వాడుకొని వదిలేశారా?
posted on Dec 17, 2023 @ 11:21AM
తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఇది అతికే పొత్తు కాదని రాజకీయ వర్గాలలో అప్పుడే చర్చ జరిగింది. అయినా అప్పటికప్పుడు బీజేపీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు పడుతున్నట్లే కనిపించారు. ప్రచారంలో ఆయన పాల్గొన్న సభలలో ఆయన కదలిక ఒకింత ఇబ్బందికరంగానే కనిపించింది కూడా. సరే ఇక ఫలితాల విషయానికి వస్తే బీజేపీ కేవలం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా జనసేన అయితే అసలు ఖాతా కూడా తెరవలేదు. దీంతో ఈ పొత్తు వలన బీజేపీ, జనసేనలలో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్నదానిపై రకరకాల విశ్లేషణలు సాగాయి. నిజానికి బీజేపీ మొదట ఒంటరిగానే బరిలోకి దిగేందుకు ఆలోచన చేసింది. ఈ మేరకు ప్రకటనలు కూడా చేసింది.
తీరా ఎన్నికల సమయానికి పార్టీ బలహీనంగా ఉందన్న విషయం తెలిసి వచ్చి కనీసం మూడవ ప్రత్యామ్నాయంగా అయినా కనిపించాలంటే జనసేన కూడా కలవాలని భావించింది. అందుకే జనసేనానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ పార్టీని పొత్తుకు ఒప్పించింది. అయితే, తెలంగాణలో బలంగా వీచిన కాంగ్రెస్ గాలిలో రెండు పార్టీలు కొట్టుకుపోయాయి .
అయితే, జనసేన కారణంగానే తమకు సీట్లు తగ్గాయని తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం నేతలు విమర్శలు ఆరంభించారు. జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వలనే బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైందని తెలంగాణ బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని భావించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన కూడా చేసేశారు. మరో పది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని.. అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని, అలాగే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నాయకులు ఒంటరిగానే సిద్ధం కావాలని కిషన్ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉండేందుకు, ఆయనను దూరంగా ఉంచేందుకు సిద్ధపడినట్లు అర్ధమవుతున్నది. .
అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మన అవసరం ఉందని మనతో బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకుందని, బీజేపీ నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీలో పార్టీ శ్రేణులకు చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు బీజేపీ పవన్ కల్యాణ్ అవసరం లేదని భావిస్తున్నట్లే అర్ధం చేసుకోవాలి. మొత్తంగా తెలంగాణలో బీజేపీ, జనసేన బంధం ఎన్నికల నాలుగు రోజులకే కలిసి.. ఎన్నికల ఫలితాలొచ్చాక నాలుగు రోజులకే తెగిపోయింది. అయితే బీజేపీ తనకు తానే జనసేనను కలుపుకోవడం, ఇప్పుడు తనకు తానే రాంరాం చెప్పేయడం చూస్తే అప్పటికప్పుడు అవసరానికి వాడుకొని వదిలించుకున్నట్లే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనతో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రయోజనం పొందిందా లేదా అన్న విశ్లేషణలను పక్కన పెడితే.. ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు లేకుండానే పొత్తు బంధాన్ని బీజేపీ తెంచేసుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చర్చకు దారితీస్తున్నది.
తెలంగాణలో పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నెరవేర్చాలకున్న లక్ష్యం నెరవేరలేదని చెప్పుకోవాలి. తెలంగాణలో బీజేపీకి అధికారం కన్నా.. తన ఉనికిని చాటుకోవడంతో పాటు బీఆర్ఎస్ కు మళ్ళీ అధికారం దక్కేలా చేయడమే కర్తవ్యం. బీజేపీకి అధికారంలోకి వచ్చే స్థాయి లేదన్నది ఆ పార్టీ పెద్దలకు కూడా తెలిసిన నిజమే కనుక.. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచడమే. కాంగ్రెస్ ముక్త భారత్ ఆ పార్టీ లక్ష్యం, అంటే కాంగ్రెస్ బీజేపీ ప్రథమ రాజకీయ ప్రత్యర్థి. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ గెలిస్తే మంచిదని బీజేపీ భావించింది. అందుకు పవన్ కల్యాణ్ ను కూడా వాడుకుంది. కానీ, ఫలితం లేకపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలువరించలేకపోయిన బీజేపీ ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని మొదలు పెట్టింది. అంతే ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ కు బైబై చెప్పేసింది. అసెంబ్లీ ఎన్నికలలో జనసేనను దగ్గర చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు అవసరం లేదని పక్కకి నెట్టేసింది. ఏపీలో ఇప్పటికీ జనసేన తమతో పొత్తులోనే ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.