స్మిత సబర్వాల్ ఎక్కడ ?

కొత్త ప్రభుత్వం కొలువు తీరి వారం రోజులు కావొస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్  మర్యాదపూర్వకంగా కలవలేదు. కెసీఆర్ ప్రభుత్వంలో చాలా కీలకంగా పని చేసిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఏమైంది అనే చర్చ జరుగుతుంది.   ప్రభుత్వం మారిన సందర్భంలో పాలనాధికారులు కొత్త ముఖ్యమంత్రిని కలవడం ఆనవాయితీ.. అయితే, స్మిత సబర్వాల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. నీటి పారుదల శాఖపై సీఎం జరిపిన సమీక్షకు కూడా ఆమె హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీసింది.తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తున్నారు.ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా  పని చేసారు. ఈ ఐఏఎస్ అధికారి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రకటించింది. రేవంత్ రెడ్డి టీమ్ లో ఈ ఐఏఎస్ అధికారి ఉండరని అప్పట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసులకు పని చేయాలని స్మిత సబర్వాల్ నిర్ణయించుకున్నారు.  తాజాగా, కొత్త చాలెంజ్ లకు సిద్ధమంటూ స్మిత సబర్వాల్ ఓ ట్వీట్ చేయడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. స్మిత కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం పనులను పర్యవేక్షించారు.  2001లో ట్రైనీ కలెక్టర్ ఐఏఎస్ విధుల్లో చేరిన స్మిత సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆరోపించారు. ఈ అక్రమాలలో అధికారులకూ వాటా ఉందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉంటోందనే వాదన వినిపిస్తోంది.

కడప కోటపై టీడీపీ జెండా?

కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుండి.. దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలలోనూ ఇప్పటి వరకూ వైఎస్ ఫ్యామిలీ ఆడిందే ఆట.. పాడిందే పాట. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి మారిందా? కడప కోటపై తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతుందా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడప అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానంపైనా గురిపెట్టారా?  సీఎం జగన్ కంచుకోటను తెలుగుదేశం ఈసారి బద్దలు కొట్టడం ఖాయమా? కడప పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో ఓడించి వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసిందా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు.  కడప పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం పుట్టిన దగ్గరి నుండి ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం ఇక్కడ గెలిచింది. నియోజకవర్గం ఏర్పడిన మొదట్లో కమ్యూనిస్టు అభ్యర్ధి వై.ఈశ్వరరెడ్డి నాలుగు సార్లు గెలవగా.. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధులు వీ.రామిరెడ్డి, కందుల ఓబుల్ రెడ్డి మూడేసి సార్లు గెలిచారు. ఆ తర్వాత 1984లో తొలిసారి టీడీపీ అభ్యర్ధిగా డీఎన్ రెడ్డి గెలిచారు. తర్వాత నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగుసార్లు, ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు, ఆ తర్వాత రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కూడా జగన్ ఒకసారి, గడిచిన రెండు ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డే గెలిచారు. దాంతో కడప లోక్ సభ అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా మారిపోయింది. అయితే, ఇప్పుడు ఎలాగైనా ఈ కంచుకోటను బద్దలు కొట్టి మరోసారి టీడీపీ జెండా ఎగరేయాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ సారి వైఎస్ ఫ్యామిలీకి కడపలో భంగపాటు ఎదురయ్యే అవకాశలు అవకాశాలు ఉన్నాయనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి  కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కూడా అవినాష్ ను నిందితుడిగా చెబుతోంది. అయితే, ఈ కేసులో ఇంకా న్యాయ విచారణ పూర్తి కాలేదు. తీర్పు రాలేదు. కానీ  స్థానికంగా మాత్రం ఈ హత్య ఎవరు చేశారు? ఎలా చేశారు? ఇప్పుడు అవినాష్ ను ఎవరు కాపాడుతున్నారు అన్న విషయంలో  అందరికీ స్పష్టత ఉంది. ఇక్కడ బహిరంగంగానే రచ్చబండలపై కూడా ప్రజలు దోషులు ఎవరో తేల్చి చెప్పేస్తున్నారు. వివేకా కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల కూడా ఇది తమ వారు  చేసిన హత్య అని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రజలలో అవినాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని పరిశీలకులు అంటున్నారు.  మరోవైపు సీఎం సొంత నియోజకవర్గమైనా ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కనీసం సాగు, తాగు నీటి కష్టాలు కూడా తీరలేదు. దీనిపై ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా జిల్లా వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోయి ఎవరికి వారే కుట్రలు పన్నుతున్నారు. ఇవన్నీ కడప పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశంకు  కలిసొచ్చే అంశాలే. ఈ అంశాలపైనే ఫోకస్ పెట్టేలా టీడీపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది. స్థానిక తెలుగుదేశం నేతలు కూడా చాప కింద నీరులా అధిష్టానం ప్రణాళికలు అమలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే ఇక్కడ జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకు విశేష ఆదరణ లభించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రెండు కార్యక్రమాలూ ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువే సక్సెస్ అయ్యాయి. ఇదే ఊపులో  తెలుగుదేశం కడప అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలపై గురిపెట్టింది. ఇక్కడ ప్రస్తుతం కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డినే కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీచేయించాలని భావిస్తుండగా.. ఆయన భార్య మాధవీరెడ్డిని జగన్ పై కడప అసెంబ్లీకి పోటీచేయించే అవకాశాలున్నాయని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. కడప అసెంబ్లీలో జగన్ ను ఓడించినా, లేక మెజారిటీ భారీగా దక్కకుండా అడ్డుకున్నా కడప పార్లమెంటును దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ పార్లమెంట్ స్థానాన్ని ప్రభావితం చేయగలిగితే దీని పరిధిలోని మిగతా అసెంబ్లీ స్థానాలు కూడా ప్రభావితమవుతాయి. ఫలితంగా మొత్తం జిల్లాలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కడప పార్లెమెంటు స్థానం టార్గెట్ గా సీఎం సొంత జిల్లాలో  విజయానికి బాటలు వేస్తూ ముందుకు సాగుతోంది. 

జగన్ తో ఢీ అంటే ఢీ.. బాలినేని తెగించేశారు!?

బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏపీలో రాజకీయాలతో ఏ కొంచం పరిచయం ఉన్నవారికైనా బాగా తెలిసిన పేరు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేనికి వైసీపీ పొమ్మనలేక పొగపెడుతోందని ఇంత వరకూ పరిశీలకులు ఆయనకు పార్టీలో ఎదురౌతున్న అవమానాలు, అధిష్టానం ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును పేర్కొంటూ విశ్లేషణలు చేస్తూ వచ్చారు. అయితే ఇక ఇప్పుడు బాలినేని బాహాటంగా వైసీపీపై తిరుగుబాటు చేసేశారు. అలా అనేకంటే జగన్ పై తిరుగుబాటు ప్రకటించేశారు అనడం సరిగ్గా ఉంటుంది. గత కొంత కాలంగా బాలినేనిని పార్టీ అధిష్ఠానం అడుగడుగునా అవమానిస్తూ వచ్చింది. ఆయన అలిగి మీడియాకు ఎక్కగానే తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగిస్తూ వస్తోంది. పదే పదే ఇలా జరగడంతో  వైసీపీ మెడపట్టి బయటకు గెంటేస్తుంటే.. బాలినేని చూరుపట్టుకు వేళాడుతున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం చేశారు. అసలు వైసీపీలో బాలినేని ఎపిసోడ్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఆయన పార్టీ అధినేత జగన్ కు బంధువు. ఆ కారణంగానే బాలినేనికి సంబంధించిన ఏ చిన్న  అంశానికైనా రాజకీయ వర్గాలూ, మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడిక బాలినేని రెఢీ అయిపోయారు. వైసీపీతో, ఆ పార్టీ అధినేతతో యుద్ధానికి సిద్ధమైపోయారు. తాజాగా ఆయన తనకు తాను పార్టీ టికెట్ ప్రకటించుకుంటూ చేసిన ప్రకటన ఒక విధంగా జగన్ కు సవాల్ విసిరినట్లుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం ఉత్తుత్తి బుజ్జగింపులతో కాలం గడిపేసిన అధిష్ఠానానికి ఇక ఆ ఆవకాశం లేకుండా బాలినేని సవాల్ ఉంది. ఇప్పుడిక బంతి వైసీపీ కోర్టులో ఉంది. జగన్ కు బాలినేనిని పార్టీ నుంచి బహిష్కరించడమో.. లేక ఆయనను పార్టీ ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించడమో తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది.  తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న బాలినేని.. ఆ సందర్భాన్నే తన బలాన్ని ప్రదర్శించేందుకు వేదికగా ఉపయోగించుకున్నారు. ఆ వేదికపై నుంచీ ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండేది తానేనని ప్రకటించేశారు.  తన అభ్యర్థిత్వాన్నే కాకుండా ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా ఆయనే ప్రకటించేశారు. ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. బాలినేని చేసిన ఈ ప్రకటన  వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ పెద్దలతో, మరీ ముఖ్యంగా జగన్ తో కనీసం చర్చించకుండా, సంప్రదించకుండా బాలినేని చేసిన పోటీ ప్రకటన.. ఆయన ఇక తాడో పేడో తేల్చేసుకోవడానికి రెడీ అయిపోయారని స్పష్టం చేసింది.  అలాగే బాలినేనికి ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లాలో  అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వైవీ సుబ్బారెడ్డికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అన్నిటికీ మించి వైసీపీకి ఇప్పటికే ఉన్న రెబల్ రఘురామ రాజు తరహాలో మరో రెబల్ ఉద్భవించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఒంగోలు అభ్యర్థిని తానేనని బాలినేని ప్రకటించిన తరువాత ఇక ఆయనకు  గత్యంతరం లేని స్థితిలో పార్టీ టికెట్ ఇచ్చినా? లేక ధిక్కారాన్ని సహింతునా? అన్నట్లు పార్టీ నుంచి బహిష్కరించినా జగన్ కు జగన్ పార్టీకీ  ఇబ్బందులు తప్పవనీ, పార్టీని, పార్టీ అధినేతను ఇరుకున పెట్టేలా బాలినేని ఇక విమర్శలు గుప్పించడం ఖాయమనీ అంటున్నారు.  జగన్ చేజేతులా పార్టీలో మరో రఘురామరాజు వంటి రెబల్ ను తయారు చేసుకున్నారనీ, ముందుముందు అందుకు ఫలితం అనుభవించక తప్పదనీ అంటున్నారు.

ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు  మళ్ళీ పెంపు 

ఆధార్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. ఫ్రీగా తప్పులు సవరించుకునేందుకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది. తాజాగా, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ డిసెంబరు 14తో ముగియనుంది.  తాజాగా గడువు పొడిగించిన మేరకు 2024 మార్చి 14 వరకు ఆధార్ అప్ డేట్ ఉచితం కానుంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది.  ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే... తప్పనిసరిగా తమ డెమొగ్రాఫిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ) నిబంధనల మేరకు తాజా ఐడీ కార్డు (రేషన్ కార్డు/ఓటరు కార్డు/పాస్ పోర్టు/కిసాన్ ఫొటో పాస్ బుక్/టీసీ/ మార్కుల జాబితా/పాన్/ఈ-పాన్/డ్రైవింగ్ లైసెన్స్)తో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులను కూడా చిరునామా ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని యూఐడీఏఐ చెబుతోంది. అయితే ఈ బిల్లులు ఇటీవల మూడు నెలల్లోపు చెల్లించినవి అయ్యుండాలి.

లోక్ సభ ఎన్నికలపై ఇక రేవంత్ నజర్!

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఒక వైపు పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ముద్రను చూపుతూనే మరో వైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.  అందులో భాగంగానే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తన కేబినెట్ లో పదవుల కేటాయింపులో తనదైన మార్క్ చూపిన రేవంత్  పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని లోక్ సభ ఎన్నికలలో మరోసారి కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు.  ఇప్పుడు 12 మందితో రేవంత్ కేబినెట్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే రేవంత్ తన కేబినెట్ లోకి మరో ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కూడా కేబినెట్ లో స్థానం దక్కనున్న ఆ ఆరుగురు ఎవరన్న దానిపైనే ఉంది.    త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ లో భాగంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోయే మంత్రులు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో  పార్టీని విజయం దిశగా నడిపించేందుకు అవసరమైన వారే ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇప్పటికే కేబినెట్ లోకి తీసుకోబోయే ఆరుగురు ఎవరు?  వారికి కేటాయించే శాఖలు ఏమిటి? అన్న విషయంపై పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తంగా వచ్చే  లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా రేవంత్ కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. కాంగ్రెస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడానికి కారణమేంటి? వచ్చే లోక్ సభ  ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతం కావడానికీ, లోక్ సభ స్థానాలలో విజయం సాధించడానికి తీసుకోవలసిన చర్యలు, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి వంటి అంశాలపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఒక్క స్థానం దక్కకపోయినా జీహెచ్ఎంసీ పరిధి నుంచి కేబినెట్ లోకి ఒకరిద్దరిని తీసుకుని పార్టీకి బలం చేకూర్చేలా వారికి టార్గెట్ నిర్దేశించే యోచనలో రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మూడ్రోజుల పాటు తెలంగాణ గజగజ !

తెలంగాణలో ఊష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీని ప్రభావంతో ఎముకలు కొరికే చలి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది. ఇక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని, చల్లని గాలులు వీస్తాయని హెచ్చరించింది.రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదవుతున్నట్లు పేర్కొంది. పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు పేర్కొంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్పత్రిపాలు

తెలంగాణలో గొంతు ఇన్ ఫెక్షన్ సమస్యలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచార సమయం నుంచీ ఆయన గొంతునొప్పితో బాధపడుతున్నారు. అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని ప్రసంగించడంతో ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది. ప్రస్తుతం చలి వాతావరణం పెరగడం, ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో అది మరింత ఎక్కువైంది. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.నిన్న ఢిల్లీ వెళ్లిన వెంకట్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కలిసి కోరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత యశోద ఆసుపత్రిలో చేరారు.

మిగ్జామ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో  నేడు, రేపు కేంద్ర బృందం పర్యటన 

ఆంధప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం(డిసెంబర్ 13), గురువారం(డిసెంబర్ 14) కేంద్ర బృందం పర్యటించనుంది. ప్రభావిత జిల్లాల్లో నష్టపోయిన పంటలు, ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర బృందం బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది.  బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారుల బృందం పరిశీలన చేయనుంది. పరిశీలనకు ముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌తో భేటీకానుంది. రెండు బృందాలు ఏర్పడి ప్రభావిత ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోనున్నారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావం తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురిసాయి. తుపాను కారణంగా ఏర్పడిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  తమిళనాడులో ఇప్పటికే పర్యటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులు మనో ధైర్యాన్ని కోల్పోకూడదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమం పూర్తిగా మర్చిపోయిందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించే వరకు ముఖ్యమంత్రి జగన్ కు సోయి లేదన్నారు. 

కేసీఆర్ కు రేవంత్ పరామర్శ.. ప్రశంసలూ, విమర్శలూ!

సాధారణంగా రాజకీయ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు అనేమిటి ప్రముఖులెవరైనా సరే అనారోగ్యం పాలైతే వారిని  వివిధ రంగాల ప్రముఖులు వారిని పరామర్శించడం చాలా సాధారణమైన విషయం. అదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే  అన్ని వర్గాల వారూ ఆయన యోగక్షేమాలను విచారించి, త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తారు. పరామర్శిస్తారు. ఇందులో వింత కానీ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం కానీ ఏమీ లేదు.   ఎంతటి శత్రువైనా ఆసుపత్రిలో ఉంటే వారిని పలకరించి, పరామర్శించడమన్నది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. అయితే రాజకీయాలలో ఆ ఆరోగ్యకరమైన సంప్రదాయం కనుమరుగై చాలా ఏళ్లయ్యింది.   మరీ ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్, తెలుగు రాష్ట్రాలలో జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత, రాజకీయ శతృత్వం వ్యక్తిగత వైరంగా మరడాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు విద్యార్థులుగా స్నేహితులే అయినప్పటికీ రాజకీయం వారిని విడదీసింది. రాజకీయంగా ఇద్దరి దూరులూ వేరయ్యాయి. అయినా చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్ల దాడి జరిగినప్పుడు ఆ దాడిని వైఎస్ ఖండించారు. తిరుపతిలో ధర్నా నిర్వహించి మరీ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీలో చంద్రబాబు, వైఎస్  ల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శల పరంపర కొనసాగేది. అయితే అవెప్పుడూ వారి వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేయలేదు. అప్పట్లో రాజకీయాలలో హుందాతనం అలా ఉండేది.   ఇప్పుడు పరిస్థితి మారింది.  రాజకీయ  ప్రత్యర్ధులు అనే మాట కనుమరుగై రాజకీయ శత్రువులు అన్న భావన ముందుకు వచ్చింది.  అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష నేతలు, కార్యకర్తలపై అడ్డగోలు కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి.    రేవంత్‌రెడ్డిని కేసీఆర్..   చంద్రబాబునాయుడును జగన్మోహన్‌రెడ్డి జైళ్లకు పంపించిన ఉదంతాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే కేంద్రంలోని మోడీ సర్కార్  విధానాలతో విభేదించే రాజకీయ పార్టీల నాయకులపైనే ఈడీ, ఐటీ, సీబీఐ నజర్ పెట్టడాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది.  ఇక ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన బాత్ రూంలో జారిపడి గాయపడి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు  శస్త్ర చికిత్స జరిగింది. ఆస్పత్రిలో ఉన్న ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా శత్రువులా చూశారు. అలాగే వ్యవహరించారు. చివరకు  కుమార్తె పెళ్లికి కూడా రేవంత్ రెడ్డి జైలు నుంచి వచ్చి చేయాల్సిన పరిస్థితి కల్పించారు. తన ఏకైక కుమార్తె పెళ్లి పనులన్నీ తాను దగ్గరుండి చూసుకోవలసిన రేవంత్ రెడ్డి అలా చేయలేకపోయారు. నిశ్చితార్థానికీ, పెళ్లికీ ఏదో అతిథిలా వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేలా చేశారు. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా రేవంత్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం రాజకీయవర్గాలలోనే కాదు సామాన్యులలోనూ విస్మయం కలిగించింది.  రాజకీయాలను పక్కనపెట్టి రేవంత్ హుందాతనంతో  వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. రేవంత్ పై ప్రశంసల వర్షం కురిసింది.  అయితే ఇక్కడే బీఆర్ఎస్ సంచుతిత్వం బయటపడింది. కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.  ఎన్నికల ముందే కారెక్కిన మాజీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలు హుందాతనం మనలో ఉంటే సరిపోదు.. ఎదుటి వారిలోనూ ఉండాలి అనిపించేలా చేశాయి.  రాజకీయాలలో గెలపు ఓటములు సహజం. రెంటినీ సమానంగా తీసుకోవాలి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సేవ, రాష్ట్ర ప్రగతి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. విపక్షంలో ఉంటే అధికార పక్షంపై అంశాల వారీగా విమర్శలు ఉండాలి. అయితే బీఆర్ఎస్ తీరులో  అది కనిపించడం లేదు. ఓటమి తరువాత కేసీఆర్ కనీసం గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ను కనీసం అభినందించలేదు. మీడియా ముందుకు వచ్చి హుందాగా ఓటమిని అంగీకరించింది లేదు. అటువంటి కేసీఆర్ ను సీఎం హోదాలో రేవంత్ పరామర్శించారు. ఆ సందర్భంగా ఆస్పత్రి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే పోన్నాల లక్ష్మయ్య రేవంత్ పరామర్శపై చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి పరాకాష్టగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  ‘‘దయచేసి నన్ను కనీసం ఏడాదైనా సీఎంగా ఉండనివ్వండి’’ అని రేవంత్‌రెడ్డి, మంచం మీద ఉన్న కేసీఆర్‌ను, చేతులెత్తి వేడుకున్నారని పొన్నాల చేసిన వ్యాఖ్య  చౌకబారు-నేలబారు-మరగుజ్జు రాజకీయాలకు పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు.  

మే తరువాతే పంచాయతీ ఎన్నికలు?!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పదవీ కాలం జనవరి 31తో ముగియనుండటంతో.. వెంటనే వాటి నిర్వహణకు రంగం సిద్ధమౌతుందని అంతా భావించారు. అయితే రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం, గడువు ముగిసేలోగా అంజే జనవరి 31 లోగా రిజర్వేషన్లు ఖరారయ్యే అకాశాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పంచాయతీలలో అధికారుల పాలన అనివార్యంగా కనిపిస్తోంది.    బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పంచాయతీ ఎన్నికలను మే తర్వాతే నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.  సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ప్రకారం రాష్ట్ర బీసీ కమిషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్నిఅధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.   ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లు కాకుండా  కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.   అయితే ఇప్పటివరకూ రాష్ట్ర బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదికా అందలేదు. ఫలితంగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. బీసీ కమిషన్  నివేదిక అందిన తర్వాత మాత్రమే రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.  రిజర్వేషన్ విషయంలో డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో ఆ  ప్రాసెస్ మొదలు కావడానికి సమయం పడుతుంది. ఇలా ఉండగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.   ఇక అన్నిటికీ మించి సార్వత్రిక ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు లోక్‌సభ ఎన్నికలు అడ్డు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో తదితర అధికారులు లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమౌతున్న నేపథ్యంలో  సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  నిర్దిష్ట డెడ్‌లైన్ ప్రకారం జనవరి 31తో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనున్నందున ఆ తర్వాత వారు ఆ పదవుల్ల కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో ఎన్నికలు జరిగి కొత్త ప్రజాప్రతినిధులు కొలువుదీరేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన అనివార్యమని పరిశీలకులు అంటున్నారు.   

ఆర్కే ఒక్కడే కాదు.. జగన్ కు అందరూ కూరలో కరివేపాకులే!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ కీల‌క నేత, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హ‌ఠాత్తుగా ఉరుములు లేని పిడుగులా ఆర్కే రాజీనామా చేసేసి సంచ‌ల‌నం సృష్టించారు. అదేదో ఆషామాషీగానో.. బెదిరించడానికో కాదు. స్పీకర్ ఫార్మాట్ లో శాస‌న స‌భ్య‌త్వానికి, అదేవిధంగా వైసీపీ స‌భ్య‌త్వానికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. నిజానికి ఆయన రాజీనామాను  వైసీపీ నేతలెవరూ ఊహించి ఉండ‌రు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కంటే ఆళ్ల రామకృష్ణారెడ్డే  అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై ఎక్కువగా పోరాడారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉండే ఆర్కే.. అదే స్థాయిలో  తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే జగన్ కోసం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉన్న ఆర్కే సూటిగా చంద్రబాబుతోనే తలపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి తెలుగుదేశం నేతలు, అమరావతిపై కూడా వ్యక్తిగతంగా కేసులు వేశారు. అలాంటి నేత ఉన్నఫళంగా జగన్ కు, ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు.  దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఏం జరుగుతోందన్నది ఆసక్తిగా మారింది. రాజీనామా అనంతరం కూడా ఆర్కే మీడియా ముందు ఎక్క‌డా ప‌న్నెత్తు మాట ఎవ‌రినీ   అన‌లేదు. ఆర్కే లాంటి ఎమ్మెల్యే సీఎం జ‌గ‌న్‌కు చెప్ప‌కుండా రాజీనామా చేశారంటే నమ్మలేం. జగన్ కు అత్యంత సన్నిహితుడైన నేతగా మెలిగిన ఆర్కే జగన్ కు ముందుగానే చెప్పి రాజీనామా చేసి ఉంటార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. దీంతో రాజీనామా చేయ‌డం వెన‌క కార‌ణాలు ఏంటి, అలాగే ఆర్కే లాంటి నేత రాజీనామా చేసి వెళ్లిపోతున్నా.. జగన్   లైట్ ఎలా తీసుకున్నరన్నదానిపై ఇప్పుడు  విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆర్కే రాజీనామా వెనక‌ చాలా  కార‌ణాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆర్కే పైకి చెప్ప‌క‌పోయినా వైసీపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నది ఇప్పుడు అందరికీ అర్ధమౌతున్న రాజకీయ వాస్తవం. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో సాక్షాత్తూ జ‌గ‌నే ఆర్కేను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.  కానీ, ఆ మాట నిల‌బెట్టుకోలేదు. పోనీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనైనా ఆర్కే పేరును కనీసం పరిశీలించనుకూడా లేదు. పైగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో   ఆర్కే కంటే జూనియర్లకు కేబినెట్ లో అవకాశం ఇచ్చిన జగన్ ఆర్కేకు కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.  అలాగే ఒకవైపు రాజ్యసభ సభ్యుడైన తన సోదరుడు, మరోవైపు టీడీపీ నుంచి వ‌చ్చిన గంజి చిరంజీవికి పార్టీ ప్రాధాన్యత పెంచుతూ వచ్చింది. ముందుగా చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా, తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు. దీంతో ఆయన ఒక అధికార కేంద్రంగా మారిపోయారు.  ఆ తర్వాత గత ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వేమారెడ్డిని మంగళగిరి తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దానిని చిరంజీవితో ప్రారంభింపచేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో గ్రూపు కట్టారు. అన్నీ తెలిసినా చూస్తూ ఉండడం తప్ప ఆర్కే ఏమీ చేయలేకపోయారు. చివరికి చిరంజీవినే తన నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించడంలో పార్టీ పెద్దలు ఒక ప్లాన్ ప్రకారమే ఆర్కేకు పొగబెట్టారని స్పష్టంగా తేలిపోవడంతోనే ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకరకంగా ఆర్కే తన భవిష్యత్తును కాదని మరీ జగన్ కోసం పనిచేశారు. అమరావతిలో అసైన్మెంట్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో  సీఐడీకి  ఆర్కేఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు పేరు చేర్చాలని, కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సిబిఐకి బదలాయించాలని పిల్ వేశారు. అసలు తాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా మర్చిపోయి రాజకీయంగా జగన్ కు లబ్ది చేకూర్చేందుకు పనిచేశారు. ఫలితంగా ఇప్పుడు ఆర్కే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోగా..   పార్టీ అదే వ్యతిరేకతను చూపి ఆయనను పక్కన పెట్టేసింది. ఇది ఒక్క ఆర్కేకి మాత్రమే కాదు.. అధికారంలో ఉండగా ప్రజల ప్రయోజనాలను కాకుండా జగన్ మెప్పు కోసం ఆరాటపడిన వారందరికీ  ఫలితం ఇలాగే ఉంటుందన్నది ఆర్కే అనుభవం చెప్పే మాట. ఎవరినైనా తన చేతిలో పావులుగా మార్చుకొని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం, ఆ తరువాత కూరలో కరివేపాకులా పక్కన పారేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు వైసీపీలో ఆర్కే బాటలోనే  మాజీ మంత్రులు, మంత్రులు సహా పలువురు ఉన్నట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. 

నన్ను చూసేందుకు రాకండి.. కేసీఆర్

తుంటి గాయానికి చికిత్స పొందుతూ యశోదా అస్పత్రిలో  ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను చూసేందుకు ఎవరూ రావద్దని అంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్ మీద నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఇన్ ఫెక్షన్ భయంతో డాక్టర్లు తనను బయటకు పంపడం లేదనీ, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాననీ, అంత వరకూ తనను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దనీ ఆయనా వీడియోలో విజ్ణప్తి చేశారు.  యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కేసీఆర్ ను చూసేందుకు  పెద్ద ఎత్తున అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తుండటంతో కేసీఆర్ ఈ విజ్ణప్తి చేశారు. తాను కోలుకుంటున్నాననీ, త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ మధ్యకు వస్తాననీ చెప్పారు.  అప్పటి వరకూ యశోద దవాఖానకు ఎవరూ రావద్దని కోరారు. ఈ ఆస్పత్రిలో తనతో పాటు  వందల మంది పేషెంట్లు ఉన్నారనీ, వారికి ఎవరికీ మన వల్ల ఇబ్బంది కలగొద్దనే తానీ విజ్ణప్తి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.  

మాయ చేసి గెలిచేద్దామనే?

ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తెలంగాణ రాజకీయాలు కాస్త చల్లబడ్డాయి. అదే సమయంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం నుండి  ఆ పార్టీ   జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టగా.. మరోవైపు తెలుగుదేశం-జనసేన ఉమ్మడి కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీలో కొందరు ప్రముఖ నేతలు పార్టీరాజీనామా చేశారు. కరుడుగట్టిన వైసీపీ వాదిగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. వైసీపీ ఏకంగా 11 మంది నియోజకవర్గాల సమన్వయ కర్తలను మార్చేసింది. ఈ మేరకు  సోమవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఇంచార్జీల మార్పు వివరాలు వెల్లడించారు. దీంతో ఏపీ రాజకీయాలలో  ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ చేపట్టిన ఈ ఇంచార్జీల మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న విడదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ లాంటి కీలక నేతలను కూడా నియోజకవర్గాలను మార్చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తున్నది. సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్ఠానం ఇంఛార్జులను మార్పు చేయడం ఆ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. మొత్తం 11 మందికి ఈ స్థానభ్రంశం కలుగగా.. నలుగురు కొత్త వారికి ఏడుగురు పాతవారికి నియోజకవర్గాలు మార్చి బాధ్యతలు అప్పగించారు. మంత్రులు విడదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ లను సిట్టింగ్ స్థానాల నుండి తప్పించడం ఆసక్తి రేపుతోంది. ఇది ఒకరకంగా వైసీపీ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఎంత భయపడుతోందా అర్ధం అయ్యేలా చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నలుగురు మంత్రులకు వారి వారి స్థానాలలో మళ్లీ విజయావకాశాలు లేవని ఇప్పటికే ఐ-ప్యాక్ సర్వే తేల్చేయడంతోనే  ఇప్పుడు ఇక్కడ వారి స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించాని చెబుతున్నారు. అలాగే ఈ నలుగురికి కేటాయించిన స్థానాలు టీడీపీకి కంచుకోటలు కాగా ఇక్కడ ఈ నలుగురు మంత్రులు ఓడిపోవడం గ్యారంటీ అని రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ స్థానాలలో ఈ మంత్రులు ఓడినా నష్టం ఉండదని, వీరి సిట్టింగ్ స్థానాలలో మరొకరికి అవకాశం ఇస్తే అసంతృప్తి తగ్గే అవకాశం ఉందని వైసీపీ ఈ స్థానాలు  కేటాయించినట్లు కనిపిస్తున్నది.  కాగా, మార్పు చేసిన 11 స్థానాలలో ఒక్క ఉమ్మడి గుంటూరు నుంచే 8మంది ఉండటం చూస్తుంటే ఆ జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇంకా చెప్పాలంటే చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని, మేరుగ నాగార్జునను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకురావడం పార్టీలో కూడా కలకలం రేపుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంఛార్జిల మార్పు పట్ల పార్టీలో అసంతృప్తి  భగ్గుమంటున్నది. కొత్త స్థానాలకు వెళ్తే ఓడిపోవడం ఖాయమని తేలిన ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాడర్ తో సమావేశాలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే సిట్టింగులకు ఎసరు పెట్టుతుండడంతో వైసీపీలో మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో  గుబులు మొదలైనట్లు తెలుస్తున్నది. పల్నాడు జిల్లాలో మంత్రి రజినిని గుంటూరు పశ్చిమకు మార్చగా కొత్త అభ్యర్థి రాజేష్ నాయుడును తెరపైకి తెచ్చారు. సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా రాజేష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.  కాగా, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇప్పటికే తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వీరు కూడా తట్టా బుట్టా సర్దుకోక తప్పదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే పీకే సర్వేలలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారో వారందరిపై వేటు తప్పదని భావిస్తున్నారు. ముందుగా జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నుండే ఈ మార్పులు మొదలు పెట్టగా,  ఈ జిల్లా  తర్వాతనే మరో జిల్లాలో కూడా మార్పులు తప్పవని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.   వైసీపీ ఇంచార్జీల మార్పుపై రాజకీయాల వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరుగుతున్నది. ఇలా క్యాండిడేట్లను మారిస్తే ప్రభుత్వ తప్పిదాలను మర్చిపోయే  స్థితిలో ప్రజలు లేరని.. ఎవరు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి మరీ ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెటిజనులతు మొహమాటం లేకుండా చెబుతున్నారు. కొత్త వారిని తీసుకొచ్చినా ప్రజలకు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన ఒక్కటే కనిపిస్తుందని.. ప్రభుత్వపై వ్యతిరేకత ఎవరు ఎక్కడ ఉన్నా ప్రజలు ఓడించడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఔను ఇది నిజం.. తెలుగుదేశం విజయం తథ్యం!

గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నీ, ఆ ప్రభుత్వ పాలననూ చూస్తున్న వారికీ, అనుభవిస్తున్నవారికీ. వీళ్లూ వాళ్లూ అనేమిటి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలోనూ అసలిలాంటి పార్టీని ఎందుకు ఎన్నుకున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాం అన్న ప్రశ్నే మెదులుతోంది.  ఔను నిజం.. రాష్ట్ర విభజనతో పేరు తప్ప మరేం లేకుండా, కనీసం రాజధాని ఇదీ అని చెప్పుకోలేని రాష్ట్రంగా ఏర్పడిన ఏపీ ఆ తరువాత ఐదేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. ప్రపంచం మొత్తం ఏపీవైపు తొంగి చూసేలా అద్భుత రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టి శరవేగంగా పనులు మొదలు పెట్టింది. ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యంగా మారింది. రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాలు అసూయపడేలా ప్రగతి, సంక్షేమాలలో పురోగమించింది. ఏ నమ్మకంతో అయితే ప్రజలు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించారో.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది. అపార అనుభవం, అనితర సాధ్యమైన విజన్ తో చంద్రబాబు రాష్ట్ర ప్రగతిని దేశానికే రోల్ మోడల్ అన్నట్లుగా పరుగులు తీయించారు.  ఆ తరువాత 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. జగన్ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసలు తెలుగుదేశం  ఎందుకు ఓడిపోయింది?  అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఎవరికీ సమాధానం దొరకడం లేదనే చెప్పాలి.  రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ, నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, తమ అనుభవం అంతా రంగరించి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగారు. రాజధాని అమరావతిని,  గ్రోత్ ఇంజిన్ నగరంగా అభివృద్ధి చేసేందుకు అంత వరకూ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా    భూసమీకరణ చేశారు.   నిర్మాణాలు మొదలయ్యాయి. రాష్ట్రం నలుచెరుగులా అభివృద్ధి మెలకలెత్తింది. మరో ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం   కొనసాగి ఉంటే.. రాజధాని  అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు, రాష్ట్రం అన్ని రంగాలో నూ పురోగమించి  అగ్రగామిగా నిలిచేది. అయితే, దురదృష్టవశాత్తు, 2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ ఒడి పోయింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అభ్యర్ధన సృష్టించిన సింపతీతో  వైసీపీ గెలిచింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది కళ్ళ ముందు కదులుతున్న నడుస్తున్న చరిత్ర.  రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో 3 శాతం కంటే దిగువకు పడిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటి? ఎంత అన్నది తెలుసుకోవడానికి ఈ గణాంకం చాలదా? అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్లు, రాష్ట్రం ఎంతగా వెనుకబడిపోయిందో చెప్పడానికి దిగజారిన వృద్ధి రేటు తెలిస్తే చాలు. నిజానికి  జగన్  పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు. నష్టం అంతా ఇంతా కాదు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ నష్టపోయారు. అందుకే ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు కావాలి, చంద్రబాబు రావాలి అంటున్నారు.  చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యటనల   కు గమనిస్తే, జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో, ఎంతగా  చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, కోరుకుంటున్నారో అర్థమవుతుంది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం .. చేసుకున్న అదృష్టం చంద్రబాబు అయితే దురదృష్టం ..జగన్ అని సామాన్య ప్రజలు కూడా నిర్ద్వంద్వంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.  నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం ‘అస్తిత్వం’ విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసేపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం, తెలుగుదేశం  కేవలం 23 స్థానాలకు పరిమితం కావడంతో ఇక పార్టీ పుంజుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషణలు వినిపించిన వారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా అంత చురుకైన పాత్రను పోషించలేరనీ, అలాగే, పార్టీని ముందుకు నడిపించడానికి  లోకేష్ అనుభవం సరిపోదని  చాలా చాలా సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు  అటు చంద్రబాబు, ఇటు లోకేష్ విషయంలో తమ అంచానాలు తప్పాయని నాడు సందేహాలు వ్యక్తం చేసిన వారంతా అంగీకరిస్తున్నారు.  వైసేపీ అరాచక పాలనను తట్టుకుని  టీడీపీ అస్తితాన్ని నిలుపుకోవడమే కాదు, పడిలేచిన కెరటంలా చంద్రబాబు దూసుకొచ్చిన తీరు పట్ల సర్వత్రా విస్మయం, సంభ్రమాశ్చర్యాలూ వ్యక్తం అవుతున్నాయి.   నిజానికి చంద్రబాబు నాయుడికి  సంక్షోభం నుంచి సరికొత్త ఎత్తులకు ఎదగడం కొత్తేమీ కాదు.  చంద్రబాబు నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ప్రతీ ఓటమి నుంచీ గుణపాఠాలు నేరుస్తూ.. గెలుపు తలుపులు తెరిచారు. ఇప్పడు మళ్ళీ అదే  చేస్తున్నారు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేననీ, ఉత్సాహం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించోచ్చని నిరూపిస్తున్నారు.  70 ఏళ్ల  నవయువకుడిగా చంద్రబాబు కదులుతున్న తీరు పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాయి. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్  అక్రమంగా  అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలులో 52 రోజుల పాటు నిర్బంధించిన సమయంలో  ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ లక్షలాదిగా బయటకు వచ్చి చంద్రబాబు ఔన్నత్యం, గొప్పతనం బయటకు చాటారు. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు అరెస్టైతే ఆయన పాల్పడిన స్కాములు, అక్రమాలు, అవినీతి వంటి వాటిపై జనంలో చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు అరెస్టైనప్పుడు ఆయన దార్శనికత, ఆయన చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన పడిన తపన వంటి వాటిపై చర్చ జరిగింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి ఒక నానుడి ప్రచారంలో ఉండేది. అదేమిటంటే చంద్రబాబు నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు అని. ఇప్పుడు ఆయన అక్రమంగా అరెస్టైన సమయంలో జనం నోటి వెంట వచ్చిన మాట చంద్రబాబు తప్పు చేయరు.. ఎవరినీ తప్పు చేయనివ్వరూ అన్నదే. అటువంటి చంద్రబాబు అరెస్టుతో  జగన్ లో ఏక్కడో  మిణుకుమినుకు మంటున్న గెలుపు ఆశ పూర్తిగా ఆవిరైపోయింది.  అందుకే, 2024 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్  జగన్ కు మరో చాన్స్ లేదని పరిశీలకులు సైతం గట్టిగా చెబుతున్నారు. తెలుగుదేశం  విజయం వందశాతం తథ్యం అంటున్నారు. జనం కూడా తధాస్తు అంటున్నారు.     

