లోకేష్ యువగళం.. మేకోవర్ ఆఫ్ ది లీడర్!
వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం పేరు నారా లోకేష్. ప్రత్యర్థుల ఎగతాళి మాటల నుండి పుట్టిన విస్ఫోటనం నారా లోకేష్. పని తీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్దత గల కార్యదక్షుడు లోకేష్. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్ష పూరిత రాజకీయాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖ బుద్దితో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో విసిగిపోయిన ప్రజలకు అండగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది.
సోమవారం(డిసెంబర్ 18) విశాఖలోని శివాజీనగర్ లో ఈ యాత్ర పరిసమాప్తం అయ్యింది. సాయంత్రం 5 గంటలకు శివాజీనగర్ లో శిలాఫలకం ఆవిష్కరించి పాదయాత్ర ముగించారు నారా లోకేష్. పాదయాత్ర ముగింపు సభ బుధవారం (డిసెంబర్20) జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. సభా వేదిక నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరౌతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విజయోత్సవ సభకు తెలుగుదేశం శ్రేణులు తరలి వచ్చాయి. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు లోకేశ్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగించారు.
కాగా, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 3,132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేశ్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామాన్ని ఇచ్చి మళ్ళీ పునఃప్రారంభించి నేడు ముగిస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర చిత్తూరులో 14 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు 577 కిమీ, అనంతపురం జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లో 23 రోజులు 303 కిమీ, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు 507 కిమీ, కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు 16 రోజులుపాటు 200 కిమీ, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 31 రోజులుపాటు 459 కిమీ, ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 17 రోజులపాటు 220 కిమీ, గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 16 రోజులుపాటు 236 కిమీ, కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8 రోజులుపాటు 113 కిమీ, పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు 11 రోజులుపాటు 225.5 కిమీ, తూర్పుగోదావరి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 12 రోజులుపాటు 178.5 కిమీ, విశాఖపట్నం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 7 రోజులుపాటు 113 కిమీ మేర పాదయాత్ర సాగింది.
లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. లోకేష్ ఈ యాత్రతో ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ప్రత్యర్ధులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల నుండి పాదయాత్రకు లభించిన భారీ స్పందనే ఈ యాత్రను ఇక్కడ వరకు నడిపించింది. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడిచి, ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకున్నారు లోకేష్. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయని చెప్పొచ్చు.
లోకేష్ పాదయాత్రలో కాళ్ల బొబ్బల కథలు లేవు.. వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్ల ప్రచారం లేదు. కాళ్లకు బొబ్బలని, చేతులకు గాయాలని డ్రామాలు, సెంటిమెంట్ రగిల్చేందుకు ప్రయత్నాలూ లేవు. కావాలని ప్రత్యర్థులను తూలనాడి అల్లర్లు చేయడం అసలే లేదు. పెయిడ్ ఆర్టిస్టులతో సెంటిమెంట్ పండించేందుకు నాటకాలు లేవు. పాదయాత్ర వెళ్లిన చోట పేదవాళ్ళు పెట్టే బుక్కెడు బువ్వను కడుపులోకి పోకుండా పెదవులను తాకించి ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు. కేవలం ప్రజల సమస్యలే ధ్యేయంగా పదునైన మాటలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేశారు. లోకేషా.. పాదయాత్రనా అని ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే శభాష్ లోకేష్ అనిపించుకున్నారు.
పగలు పాదయాత్ర, సాయంత్రం సభ, విరామ సమయంలో నేతలు, కార్యకర్తలతో మాటా మంతీ.. ఇలా ఆయన పాదయాత్రలకు కొత్త నిర్వచనం చెప్పారు. మొత్తంగా పాదయాత్రకు ముందు లోకేష్ వేరు. పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. మాట తీరు మారింది.. నడవడిక మారింది. నేతలను ఆప్యాయంగా పిలవడం తెలిసింది.. ప్రజలకు అండగా ఉండడం తెలుసుకున్నారు. లోకేష్ ఒక పరిపూర్ణ నేతగా తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఈ పాదయాత్ర ఎంతగానో దోహదపడింది. పరిణితి చెందిన, విలువలు తెలిసిన నాయకుడిగా పరిశీలకుల మన్ననలందుకుంటున్నారు లోకేష్