్అండ్ బీ శాఖ అప్పగించాల్సి ఉంటుంది.