ప్రశ్నిస్తే దేశద్రోహమేనా?
posted on Dec 16, 2023 5:43AM
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలకు అంతూ పొంతూ లేదన్న విషయం తెలిసిందే. అడుగడుగునా పాలకులు ప్రజల గొంతు నొక్కి తమ పాలనపై వేలెత్తి చూపే వాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, సాహసించి ప్రశ్నిస్తే పోలీసు కేసులు, సీఐడీ విచారణలతో వారిని వేధించి దేశద్రోహం కేసులు బనాయించేందుకు కూడా వెనకాడకుండా పాలన సాగిస్తున్నారని మేధావులు, పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి జగన్ సర్కార్ వేధింపులను భరించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు జీవచ్ఛవాలుగా బ్రతుకీడిస్తున్నారు. నాడు కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ నుండి.. రోడ్లు సరిగాలేవని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విద్యార్థుల వరకూ.. ప్రజల సమస్యలపై స్పందించిన ఎందరినో ఏపీ ప్రభుత్వం వేధించి హింసించి నరకం చూపించింది. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయి అణిచివేత చూడలేదు. కానీ, జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి ప్రశ్నించే వారి ఆచూకీ లేకుండా చేయడమే పనిగా పెట్టుకుంది.
అలాంటి వారిలో ఒకరే గుంటూరు రంగనాయకమ్మ. శంకర్ విలాస్ యజమానురాలిగా, సామాజిక కార్యకర్తగా పూంతోట రంగనాయకి గుంటూరులో అందరికీ సుపరిచితమే. అప్పట్లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ విషవాయువుల వలన 15 మంది చనిపోయినట్లు అధికారికంగా గుర్తించగా.. ఎందరో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. లీకైన విషవాయువులు 3 కిలోమీటర్ల వరకూ వ్యాపించగా.. ప్రజల చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస ఇబ్బందులతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోగా పశువులు, ఇతర మూగజీవాలు పిట్టల్లా రాలిపోయాయి. ఈ దుర్ఘటనపై రంగనాయకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 20 పాయింట్లతో ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. ప్రభుత్వం ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ పోలీసులు ఆమెపై డజనుకుపైగా కేసులు బనాయించి వేధించి చిత్రహింసలకు గురి చేశారు.
కనీసం వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా దూషణలకు దిగారు. వైసీపీ సోషల్ మీడియా అయితే ఆమెపై దేశద్రోహి ముద్ర వేసి పోస్టులు పెట్టారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ.. ఎంపీల నుండి సలహారుల వరకూ అందరూ ఆమెను సోషల్ మీడియాలో వేధించి ప్రత్యక్ష నరకం చూపించారు. ఇండియాలోని రకరకాల ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుండి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆమెకి బెదిరింపు కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. తన కుటుంబంపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టి చివరికి ఆమె ఇంటి నుండి బయటకి వెళ్లేందుకు కూడా భయపడేలా చేశారు. దీంతో ఆమె జీవితం నరకప్రాయమైంది. చివరికి దశాబ్దాల చరిత్రగల వారి శంకర్ విలాస్ హోటల్ ను కూడా నడిపించలేక వేరేవారికి లీజుకిచ్చేయాల్సి వచ్చింది. అద్దెకి ఇవ్వడంపై కూడా స్థానిక వైసీపీ నేతలు ఆమె కుటుంబంపై ఎన్నో రకాల ఒత్తిళ్లు తెచ్చారు. చివరికి ఆమె గుంటూరు వదిలి బ్రతుకు జీవుడా అనుకుంటూ హైదరాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రశ్నించిన పాపానికి ఒక వృద్ధురాలిని జగన్ సర్కార్ ఏ స్థాయిలో రాచిరంపాన పెట్టిందో, ఆమె వివరించారు. చివరికి సమాజంలో తనను ఒక మనిషిగా కూడా లెక్కలో లేకుండా చేశారని, చుట్టుపక్కల ప్రజలు తమతో మాట్లాడేందుకు కూడా భయపడేలా చేశారనీ, తమకి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే మీరు మాకు తెలియదని చెప్పమంటూ దూరం పెట్టారని కొండంత బాధను దిగమింగుతూ ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిజ. ఆమె మాటలు, ఆమె మాటల వెనక బాధను చూసిన నెటిజన్లు జగన్ ప్రభుత్వపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో ఈమెకి జరిగిన అన్యాయమే తేటతెల్లం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.