రేపటి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
posted on Dec 22, 2023 @ 11:11AM
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభంకానున్నాయి. వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు ఇక్కడ 6 నెలలు దక్షిణాయణం.వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాలలో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం.తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతి, తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లోని 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా భక్తులు పోటెత్తడంతో ముందుగానే టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, పరిసరాల్లో అత్యవసర సమయాల కోసం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం వేకువజామున 1.45 నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించనున్నారు. విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు.