తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన డిఎస్పి నళిని ఏమయ్యారు?
posted on Dec 16, 2023 @ 10:06AM
ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ ( ప్రస్తుతం బిఆర్ఎస్) ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టారు. ఉద్యమ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ ఈ ఎన్నికలలో ప్రజలు ఉద్యమ పార్టీకి చీ కొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పట్టం కట్టారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఉద్యమ సమయంలో త్యాగాలు చేసిన వారిని గుర్తుపెట్టుకుని వారి సేవలను తిరిగి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ డిఎస్పి నళినికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్దమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె ఏమయ్యారు? నళిని గురించి ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. 2014లో ఉద్యమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ పేరుతో ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు. వీరిలో ఎంతో మంది అనర్హులు కూడా ఉన్నారు. ఆ మాటకొస్తే.. తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసినవాళ్లు కూడా అధికారాన్ని, రాజభోగాలను అనుభవించారు. మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన నళినికి న్యాయం ఎందుకు జరగలేదు?
కాలం గిర్రున తిరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో మళ్లీ నళిని పేరు వార్తల్లోకి వచ్చింది. ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. కొంత మంది జర్నలిస్టులు నళినిని సంప్రదించే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. అది విని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నళినిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు.నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. తనను ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నా ఉద్యోగానికి న్యాయం చేయలేననని తెలిపారు. 12 ఏళ్లు గ్యాప్ రావడం వల్ల సర్వీస్ రూల్స్ ఒప్పుకోవని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోయిందని వెల్లడించారు. ఒకవేళ కాదు, కూడదని ఉద్యోగంలోకి తీసుకున్నా.. కోర్టులో చిక్కులు ఎదురవుతాయని వివరించారు. ‘న్యాయం చేయలేను..’ అంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు.