వ్యతిరేకత సిట్టింగుల మార్పునకు కొలమానం అయితే.. మరి జగన్ స్థానంలో ఎవరు?
posted on Dec 16, 2023 8:28AM
ఈసారి షెడ్యూల్ కంటే ముందే సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు చెబుతున్నారు. అంటే ఏపీలో కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే మార్చి మొదటి వారం లేదా ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. శుక్రవారం(డిసెంబర్ 15) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కూడా ఇదే విషయం చెప్పారు. మరోసారి అధికారం దక్కించుకోవాలని జగన్ పలు విధాలుగా పావులు కదుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రంగా అసంతృప్తి కనిపిస్తున్నది. ఈ విషయం వైసీపీ పెద్దలకు కూడా బోధపడింది. దీంతో గెలుపు మార్గాల కోసం వెతుకులాడుతున్న సీఎం జగన్ ఎమ్మెల్యేల స్థానాల మార్పు అనే కొత్త ఆటకు తెరతీశారు. ఎక్కడికక్కడ ఇన్ చార్జీలను మార్చేసి ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. పనితీరు సరిగా లేదని, ప్రజలలో అసంతృత్తి ఉందని మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సహా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్ మరో 45 మందితో ఇలా మార్చేయనున్న వారి రెండో జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఇక సీఎం జగన్ షెడ్యూల్ కంటే ఓ పది పదిహేను రోజులు ముందుగానే ఎన్నికలకు జరిగితే బాగుండునని భావిస్తున్నారు. మార్చి , ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు ఉంటాయనీ, దాని వల్ల తన పనితనంపై కోపంతో ప్రజలు తనను సాగనంపడానికి బటన్ నోక్కుతారనీ భయపడుతున్నారు. ఆ భయాన్ని ఆయన ఏ మాత్రం దాచుకోవడం లేదు. అందుకే కేబినెట్ సమావేశంలో పదిహేను రోజులు ఏపీలో ముందుగా ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి పదో తేదీలోపు .. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2019లో అదే చేశారు. ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించి ఎప్పుడో జూన్ లో ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఏపీ తెలంగాణలకు సంబంధించినంత వరకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే షెడ్యూల్ ప్రకటించిన రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్.. ఆ తర్వాత నెల రోజుల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎలా చూసినా.. ఫిబ్రవరిలో షెడ్యూల్ ప్రకటించినా.. ఏప్రిల్ వరకూ పోలింగ్ ఉంటుంది. కానీ అంత కంటే ముందే పోలింగ్ జరగాలని జగన్ రెడ్డి కోరుకుంటున్నారు. అందుకే ముందుగానే టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అంత కన్నా ముందుగానే ఎన్నికలు పెట్టాలన్నట్లుగా వైసీపీ నేతలు .. ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చి ఉంటారని కూడా భావిస్తున్నారు. జగన్ రెడ్డికి అంత కంగారు ఉంటే.. తెంలగాణ ఎన్నికలతో వెళ్లిపోయినా బాగుండేదని వైసీపీలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, అప్పుడు ఏపీలో తన విజయానికి తెలంగాణ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న గట్టి నమ్మకంతో జగన్ అప్పట్లో ముందస్తుకు వెనకడుగు వేశారనీ, ఇప్పుడు తెలంగాణలో తన అంచనాలు తప్పు కావడంతో కంగారు పడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాగర్ నీరు అంటూ తెలంగాణ ఎన్నికలకు గంటల ముందు ఆ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి కేసీఆర్ కు మేలు చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం అవ్వడమే కాకుండా, ఏపీ ఎన్నికలలో తనకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారనీ, షెడ్యూల్ కంటే కనీసం ఓ పది పదిహేను రోజుల ముందు ఏపీలో ఎన్నికలు జరిగితే.. ప్రజల విద్యుదాగ్రహం ప్రభావం పెద్దగా ఉండదనీ ఆశపడుతున్నారు. మొత్తం మీద నిండా మునిగిపోయిన జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటేనే గజగజలాడుతున్నారు.
ఇక ఎమ్మెల్యేలను మార్చేస్తే గట్టెక్కేస్తానని ఆశపడుతున్న జగన్ కు అది కూడా కొడిగట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజంగా ప్రజా వ్యతిరేకత కొలమానంగా సిట్టింగులను మార్చాలని జగన్ భావిస్తుంటే ముందుగా జగన్ తన స్థానాన్ని ఎక్కడకు మార్చోవాలో నిర్ణయించుకోవాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ వర్గాలు కూడా అదే అంటున్నాయి.