మొహం చాటేశారా.. ముఖం చెల్లలేదా?

తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టీడీపీ అధినేత,   నారా చంద్రబాబు నాయుడు పరామర్శించిన సంగతి తెలిసిందే.  ముందుగా కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లను కలిసిన చంద్రబాబు ఆయన ఆరోగ్యం, సర్జరీ, చికిత్స గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ తో కొద్దిసేపు సంభాషించిన చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ కోలుకొని మామూలుగా నడిచేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని వివరించారు.  కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సేవ చేసేందుకు ముందుకు సాగాలని  ఆకాంక్షించారు. కేసీఆర్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.  రాజకీయంగా వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. అన్నీ పక్కన పెట్టేసి కేసీఆర్ కోసం  ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలలో విలువలకు, హుందాతనానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రస్తుతిస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ ప్రత్యర్థులపై పరుషంగా పన్నెత్తి ఒక్క మాటమాట్లాడిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  ఇక కేసీఆర్ ను బాబు పరామర్శిండం దగ్గరకు వస్తే.. ఇన్నాళ్లు తనను బద్ధ శత్రువుగా చూసిన కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించడం రాజకీయంగా చంద్రబాబు వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మరో సారి ప్రపంచానికి చాటింది. రాజకీయాలలో వ్యక్తిగతంగా ఏదీ ఉండకూడదని చంద్రబాబు మరోసారి  నిరూపించారు. ఇంత వరకూ బాగానే ఉంది.  కేసీఆర్ ను పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లినా అక్కడ కేసీఆర్ కుటుంబం లేకుండా జారుకోవడంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో  తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తారని తెలిసి కూడా   కేటీఆర్ అండ్ కో అక్కడ నుండి జారుకున్నారని అంటున్నారు. చంద్రబాబు ఏమీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా ఆసుపత్రికి రాలేదు. సోమవారం ఉదయం నుంచే చంద్రబాబు యశోదా అస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శిస్తారని మీడియా ప్రముఖంగా పేర్కొంది. అంటే చంద్రబాబు రాక గురించిన ముందస్తు సమాచారం లేకే కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత, సన్నిహిత బంధువు హరీష్ రావులు ఆస్పత్రిలో లేరని అనుకోవడానికి లేదు. ఒక వేళ ఆ సమయానికి వారికి వేరే పనులున్నా వాటిని రద్దు చేసుకునో, వాయిదా వేసుకును ఆసుపత్రి వద్ద చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు వారు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కేటీఆర్, కవితలు.   తమ తండ్రికి గురుతుల్యుడు, ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అన్నిటికీ మించి హైదరాబాద్ పురోగతిలో అత్యంత క్రియాశీల, కీలక పాత్రపోషించిన చంద్రబాబును రిసీవ్ చేసుకోకుండా ముఖం చాటేశారంటే.. అది అహంకారమా? ముఖం చూపించలేక తప్పుకున్నారా అంటూ నెటిజనులు పోస్టులు పెడుతున్నారు.     నారా చంద్రబాబు నాయుడు అంటే  కేసీఆర్ కు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నాయకుడు.  కేసీఆర్ కు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కడంలో చంద్రబాబు కీలకం కాగా.. చంద్రబాబు క్యాబినెట్ లో కేసీఆర్ మంత్రిగా కూడా పనిచేసారు. చంద్రబాబు మనిషిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక సమయం పాలించిన సీఎం, తెలుగు రాష్ట్రాలలో సుదీర్ఘ అనుభవమున్న నేత చంద్రబాబు. అలాంటి నాయకుడు సంస్కారంతో, మానవతా దృక్ఫథంతో  ఫలానా సమయానికి ఆసుపత్రికి వస్తున్నారని తెలిసికూడా కేసీఆర్ తరపున ఎవరూ లేకుండా వెళ్లిపోయారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఉండగా.. వైద్యులతో భేటీ వరకూ చంద్రబాబుతో ఉన్నారు. తీరా తండ్రి కేసీఆర్ ను పరామర్శించే సమయంలో కేటీఆర్ లేరు. అలాగే మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అక్కడ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కేసీఆర్ ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స ప్రారంభమైన సమయం నుండి దాదాపుగా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావులలో ఎవరో ఒకరు ఆసుపత్రి వద్ద ఉంటూ వస్తుండగా.. కేసీఆర్ కు వరసకు కుమారుడయ్యే ఎంపీ సంతోష్ కుమార్ కూడా కేసీఆర్ తోనే ఉంటున్నారు. అయితే, సరిగ్గా చంద్రబాబు వెళ్లే సమయానికి కేసీఆర్ తో ఎవరూ లేరు. చివరికి ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే ఎంపీ సంతోష్ కూడా సమాయానికి అక్కడ లేరు. దీంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. పరమరించేందుకు వెళ్లిన వారికి ఘన స్వాగతాలు ఏమీ అవసరం లేదు. కానీ, ఒక స్థాయి నేతలు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఉండడం మర్యాదగా భావించాలి. మరి కావాలనే చేశారో.. లేక అనుకోకుండా జరిగిందో కానీ.. చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శిస్తుండగా.. వైద్యులు తప్ప కేసీఆర్ కుటుంబంలో మరెవరూ కనిపించలేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక్కరే కాస్త దూరంగా కనిపించారు.

ముసుగులు తొలగిపోతున్నాయా?

బీఆర్ఎస్, బీజేపీ జుగల్ బందీ విషయంలో ఇక దాపరికం అక్కర్లేదనుకున్నారా? వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క సారి ఓడిపోగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అంటోందా? ఆ పార్టీకి అటువంటి సంకేతాలే ఇస్తోందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలలో  రాష్ట్రం నుంచి లోక్ సభ స్థానాల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తామని చెప్పకనే చెబుతోందా?  అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ఒక ట్వీట్ ఔననే సమాధానమే వచ్చేలా చేస్తోంది. ఔను అయోధ్య రామమందిరంపై కవిత చేసిన ట్వీట్ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది.  అయోధ్యలో సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతోపాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అంటూ కవిత చేసిన ఒక్క ట్వీట్ బీఆర్ఎస్ బీజేపీల జుగల్ బందీని తేటతెల్లం చేసింది.  ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లో ఉన్న తరుణంలో కవిత చేసిన తాజా ట్వీట్ దానిని ధృవీకరించేలా ఉంది. బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెట్టి మళ్లీ అధికారంలోకి రావడమే బీఆర్ఎస్ టార్గెట్. అంటే బీఆర్ఎస్, బీజేపీల టార్గెట్ కాంగ్రెస్. ఆ లక్ష్య సాధన కోసమే.. తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఆ రెండు పార్టీలూ ఎన్నో వ్యూహాలు పన్నాయి. ఎత్తులు వేశాయి. ఒక దశలో రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం బీజేపీయే తప్ప కాంగ్రెస్ కాదని కేసీఆర్ బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. సరే అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీల వ్యూహాలు, ఎత్తులూ బెడిసి కొట్టి కాంగ్రెస్  అధికారంలోకి వచ్చింది. అది పక్కన పెడితే.. ఇక నెలల వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలోనైనా కాంగ్రెస్ కు చెక్ పెట్టి, రాష్ట్రంలో జమిలిగా బలోపేతం కావాలన్న వ్యూహంలో భాగంగానే  కవిత రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనపై ట్వీట్ చేశారన్న చర్చ జోరందుకుంది.   ఈ రెండు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లేందుకు ఈ ట్వీట్ తొలి అడుగు అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

టీఎస్పీఎస్పీ చైర్మన్ రాజీనామా ఆమోదానికి గవర్నర్ నో.. ఎందుకంటే?

టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా ను గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టారు.   జనార్దన్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని  రాజ్ భవన్ వర్గాలు మంగళవారం (డిసెంబర్ 12) వెల్లడించాయి. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. అనంతరం టీఎస్ పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. ఆయన రాజీనామాను వెంటనే  గవర్నర్ ఆమోదించేశారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదని రాజ్ భవన్ స్పష్టం చేసింది.  పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారనీ, పేపర్ లీకేజీకి జనార్దన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ డీవోపీటీకి తమిళిసై లేఖ సైతం రాసినట్లు తెలుస్తోంది.  జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ నిర్వహించిన పలు పోటీ పరిక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ ఓడిపోవడంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలు కూడా ఒక  కారణం అని పరిశీలకులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం దానిని గవర్నర్ ఆమోదించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేపర్ లీకేజీ బాధితులపై చర్యలు రేవంత్ సర్కార్ గట్టి పట్టుదలతో ఉందనీ, ప్రభుత్వం కోరిన మీదటే గవర్నర్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టారని అంటున్నారు. 

కేసీఆర్​ను పరామర్శించిన సీఎం రేవంత్.. మతలబేంటి?

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు   తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగి ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   కేసీఆర్ కు ప్రముఖుల నుండి పరామర్శల వెల్లువ కొనసాగుతున్నది.   సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ మళ్ళీ త్వరగా కోలుకుని అసెంబ్లీ అడుగుపెట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం ఆసుపత్రి ఎండీ జి.సురేందర్‌ రావు, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు, డాక్టర్‌ జి.దేవందర్‌రావులతో కేసీఆర్‌ ఆరోగ్యంపై చర్చించారు. అక్కడ మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ను సీఎం కలుసుకోగా.. కేటీఆర్‌ భుజం తట్టి రేవంత్‌ ధైర్యం చెప్పారు. ఆసుపత్రి బయట రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  సీఎస్‌ను ఆదేశించాం. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నామని.. మంచి పాలన అందించడానికి ఆయన సలహాలు అవసరం అని అన్నారు. అయితే సీఎం రేవంత్ కేసీఆర్ ను పరామర్శించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బద్ద శత్రువులుగా కనిపించడం.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ పరిణామం కావడంతో రాజకీయ వర్గాలు కూడా ఈ సందర్భాన్ని ఆసక్తిగా పరిశీలించాయి. పరిధి దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇప్పుడు ఈ పరామర్శను పరిశీలకులు సైతం రకరకాల కోణాలలో విశ్లేషిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చర్చ కూడా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ప్రతి పక్షంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టించి ఇబ్బంది పెట్టింది. అక్రమ కేసులు పెట్టి వేధించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ను ఇలా రేవంత్ రెడ్డి పరామర్శించడాన్ని కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా అర్ధం చేసుకోగలరు? లేదా అసలు ఏదైనా వ్యూహంలో భాగంగానే ఈ పని చేశారా అనే భావనలు చర్చకు వస్తున్నాయి. అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ ను కనీసం అభినందించని కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడమేంటని కొందరంటుంటే.. అలా పరామర్శించి కేసీఆర్ అహంకారంపై రేవంత్ దెబ్బ కొట్టారని కొందరంటున్నారు.  నిజానికి రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని సమర్ధించేవాళ్లు ఎంత మంది ఉన్నారో.. వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. వీరిలో కాంగ్రెస్ పైన ప్రేమ, రేవంత్ రెడ్డి పైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు.  రేవంత్ చేసిన ఈ పని అణగారి పోతున్న రాజకీయ విలువలకు ప్రాణం పోసినట్లుగా కొందరు విశ్లేషిస్తుంటే.. ఇది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమే అన్నట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో ప్రతి క్షణం నిప్పులు చెరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించి సమాజానికి ఏం సందేశమిచ్చారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే లెక్కలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగిన కార్యకర్తలు కొందరు ఇప్పుడు రేవంత్ కేసీఆర్ ను పరామర్శిండాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు.  కేసీఆర్ ను  పరామర్శించిన రేవంత్ ను సోషల్ మీడియాలో కొందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాజకీయాలలో విమర్శలతో పాటు విలువలు కూడా ఉండాలని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ విషయంలో  కాంగ్రెస్ ను భుజాల మీద మోసిన కార్యకర్తలు పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఏపీ నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డికి రిప్లై ఇచ్చిన రేవంత్.. చంద్రబాబు, లోకేష్ కి రిప్లై ఇవ్వలేదు.  ఇది కూడా ఏదైనా వ్యూహంలో భాగమా అనేది కూడా చర్చ కూడా జరుగుతున్నది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేలా కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లింది. అయితే, రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు జరిగే పరిణామాలను ఆయుధంగా తీసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనేలా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఏపీ నేతలతో ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేనేమో రేవంత్ అండ్ కో  తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ నేతలతో ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ విలువల పేరిట రాజకీయాలలో కొత్త ఒరవడికి  తెరతీస్తున్నట్లే కనిపిస్తుంది. అయితే, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు వెలికి తీసే విషయంలో మాత్రం రేవంత్ కరుకుగా, కఠినంగా ఉండాలని పరిశీలకులు అంటున్నారు. సామాన్య ప్రజలూ అదే కోరుకుంటున్నారు.